
న్యూఢిల్లీ: ఈ–కామర్స్ విభాగం ఆదాయం 2022 నాటికి 52 బిలియన్ డాలర్ల (రూ.3.53లక్షల కోట్లు)కు చేరుతుందని అంచనా. 2017 నాటికి ఇది 25 బిలియన్ డాలర్లు(రూ.1.7లక్షల కోట్లు)గా ఉందని మార్కెటింగ్ కంపెనీ ‘అడ్మిటాడ్’ అధ్యయన నివేదిక తెలియజేసింది. 37 శాతం జనాభా ఇంటర్నెట్ వినియోగిస్తుండగా, వీరిలో 14 శాతం ఆన్‌లైన్ కొనుగోళ్లు చేస్తున్నట్టు ఈ నివేదిక పేర్కొంది. ఇంటర్నెట్ యూజర్లు 2021 నాటికి 45 శాతం పెరుగుతారని అంచనా వ్యక్తం చేసింది. ఇదే సమయంలో ఆన్‌లైన్ కొనుగోలుదారులు 90 శాతం పెరుగుతారని పేర్కొంది.
డెస్క్‌టాప్ ద్వారా కొనుగోళ్లు 56 శాతంగాను, స్మార్ట్‌ఫోన్ల ద్వారా 30 శాతం జరుగుతాయని నివేదికలో వివరించింది. మొబైల్ వినియోగం మరింత పెరగనున్న నేపథ్యంలో ఎం–కామర్స్‌కు అధిక అవకాశాలున్నాయని అభిప్రాయపడింది. భారత్‌లో 57 శాతం మంది డెలివరీ సమయంలో చెల్లింపులకు మొగ్గు చూపుతున్నారని, 11 శాతం మంది క్రెడిట్ కార్డుల ద్వారా, 15 శాతం మంది డెబిట్ కార్డుల ద్వారా చెల్లింపులు చేస్తున్నట్టు తెలిపింది. అయితే, ప్రభుత్వం డిజిటల్ లావాదేవీలను ప్రోత్సహిస్తున్న నేపథ్యంలో భవిష్యత్తులో ఈ ధోరణిలో మార్పులు చోటు చేసుకోవచ్చని పేర్కొంది.
Comments
Please login to add a commentAdd a comment