రూట్‌ మార్చిన బస్సు పరిశ్రమ! | Electricity and double-decker buses focus on manufacturing | Sakshi
Sakshi News home page

రూట్‌ మార్చిన బస్సు పరిశ్రమ!

Published Thu, Jan 18 2018 12:14 AM | Last Updated on Thu, Jan 18 2018 3:26 PM

Electricity and double-decker buses focus on manufacturing - Sakshi

హైదరాబాద్, బిజినెస్‌ బ్యూరో: అదీ ఇదీ అని కాదు... దాదాపుగా బస్సులు తయారు చేసే కంపెనీలన్నీ ఇపుడు రూటు మార్చుకుంటున్నాయి. మెరుగైన ఆదాయాలు, భవిష్యత్తు దృష్ట్యా కొత్త టెక్నాలజీని అందిపుచ్చుకుని ఎలక్ట్రిక్, డబుల్‌ డెక్కర్‌ బస్సుల తయారీపై దృష్టి సారించాయి. ప్రయాణికుల భద్రత కోసం కేంద్రం తెస్తున్న కొత్త ప్రమాణాలు, స్మార్ట్‌ సిటీస్‌ ప్రాజెక్టులో భాగంగా కేంద్రం ఇస్తున్న ప్రోత్సాహం, ప్రయాణికుల నుంచి వస్తున్న డిమాండ్‌ నేపథ్యంలో మున్ముందు మన రోడ్లపై ఆధునిక బస్‌ల హవా ఉంటుందనేది పరిశ్రమ అంచనా. దేశంలో ఏటా 70–80 వేల బస్సులు కొత్తగా రోడ్డెక్కుతున్నాయి. 2018–19లో ఈ సంఖ్య 90 వేలు దాటుతుందని అంచనా. 

ఒకదాని వెంట ఒకటి.. 
వోల్వో, అశోక్‌ లేలాండ్, టాటా మోటార్స్, జేబీఎం, స్కానియా, బీవైడీ, గోల్డ్‌స్టోన్, కేపీఐటీ వంటి కంపెనీలు ఇప్పటికే ఎలక్ట్రిక్‌ బస్సులను అందుబాటులోకి తెచ్చాయి. వోల్వో ఐషర్, వీర వాహన్‌ వంటి కంపెనీలు ఎలక్ట్రిక్‌ బస్సులను పరీక్షిస్తున్నాయి. మెర్సిడెస్‌ బెంజ్, డెక్కన్‌ ఆటో నుంచి 2020 నాటికి ఈ మోడల్‌ మార్కెట్లోకి వచ్చే అవకాశముంది. మహీంద్రా సైతం వీటి తయారీపై దృష్టి సారించగా... ప్రతి కంపెనీ కొత్త టెక్నాలజీపై పని చేస్తున్నట్లు సమాచారం. ‘‘దాదాపుగా బస్సుల తయారీలో ఉన్న కంపెనీలన్నీ ఎలక్ట్రిక్‌ విభాగంపై ఫోకస్‌ చేశాయి. మేం కూడా ఈ విభాగంలో అడుగు పెడుతున్నాం’’ అని కరోన డైరెక్టర్‌ ఎం.బాలాజీ రావు సాక్షి బిజినెస్‌ బ్యూరో ప్రతినిధితో చెప్పారు. 

ఉత్సాహం నింపిన టెండర్లు.. 
బెంగళూరు మెట్రోపాలిటన్‌ ట్రాన్స్‌పోర్ట్‌ కార్పొరేషన్‌ (బీఎంటీసీ) 150 ఎలక్ట్రిక్‌ బస్సుల కోసం టెండర్లను ఆహ్వానించడం పరిశ్రమలో ఉత్సాహం నింపింది. ప్రీ–బిడ్‌ సమావేశానికి దేశ, విదేశాలకు చెందిన 12 తయారీ కంపెనీలతో పాటు పదుల సంఖ్యలో ఆపరేటర్లు హాజరయ్యారు. అద్దెకు ఈ బస్సులను తీసుకోవాలనేది బీఎంటీసీ యోచన. ఎంపికైన కంపెనీలకు ఇది కిలోమీటరుకు నిర్దేశిత మొత్తాన్ని చెల్లిస్తుంది. ఇందులో కొంత మొత్తాన్ని కేంద్రం భరిస్తుంది. అలాగే కేంద్రం 10 స్మార్ట్‌ సిటీల్లో వెయ్యి బస్సుల్ని ప్రవేశపెట్టాలని చూస్తోంది. 2018 మార్చి 31లోగా టెండర్లు పూర్తి చేయనుంది. ఒక్కో బస్‌కు కేంద్రం రూ.65–85 లక్షలను భరిస్తుంది. 

ఇదీ బస్సు పరిశ్రమ... 
దేశవ్యాప్తంగా ఏటా రోడ్డెక్కుతున్న బస్సుల్లో ప్రైవేటు ఆపరేటర్లు 65 శాతం, ప్రభుత్వ రోడ్డు రవాణా సంస్థలు 35 శాతం మేర కొనుగోలు చేస్తున్నాయి. ఇందులో రూ.75 లక్షలు, ఆపైన ఖరీదు చేసే ప్రీమియం బస్సులు 1,000 వరకూ ఉంటాయి. కస్టమర్ల డిమాండ్‌ నేపథ్యంలో 2018–19లో ప్రీమియం బస్సుల విక్రయాలు 3,000 యూనిట్ల దాకా ఉండొచ్చని పరిశ్రమ భావిస్తోంది. మొత్తం అమ్మకాల్లో దక్షిణాది రాష్ట్రాల వాటా ఏకంగా 55–60 శాతం ఉంది. ఇందులో అత్యధిక బస్సులు తెలుగు రాష్ట్రాల్లో పరుగెడుతున్నవే.  

నగరాల మధ్య డబుల్‌ డెక్కర్లు..
ఇప్పటి వరకూ సిటీకే పరిమితమైన డబుల్‌ డెక్కర్‌ బస్సులు ఇక నగరాల మధ్య పరిగెత్తనున్నాయి. మెర్సిడెస్‌ బెంజ్, వీర, వోల్వో, స్కానియా బ్రాండ్ల డబుల్‌ డెక్కర్లు 2019 కల్లా దర్శనమివ్వనున్నట్లు సమాచారం. ఇతర కంపెనీలూ వీటి సరసన చేరనున్నాయి. ఇటీవలే ప్రభుత్వం డబుల్‌ డెక్కర్‌ బస్సుల నాణ్యత ప్రమాణాల కోసం ఆటోమోటివ్‌ ఇండస్ట్రీ స్టాండర్డ్‌–138ను తీసుకొచ్చింది. 80 మంది ప్రయాణించేలా సీట్ల సామర్థ్యం ఉంటుందని వీర బ్రాండ్‌ బస్సులను తయారు చేస్తున్న వీర వాహన ఉద్యోగ్‌ ఎండీ కె.శ్రీనివాస్‌ రెడ్డి చెప్పారు. బస్సు ధర రూ.1.8 కోట్ల వరకు ఉంటుందని, కాకపోతే ఆపరేటర్లకు వ్యయం కలిసి వస్తుందని చెప్పారు. ఇవి వస్తే పరిశ్రమకు కొత్త ఊపు వస్తుందన్నా్నరు. 

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement