
ముంబై: నిఫ్టీ 50 కంపెనీల గత ఆర్థిక సంవత్సరం నాలుగో త్రైమాసిక ఆర్థిక ఫలితాలు ఆశావహంగానే ఉండొచ్చని నిపుణులు అంచనా వేస్తున్నారు. ఈ కంపెనీల నికర లాభాలు వరుసగా మూడో క్వార్టర్‌లోనూ రెండంకెల వృద్ధి సాధించవచ్చని వారంటున్నారు. వచ్చే వారం నుంచి గత ఆర్థిక సంవత్సరానికి చెందిన చివరి క్వార్టర్(మార్చి క్వార్టర్–క్యూ4) ఫలితాలు వెల్లడి కానున్న నేపథ్యంలో నిఫ్టీ 50 కంపెనీల ఫలితాలపై విశ్లేషకుల అంచనా.
పెద్ద కరెన్సీ నోట్ల రద్దు కారణంగా అంతకు ముందటి ఆర్థిక సంవత్సరం నాలుగో త్రైమాసికంలో కంపెనీల ఆర్థిక ఫలితాలు అంతంతమాత్రంగానే ఉన్నాయి. ఈ లో బేస్ ఎఫెక్ట్ కారణంగా గత ఆర్థిక సంవత్సరం క్యూ4 ఫలితాలు బాగా ఉండొచ్చు. ముఖ్యంగా వాహన, బ్యాంక్, ఫైనాన్స్, కన్సూమర్, లోహ రంగాలు మంచి ఫలితాలను ప్రకటించవచ్చు.
గత ఆర్థిక సంవత్సరం క్యూ2, క్యూ3 ఫలితాలతో పోల్చితే క్యూ4 ఫలితాల్లో లాభాల వృద్ధి అధికంగానే ఉంటుంది. ఇక నికర అమ్మకాలు 8%, నిర్వహణ లాభం 16% మేర పెరిగే అవకాశాలున్నాయి. గత ఆర్థిక సంవత్సరం క్యూ2, క్యూ3ల్లో ఉన్నట్లుగానే నిర్వహణ మార్జిన్ కూడా 20% రేంజ్‌లో ఉండొచ్చు. మొత్తం మీద ఫలితాలు బాగా ఉంటాయి.
వాహన, కన్సూమర్ గూడ్స్, రిటైల్ రుణాలు అధికంగా ఇచ్చిన బ్యాంక్‌లు, ఆర్థిక సేవల కంపెనీలు, లోహ షేర్ల కంపెనీల ఫలితాలు అంచనాలను మించుతాయి. మరోవైపు ప్రభుత్వ రంగ బ్యాంకులు, కార్పొరేట్ రుణాలు అధికంగా ఇచ్చిన బ్యాంక్‌లు, ఆర్థిక సంస్థల ఐటీ, ఫార్మా, టెలికం రంగ కంపెనీలు బలహీన ఫలితాలను వెల్లడించవచ్చు.
రంగాల వారీగా చూస్తే...
వాహన రంగం: రీప్లేస్‌మెంట్ డిమాండ్ పుంజుకోవడం, వినియోగదారుల సెంటిమెంట్ మెరుగుపడటంతో క్యూ4లో వాహన కంపెనీల అమ్మకాలు 13–15% పెరిగాయి. కొన్ని కంపెనీలు వాహన ధరలను పెంచడంతో ఆదాయ వృద్ధి పటిష్టంగానే ఉండొచ్చు. ముడి పదార్థాల ధరలు పెరగడంతో మార్జిన్ ఒకింత తగ్గవచ్చు.
క్యాపిటల్ గూడ్స్: ఆగిపోయిన ప్రాజెక్ట్‌లు మళ్లీ పట్టాలకెక్కడం క్యాపిటల్ గూడ్స్ కంపెనీలకు ప్రయోజనం కలిగించే అంశమే. ప్రాజెక్ట్‌ల అమలు బాగా ఉండడం, కొత్త ఆర్డర్లు రావడంతో దేశంలోనే అతి పెద్ద మౌలిక రంగ కంపెనీ ఎల్ అండ్ టీ ఫలితాలు అంచనాలను మించవచ్చు. ప్రారంభించిన ప్రాజెక్ట్‌లు అధికంగా ఉండడం, మూలధన వ్యయం కూడా చెప్పుకోదగిన స్థాయిలో ఉండటం వల్ల పవర్ గ్రిడ్ కార్పొరేషన్ కూడా మంచి ఫలితాలనే ప్రకటించవచ్చు.
ఎఫ్‌ఎమ్‌సీజీ: పెద్ద కరెన్సీ నోట్ల రద్దు అంతకు ముందటి ఆర్థిక సంవత్సరం క్యూ4లో ఎఫ్‌ఎమ్‌సీజీ కంపెనీలపై తీవ్రమైన ప్రతికూల ప్రభావం చూపించింది. ఈ లో బేస్ ఎఫెక్ట్‌కు తోడు జీఎస్‌టీ అమలు కారణంగా అసంఘటిత రంగం నుంచి సంఘటిత రంగం కంపెనీలకు మార్కెట్ వాటా బదిలీ కావడం కూడా తోడవడంతో మార్చి క్వార్టర్‌లో ఎఫ్‌ఎమ్‌సీజీ కంపెనీలకు అనుకూలించనున్నది. ఫలితంగా ఎఫ్‌ఎమ్‌సీజీ కంపెనీల నికర అమ్మకాలు రెండంకెల వృద్ధిని సాధించవచ్చు. మార్జిన్‌లు కూడా మరింతగా పెరుగుతాయి. ఐటీసీ విషయానికొస్తే, సిగరెట్ల అమ్మకాలు తగ్గిన ప్రభావాన్ని ధరలు సగటున 12 శాతం మేర పెరగడం భర్తీ చేయవచ్చు.
లోహ, మైనింగ్: ఈ ఏడాది మార్చి క్వార్టర్‌లో స్టీల్‌కు దేశీయంగా డిమాండ్ జోరుగా ఉంది. ఈ ఏడాది జనవరి, ఫిబ్రవరి నెలల్లో వినియోగం 7% పెరిగింది. దీనికి తోడు కంపెనీలు ధరలు పెంచడం కూడా కలసి రావడంతో కంపెనీల ఆదాయం రెండంకెల వృద్ధి చెందే అవకాశాలున్నాయి. ధరలు 10% పెరగడంతో అల్యూమినియమ్ కంపెనీలు కూడా మంచి ఫలితాలనే ప్రకటించవచ్చు.
బ్యాంకింగ్, ఫైనాన్స్: కార్పొరేట్ రుణాల కంటే రిటైల్ రుణాలకే ప్రాధాన్యత ఇచ్చే బ్యాంక్‌లు, ఫైనాన్స్ కంపెనీలు ఫలితాలు బాగా ఉంటాయి. ఇక కార్పొరేట్ రుణాలు అధికంగా ఇచ్చిన బ్యాంక్‌ల మొండి బకాయిలు ఒకింత తగ్గే అవకాశాలు ఉన్నాయి.
సిమెంట్: గత ఆర్థిక సంవత్సరం మార్చి క్వార్టర్‌లో సిమెంట్ ధరలు 1% పెరిగాయి. ఇసుక కొరత కారణంగా ఉత్తరాదిన డిమాండ్ బలహీనంగా ఉంది. మహారాష్ట్ర, ఉత్తర ప్రదేశ్, బిహార్, తమిళనాడుల్లో డిమాండ్ అధికంగా ఉంది. దేశంలోనే అతి పెద్ద సిమెంట్ కంపెనీ, దేశవ్యాప్తంగా కార్యకలాపాలు నిర్వహిస్తున్న కంపెనీ.. నిఫ్టీ సూచీలో సిమెంట్ రంగానికి చెందిన ఏకైక కంపెనీ అల్ట్రాటెక్ సిమెంట్ కంపెనీ ఆదాయం దాదాపు రెట్టింపయ్యే అవకాశం ఉంది.
విద్యుత్తు: మార్చి క్వార్టర్లో విద్యుదుత్పత్తి 4% పెరిగింది. బొగ్గు కొరత ఉన్నప్పటికీ, బొగ్గు ఆధారిత విద్యుదుత్పత్తి 5% వృద్ధి చెందింది. బొగ్గు, విద్యుత్తుతో సంబంధమున్న కోల్ ఇండియా, ఎన్‌టీపీసీ ల ఆదాయం, లాభాలు ఒక అంకె స్థాయిలోనే పెరగవచ్చు.
ఐటీ: సాధారణంగా మార్చి క్వార్టర్ ఐటీ కంపెనీలకు బలహీనంగా ఉంటుంది. ప్రతి ఏడాది మార్చి క్వార్టర్లలోనే క్లయింట్లు ఐటీ బడ్జెట్‌లను పునర్వ్యవస్థీకరిస్తారు. డాలర్లలో ఆదాయం సీక్వెన్షియల్‌గా 2 శాతం తగ్గొచ్చు. డాలర్, పౌండ్ వంటి ప్రధాన కరెన్సీలతో పోల్చితే రూపాయి బలహీనత నిర్వహణ మార్జిన్లను సపోర్ట్ చేయవచ్చు.
ఫార్మా: ఫార్మా రంగానికి గత ఆర్థిక సంవత్సరం క్యూ4 కూడా పీడకలేనని చెప్పవచ్చు. అమెరికా వ్యాపారంపై ఆధారపడిన పలు ఫార్మా కంపెనీల ఫలితాలు అంతంత మాత్రంగానే ఉండొచ్చు. ఆదాయ వృద్ధి ఉంటే, గింటే ఒక అంకె రేంజ్‌లోనే ఉంటుంది.
టెలికం: మార్చి క్వార్టర్‌లో బలహీన ఫలితాలనే వెల్లడిస్తాయి. ఈ రంగంలో విలీనాలు చోటుచేసుకుంటున్నప్పటికీ, ఆ ఫలాలు టెల్కోల లాభాల్లో ప్రతిఫలించడానికి మరికొంత కాలం పడుతుంది. మరోవైపు జియోతో తీవ్రమైన పోరు కారణంగా టెలికం కంపెనీలు ఆదాయాలు, లాభాలపై ఒత్తిడి ఈ క్వార్టర్‌లోనూ కొనసాగుతుంది.