రవి శంకర్ ప్రసాద్ (ఫైల్ ఫోటో)
బెంగళూరు : ఆధార్‌ను ఓటర్ ఐడీతో అనుసంధానం చేయడంపై కేంద్ర ఐటీ మంత్రి రవిశంకర్ ప్రసాద్ కీలక వ్యాఖ్యలు చేశారు. ఆధార్ కార్డులను ఓటర్ ఐడీలతో లింక్ చేయడాన్ని తాను వ్యక్తిగతంగా సమర్థించనని వ్యాఖ్యానించారు. ఈ రెండు వేర్వేరు అవసరాలకు ఉపయోగపడుతున్నాయని పేర్కొన్నారు. ‘ఐటీ మంత్రిగా నేను ఇది చెప్పడం లేదు. నా వ్యక్తిగత అభిప్రాయం ప్రకారం ఆధార్‌ను ఓటర్ ఐడీ కార్డుతో లింక్ చేయకూడదు’ అని ప్రసాద్ అన్నారు. అయితే ప్రజల గూఢాచార్య ఆరోపణలు ఎదుర్కొనేందుకు ప్రభుత్వం సిద్ధంగా లేదని పేర్కొన్నారు. ఒకవేళ తాము అలా చేయదలిస్తే.. మనం ఏం తింటున్నాం, మనం ఏం సినిమా చూస్తున్నాం అనే అన్ని విషయాలు ప్రధాని మోదీ ట్యాప్ చేసే అవకాశాలున్నాయని, ఇలా జరగాలని తాను కోరుకోవడం లేదని మంత్రి చెప్పారు.
మీ ఈపీఐసీ కార్డు ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియా వెబ్ పోర్టల్‌కు లింక్ అయి ఉంటుంది. దీనిలో ప్రజలకు ఎన్నికలకు సంబంధించిన డేటా పోలింగ్ బూత్ వివరాలు, అడ్రస్‌లు మాత్రమే ఉంటాయి. కానీ ఆధార్ దానికి సంబంధించి కాదని మంత్రి అన్నారు. అయితే బ్యాంకు అకౌంట్లకు ఆధార్‌ను లింక్ చేయడాన్ని మాత్రం ఆయన గట్టిగా సమర్థిస్తున్నారు. ప్రత్యక్ష ప్రయోజన బదిలీ ద్వారా సంక్షేమ పథకాల ప్రయోజనాలు ప్రజలకు చేరవేయడంలో పారదర్శకతను చూడవచ్చని చెప్పారు. ఆధార్ ఆఫ్ మోదీకి, ఆధార్ ఆఫ్ మన్మోహన్ సింగ్‌కు మధ్య చాలా తేడా ఉందని ఆయన ఎత్తి చూపారు. మోదీ ఆధార్‌కు చట్టం సపోర్టు ఉంటే, సింగ్ ఆధార్‌కు ఎలాంటి చట్టం సపోర్టు లేదన్నారు. కేంద్ర జామ్(జన్ ధన్, ఆధార్, మొబైల్ నెంబర్లు) పథకం కింద 80 కోట్లకు పైగా మొబైల్ ఫోన్లు బ్యాంకు అకౌంట్లతో లింక్ అయినట్టు మంత్రి చెప్పారు. మాజీ ప్రధాని రాజీవ్ గాంధీ నేతృత్వంలో ప్రజల కోసం ఒక్క రూపాయి వెచ్చిస్తే, వారి దగ్గరికి 15 పైసలే చేరుకుంటున్నాయని, ప్రస్తుతం ప్రభుత్వం ఈ మొత్తాన్ని డైరెక్ట్‌గా లబ్దిదారుల బ్యాంకు అకౌంట్లలోనే జమచేస్తున్నట్టు చెప్పారు. అనధికారికంగా యూజర్ల డేటాను వాడితే ప్రభుత్వం అసలు ఊరుకోదని మంత్రి హెచ్చరించారు.
Comments
Please login to add a commentAdd a comment