
న్యూఢిల్లీ: శత్రు దేశాల పౌరులకు భారతీయ సంస్థల్లో ఉన్న షేర్ల విక్రయానికి సంబంధించిన విధివిధానాలను త్వరలో ప్రకటించనున్నట్లు కేంద్ర డిజిన్వెస్ట్‌మెంట్ విభాగం వెల్లడించింది. జప్తు చేసిన ఆస్తుల వేలంలో అనుభవం ఉన్న ప్రభుత్వ ఏజెన్సీలు, రెవెన్యూ విభాగం మొదలైన వాటితో సంప్రతించి వీటిని ఖరారు చేయనున్నట్లు వివరించింది. ఈ తరహా విక్రయ ప్రక్రియ చేపడుతుండటం ఇదే ప్రథమం కావడంతో మర్చంట్ బ్యాంకర్ ఒకరు సరిపోతారా లేదా మరింత మంది అవసరమవుతారా అన్నది పెట్టుబడులు, ప్రభుత్వ ఆస్తుల నిర్వహణ విభాగం (దీపం) నిర్ణయిస్తుందని సంబంధిత వర్గాలు తెలిపాయి.
ఇందుకు కాస్త సమయం పట్టొచ్చని, మొత్తం మీద వచ్చే ఆర్థిక సంవత్సరం దాకా ఈ ప్రక్రియ కొనసాగవచ్చని వివరించాయి. డిజిన్వెస్ట్‌మెంట్ లక్ష్యాలు సాధించేందుకు, ఎన్నికల వేల సంక్షేమ పథకాల కోసం మరిన్ని నిధులు సమకూర్చుకునేందుకు శత్రు దేశాల పౌరుల షేర్లను విక్రయించే అంశానికి కేంద్ర క్యాబినెట్ గతవారం సూత్రప్రాయంగా ఆమోదముద్ర వేసిన సంగతి తెలిసిందే. వీటి విలువ సుమారు రూ. 3,000 కోట్ల మేర ఉండొచ్చని అంచనా. ఈ ఆర్థిక సంవత్సరంలో ప్రభుత్వ రంగ సంస్థల్లో వాటాల ఉపసంహరణ (డిజిన్వెస్ట్‌మెంట్) ద్వారా కేంద్రం రూ. 80,000 కోట్లు సమీకరించాలని భావించినప్పటికీ, వాటాల విక్రయం ద్వారా ఇప్పటిదాకా రూ. 15,000 కోట్లు సమీకరించగలిగింది.
Comments
Please login to add a commentAdd a comment