దేశీయ డిమాండ్, ఎగుమతులే చోదకం
భారత్‌పై ఎస్ అండ్ పీ నివేదిక
న్యూఢిల్లీ: అంతర్జాతీయ అనిశ్చిత పరిస్థితులు, దేశీయ విధానపరమైన మార్పుల ప్రభావాన్ని అధిగమించేందుకు కంపెనీలకు బలమైన స్థానిక డిమాండ్, ఎగుమతుల పరంగా ధరలతో పోటీపడే సామర్థ్యం అక్కరకు వస్తాయని ఎస్‌అండ్‌పీ గ్లోబల్ రేటింగ్స్ తెలిపింది. ఆర్థికంగా వేగవంతమైన వృద్ధి, సంస్కరణలు భారత్‌ను ఓ చక్కని మార్కెట్‌గా మార్చాయని ‘ఇండియా కార్పొరేట్ అవుట్‌లుక్ 2017’ నివేదికలో ఎస్‌అండ్‌పీ పేర్కొంది.
భారత్‌లో ఆరోగ్యవంతమైన ఆర్థిక వృద్ధి, వడ్డీ రేట్ల తగ్గుముఖం సైతం కంపెనీలకు లబ్ధి కలిగిస్తాయని తెలిపింది. ‘‘అంతర్జాతీయ కంపెనీలతో పోలిస్తే భారత కంపెనీలు మంచి స్థితిలో ఉన్నాయి. మూలధన వ్యయ నిర్వహణ సామర్థ్యం, కొనసాగుతున్న సంస్థాగత సంస్కరణలను వేగంగా సర్దుబాటు చేసుకోగల సామర్థ్యాలు భారత కంపెనీలకు ఉండడం కలసి వస్తుంది’’ అని ఎస్‌అండ్‌పీ గ్లోబల్ రేటింగ్స్ క్రెడిట్ అనలిస్ట్ అభిషేక్ దంగా పేర్కొన్నారు. ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో డీమోనిటైజేషన్ వల్ల స్వల్ప కాలం పాటు ఆదాయ వృద్ధికి సమస్య ఉందని, జీఎస్టీని అమల్లోకి తేవాలన్న ప్రతిపాదన వల్ల 2018లో ఇదే విధమైన సవాలు ఎదురవుతుందని తెలిపింది.