టెక్నాలజీ పెరుగుతున్న తరుణంలో ఎలక్ట్రానిక్ వినియోగం మరింత ఎక్కువగా ఉంది. పరికరాలు పెరుగుతుంటే.. వాటికి ఛార్జింగ్ కీలకమైన అంశంగా మారింది. దీంతో నిత్యా జీవితంలో ఉపయోగించే దాదాపు అన్ని పరికరాలకు ప్రతి రోజు ఛార్జింగ్ వేసుకోవాల్సి వస్తోంది. ఈ సమస్యకు చెక్ పెట్టడానికి చైనా కంపెనీ ఓ కొత్త బ్యాటరీ ఆవిష్కరించింది.
బీజింగ్‌కు చెందిన బీటావోల్ట్ (Betavolt) ఇటీవల 'న్యూక్లియర్ బ్యాటరీ' పరిచయం చేసింది. కంపెనీ ఆవిష్కరించిన ఈ బ్యాటరీ అటామిక్ ఎనర్జీని గ్రహించి ఏకంగా 50 ఏళ్ళు పనిచేస్తుందని తెలుస్తోంది. ఈ బ్యాటరీ చూడటానికి పరిమాణంలో చాలా చిన్నదిగా ఉంటుంది.
బీటావోల్ట్ అటామిక్ ఎనర్జీ బ్యాటరీలు ఏరోస్పేస్, AI పరికరాలు, వైద్య పరికరాలు, మైక్రోప్రాసెసర్‌లు, లేటెస్ట్ సెన్సార్‌లు, చిన్న డ్రోన్‌లు, మైక్రో-రోబోట్ వంటి వాటి వినియోగంలో చాలా ఉపయోగపడతాయని కంపెనీ వెల్లడించింది.
బ్యాటరీ కొలతలు
బీటావోల్ట్ ఆవిష్కరించిన కొత్త బ్యాటరీ కేవలం 15 x 15 x 5 మిమీ కొలతల్లో ఉంటుంది. ఇది న్యూక్లియర్ ఐసోటోప్‌లు, డైమండ్ సెమీకండక్టర్ల పొరలతో తయారు చేసినట్లు సమాచారం. ఈ న్యూక్లియర్ బ్యాటరీ ప్రస్తుతం 3 వోల్టుల వద్ద 100 మైక్రోవాట్ల శక్తిని ఉత్పత్తి చేస్తుంది. 2025 నాటికి 1-వాట్ పవర్ అవుట్‌పుట్‌ని ప్రొడ్యూస్ చేసేలా తయారు చేయనున్నట్లు సమాచారం. ఈ బ్యాటరీ రేడియేషన్ వల్ల మానవ శరీరానికి ఎలాంటి ప్రమాదం ఉండదని, పేస్‌మేకర్ల వంటి వైద్య పరికరాల్లో కూడా సులభంగా ఉపయోగించవచ్చని బీటావోల్ట్ వెల్లడించింది.
బ్యాటరీ ఎలా పని చేస్తుంది?
బీటావోల్ట్ కొత్త బ్యాటరీ ఐసోటోపుల నుంచి శక్తిని పొందుతుంది. ఈ విధానంవైపు 20 శతాబ్దం ప్రారంభంలోనే పరిశోధనలు మొదలయ్యాయి. అయితే చైనా 2021-2025 వరకు 14వ పంచవర్ష ప్రణాళిక కింద అణు బ్యాటరీలను తయారు చేయడమే లక్ష్యంగా కృషి చేస్తోంది.
ఇదీ చదవండి: ప్రపంచ వ్యాపార సామ్రాజ్య పతనం! భయపడుతున్న సీఈఓలు..
బ్యాటరీ లేయర్ డిజైన్ కలిగి ఉండటం వల్ల.. ఆకస్మికంగా పేలే అవకాశాలు లేదని చెబుతున్నారు. మైనస్ 60 డిగ్రీల సెల్సియస్ నుంచి 120 డిగ్రీల సెల్సియస్ వరకు ఉష్ణోగ్రతలను తట్టుకుని ఈ బ్యాటరీ పనిచేస్తుంది. ప్రస్తుతం కంపెనీ ఈ బ్యాటరీని టెస్ట్ చేస్తూనే ఉంది, ప్రభుత్వాల నుంచి అవసరమైన అన్ని అనుమతులు లభించిన తరువాత ఉత్పత్తి ప్రారంభమవుతుంది.
Comments
Please login to add a commentAdd a comment