
న్యూఢిల్లీ: పంజాబ్ నేషనల్ బ్యాంకుకు ఉద్దేశపూర్వక రుణ ఎగవేతలు మొత్తం మీద మే చివరికి రూ.15,490 కోట్లకు పెరిగాయి. ఏప్రిల్ నెల చివరికి ఇవి రూ.15,199 కోట్లుగా ఉండగా, 2 శాతం పెరిగినట్టు తెలుస్తోంది. రూ.25 లక్షలు ఆపై మొత్తంలో రుణాలు తీసుకుని, చెల్లించే సామర్థ్యం ఉన్నప్పటికీ చెల్లించని ఖాతాల మొత్తం ఇది.
గత ఆర్థిక సంవత్సరం ముగింపునకు ఉద్దేశపూర్వక రుణ ఎగవేతల మొత్తాన్ని రూ.15,171.91 కోట్లుగా బ్యాలెన్స్ షీట్లలో పేర్కొన్న పీఎన్‌బీ, రూ.12,282 కోట్ల నష్టాలను ప్రకటించిన విషయం తెలిసిందే. పెద్ద మొత్తంలో రుణాలు ఎగవేసిన కేసుల్లో కుడోస్ సినిమా (రూ.1,301 కోట్లు), కింగ్‌ఫిషర్ ఎయిర్‌లైన్స్ (రూ.597 కోట్లు), విన్సోమ్ డైమండ్స్ (రూ.900 కోట్లు), ఐసీఎస్‌ఏ (రూ.134 కోట్లు), ఇందు ప్రాజెక్ట్ (రూ.103 కోట్లు) ఉన్నాయి.