న్యూఢిల్లీ: హెలికాప్టర్ సర్వీసుల పీఎస్‌యూ పవన్ హన్స్ లో వ్యూహాత్మక వాటా విక్రయానికి బ్రేక్ పడింది. బిడ్డింగ్‌లో విజయవంతమైన కన్సార్షియంలోని ఒక కంపెనీపై న్యాయపరమైన వివాదాలరీత్యా అనర్హతవేటు పడటం దీనికి కారణమని దీపమ్ పేర్కొంది. వెరసి పవన్ హంస్ ప్రయివేటైజేషన్ ప్రయత్నాలకు మూడోసారి చెక్ పడింది.
బిడ్‌ను గెలుపొందిన స్టార్9 మొబిలిటీ ప్రయివేట్ లిమిటెడ్ కన్సార్షియంలోని అల్మాస్ గ్లోబల్ అపార్చునిటీ ఫండ్ ఎస్‌పీసీపై పెండింగ్ కేసుల నేపథ్యంలో ప్రభుత్వం పవన్ హంస్ డిజిన్వెస్ట్‌మెంట్ నిర్ణయాన్ని రద్దు చేసినట్లు దీపమ్ తెలియజేసింది. భాగస్వామ్య కంపెనీ పవన్ హంస్‌లో ప్రభుత్వానికి 51 శాతం, ఇంధన రంగ పీఎస్‌యూ దిగ్గజం ఓఎన్‌జీసీకి 49 శాతం చొప్పున వాటా ఉంది.
2018లో షురూ: తొలుత పవన్ హన్స్ లో గల 51 శాతం వాటా విక్రయానికి ప్రభుత్వం 2018లో బిడ్స్‌కు ఆహ్వానం పలికింది. అయితే ఓఎన్‌జీసీ సైతం 49 శాతం వాటాను విక్రయించేందుకు సిద్ధపడటంతో నిర్ణయాన్ని వెనక్కి తీసుకుంది. 2019లో తిరిగి కంపెనీలో 100 శాతం వాటా విక్రయానికి బిడ్స్‌ను ఆహ్వానించినప్పటికీ స్పందన లభించకపోవడం గమనార్హం! ప్రభుత్వం 2020 డిసెంబర్‌లో మూడోసారి పవన్ హన్స్ విక్రయానికి తెరతీసింది.
కంపెనీ కొనుగోలుకి ఆసక్తి వ్యక్తీకరణ(ఈవోఐ) బిడ్స్‌ను ఆహ్వానించింది. 2022 ఏప్రిల్‌లో స్టార్9 మొబిలిటీ కన్సార్షియం గరిష్ట బిడ్డర్‌గా నిలిచింది. కన్సార్షియంలో అల్మాస్ గ్లోబల్ అపార్చునిటీసహా.. బిగ్ చార్టర్ ప్రయివేట్ లిమిటెడ్, మహరాజ ఏవియేషన్ ప్రయివేట్ లిమిటెడ్ సైతం భాగస్వాములుగా ఉన్న సంగతి తెలిసిందే.
Comments
Please login to add a commentAdd a comment