ఇండియా సిమెంట్స్‌పై డీమార్ట్‌ కన్ను! | Dmart Damani may takeover India Cements | Sakshi
Sakshi News home page

ఇండియా సిమెంట్స్‌పై డీమార్ట్‌ కన్ను!

Published Wed, Jun 17 2020 10:46 AM | Last Updated on Wed, Jun 17 2020 11:07 AM

Dmart Damani may takeover India Cements  - Sakshi

దక్షిణాది దిగ్గజం ఇండియా సిమెంట్స్‌పై రాధాకిషన్‌ ఎస్‌ దమానీ కన్నేసినట్లు తెలుస్తోంది. డీమార్ట్‌ స్టోర్ల నిర్వాహక సంస్థ ఎవెన్యూ సూపర్‌మార్ట్స్‌ అధినేత రాధాకిషన్‌ దమానీ ఇటీవల ఇండియా సిమెంట్స్‌లో వాటాలు కొంటూ వస్తున్నారు. తాజాగా దమానీ కుటుంబ సభ్యుల వాటా ఇండియా సిమెంట్స్‌లో 19.89 శాతానికి చేరింది. ఈ ఏడాది(2020) మార్చికల్లా ఇండియా సిమెంట్స్‌లో దమానీ కుటింబీకుల వాటా 19.89 శాతంగా నమోదైంది. ఈ నేపథ్యంలో ఇండియా సిమెంట్స్‌ కౌంటర్‌కు డిమాండ్‌ పెరిగింది. ఇన్వెస్టర్లు కొనుగోళ్లకు ఎగబడటంతో తొలుత ఎన్‌ఎస్‌ఈలో 10 శాతం దూసుకెళ్లింది. రూ. 140 వరకూ ఎగసింది. వెరసి 52 వారాల గరిష్టానికి చేరింది. తదుపరి కొంతమేర వెనకడుగు వేసింది. ప్రస్తుతం 4 శాతం జంప్‌చేసి రూ. 131 వద్ద ట్రేడవుతోంది. కాగా.. ఎవెన్యూ సూపర్‌మార్ట్స్‌ షేరు 1 శాతం క్షీణించి రూ. 2384 వద్ద కదులుతోంది. 

5 శాతం నుంచి
నిజానికి రాధాకిషన్‌ దమానీ 2019 డిసెంబర్‌కల్లా ఇండియా సిమెంట్స్‌లో 4.73 శాతం వాటాను పొందారు. తదుపరి మరింత వాటాను కొనుగోలు చేయడంతో ప్రస్తుతం 10.29 శాతానికి ఎగసింది. మరోవైపు సోదరుడు గోపీకిషన్‌ దమానీ సైతం ఇండియా సిమెంట్స్‌లో 8.26 శాతం వాటాను సొంతం చేసుకున్నారు. కాగా.. ఇండియా సిమెంట్స్‌ కంపెనీలో నియంత్రిత వాటాను సొంతం చేసుకునే యోచనలో డీమార్ట్‌ అధినేత రాధాకిషన్‌ దమానీ ఉన్నట్లు ఆంగ్ల మీడియా పేర్కొంది. గతేడాది(2019-20) క్యూ3లో ఇండియా సిమెంట్స్‌ స్టాండెలోన్‌ ప్రాతిపదికన రూ. 5.4 కోట్ల నికర నష్టం ప్రకటించింది. అమ్మకాలు రూ. 1316 కోట్ల నుంచి రూ. 1191 కోట్లకు తగ్గాయి. క్యూ4(జనవరి-మార్చి) ఫలితాలు ప్రకటించవలసి ఉంది. ఈ నెల 24న నిర్వహించనున్న బోర్డు సమావేశంలో క్యూ4 ఫలితాలు వెల్లడించనున్నట్లు కంపెనీ బీఎస్‌ఈకి తెలియజేసింది.

72 శాతం ర్యాలీ
ఇండియా సిమెంట్స్‌ షేరు 2019 ఆగస్ట్‌ 23న రూ. 68 వద్ద 52 వారాల కనిష్టాన్ని తాకింది. తదుపరి ఇటీవల దమానీ వాటా కొనుగోలు వార్తలతో ర్యాలీ బాట పట్టింది. ఫలితంగా ఇప్పటివరకూ 72 శాతం ర్యాలీ చేసింది. ఇండియా సిమెంట్స్‌ను స్నేహపూర్వకంగా టేకోవర్‌ చేసే బాటలో కంపెనీ చైర్మన్‌ ఎన్‌ శ్రీనివాసన్‌తో రాధాకిషన్‌ దమానీ చర్చలు కొనసాగిస్తున్నట్లు సంబంధిత వర్గాలు పేర్కొంటున్నాయి. అయితే డీమార్ట్‌ ప్రతినిధి ఒకరు ఈ అంశంపై స్పందించేందుకు నిరాకరించగా.. ఇండియా సిమెంట్స్‌ ప్రతినిధి తోసిపుచ్చినట్లు మీడియా పేర్కొంది. కాగా.. నేటి ట్రేడింగ్‌లో ఇండియా సిమెంట్స్‌ కౌంటర్లో ఇప్పటివరకూ 8.52 లక్షల షేర్లు చేతులు మారాయి. ఇది రెండు వారాల సగటు పరిమాణంకంటే రెండు రెట్లు అధికంకావడం గమనార్హం!

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement