ఆర్థిక వ్యవస్థ పుంజుకుంటుంది..
న్యూఢిల్లీ: దేశ ఆర్థిక వ్యవస్థ వృద్ధిరేటు మరింతగా పుంజుకుంటుందని బ్యాంకింగ్ వర్గాలు అంచనా వేస్తున్నాయి. ప్రధానంగా దేశీయ ఆర్థిక కార్యకలాపాలు జోరందుకోవడం, తగినంతగా నిధుల లభ్యత, విదేశీ ఆర్థిక అనిశ్చితిని తట్టుకొని నిలబడగలిగే సత్తా తదితర అంశాలు మన ఆర్థిక వ్యవస్థకు చేదోడుగా నిలుస్తాయనేది వారి అభిప్రాయం. భారత పరిశ్రమల సమాఖ్య(సీఐఐ), భారతీయ బ్యాంకుల సంఘం(ఐబీఏ) ఈ ఏడాది ఏప్రిల్–జూన్ త్రైమాసికానికిగాను నిర్వహించిన సర్వేలో 31 దిగ్గజ బ్యాంకులు, ఆర్థిక సంస్థలకు చెందిన ఉన్నతాధికారుల అభిప్రాయాలతో ఈ నివేదికను రూపొందించారు. కాగా, సమీప భవిష్యత్తులో వడ్డీరేట్లు మళ్లీ పెరిగే అవకాశం ఉందని బ్యాంకర్లు భావిస్తున్నారు.
ద్రవ్యసరఫరా(లిక్విడిటీ) తగ్గుముఖం పట్టడమే దీనికి ప్రధాన కారణంగా చెబుతున్నారు. ఇప్పటికే తీవ్ర మొండిబకాయిల(ఎన్‌పీఏ) సమస్యతో ఇక్కట్లు ఎదుర్కొంటున్న కార్పొరేట్ రుణాలపై ఈ వడ్డీరేట్ల పెరుగుదల తీవ్ర ప్రభావం చూపే అవకాశం ఉంది. ఎన్‌పీఏలకు అడ్డుకట్ట వేసే లక్ష్యంతో తాజాగా కేంద్ర ప్రభుత్వం రిజర్వ్ బ్యాంక్(ఆర్‌బీఐ)కు మరిన్ని అధికారాలను కట్టబెట్టిన సంగతి తెలిసిందే. బ్యాంకింగ్ నియంత్రణ చట్టంలో మార్పులు చేస్తూ ఆర్డినెన్స్‌ను తీసుకొచ్చింది. ప్రభుత్వ రంగ బ్యాంకుల్లో ఎన్‌పీఏలు రూ.6 లక్షల కోట్లకు ఎగబాకిన నేపథ్యంలో ఈ చర్యలు చేపట్టింది.
ఆర్థిక పరిస్థితుల సూచీ పైపైకి...
సీఐఐ–ఐబీఏ ఆర్థిక పరిస్థితుల సూచీ ఈ ఆర్థిక సంవత్సరం తొలి త్రైమాసికంలో 56.9కు ఎగబాకింది. క్రితం త్రైమాసికం(జనవరి–మార్చి)లో సూచీ 48 వద్ద ఉంది. అంటే అన్ని అంశాల్లోనూ దేశ ఆర్థిక పరిస్థితులు మెరుగుపడతాయని అధిక శాతం మంది బ్యాంకర్లు అంచనా వేస్తున్నట్లు లెక్క. ‘సూచీ మెరుగుదలను చూస్తే.. ఆర్థిక వ్యవస్థపై ఫైనాన్షియల్ రంగంలో చాలా ఆశావహ దృక్పథం ఉందని తెలుస్తోంది.
ప్రధానంగా దేశీయ వినిమయం జోరందుకోవడం, మౌలికసదుపాయాలపై భారీ వ్యయం, జీఎస్‌టీ, బ్యాంకింగ్ నియంత్రణ చట్టంలో సవరణలు చేస్తూ ఆర్డినెన్స్ తీసుకురావడం సహా ఇంకా కీలకమైన పలు సంస్కరణలకు ప్రభుత్వం నడుంబిగించడం దీనికి కారణం’ అని సీఐఐ డైరెక్టర్ జనరల్ చంద్రజిత్ బెనర్జీ వ్యాఖ్యానించారు. ప్రస్తుత ఉత్పత్తి సామర్థ్యాల వినియోగం పూర్తిస్థాయిలో లేనందున కార్పొరేట్ల నుంచి రుణాలకు డిమాండ్ తక్కువగానే కొనసాగనుంది. గతేడాది(2016–17) చివరి త్రైమాసికంలో వడ్డీరేట్ల తగ్గింపు ప్రయోజనాన్ని బ్యాంకులు తమ కస్టమర్లకు పూర్తిగా బదలాయించిన నేపథ్యంలో ఈ త్రైమాసికం(మార్చి–జూన్)లో వడ్డీరేట్లు మరింత తగ్గే అవకాశం లేదని ఐబీఏ చైర్మన్ రాజీవ్ రిషి చెప్పారు.