సాక్షి, హైదరాబాద్:భాగ్యనగర మనసు దోచిన డబుల్ డెక్కర్ బస్సుపై ఆర్టీసీ దోబూచులాడుతోంది. ఈ బస్సులను ఎలా తీసుకురావాలో అంతుచిక్కక తటపటాయిస్తోంది. ఒక్కో బస్సు ఖరీదు ఏకంగా రూ.70 లక్షలుగా కంపెనీ నిర్ధారించటంతో అంత ధర పెట్టి కొనడం ఆర్టీసీకి కష్టంగా మారింది. దీంతో అలవాటైన అద్దె విధానాన్ని దీనికీ వర్తింపచేయాలనే నిర్ణయానికి వచ్చినట్టు తెలిసింది. ప్రస్తుతం సొంతంగా బస్సులను కొనడం కంటే అద్దెప్రాతిపదికన తీసుకోవడం మేలని భావిస్తూ భారీగా అద్దె బస్సులు తీసుకుంటున్న విషయం తెలిసిందే. ఇప్పటికే మూడు వేల అద్దె బస్సులు వినియోగిస్తున్న ఆర్టీసీ ఇటీవలే మరో 70 బస్సులకు నోటిఫికేషన్ జారీచేసింది. ఇదే క్రమంలో డబుల్ డెక్కర్ బస్సులనూ అద్దె ప్రాతిపదికన తీసుకోవాలని భావిస్తోంది.
అశోక్ లేలాండ్ ద్వారానే..
నగరంలో 2006 వరకు డబుల్ డెక్కర్ బస్సులు నడిచాయి. ఈ బస్సులతో నష్టాలు భారీగా వస్తుండటంతో ఆ తర్వాత వాటిని ఉపసంహరించు కుంది. కానీ ఇటీవల ఓ నగరవాసి ఆ బస్సులను గుర్తు చేస్తూ ట్వీట్ చేయగా, మంత్రి కేటీఆర్ స్పందించి.. మళ్లీ ఆర్టీసీ డబుల్ డెక్కర్ బస్సులను నడిపితే బాగుంటుందని రీట్వీట్ చేస్తూ దాన్ని రవాణాశాఖ మంత్రి పువ్వాడకు ట్యాగ్ చేశారు. దీనికి సానుకూలంగా స్పందించిన పువ్వాడ.. కొత్త బస్సుల కొనుగోలుకు ఆసక్తి చూపారు. ప్రయోగా త్మకంగా 20 బస్సులు తీసుకోవాలని నిర్ణయించిన ఆర్టీసీ అప్పట్లో టెండర్లు పిలవగా అశోక్ లేలాండ్ కంపెనీని ఎల్–1గా ఎంపిక చేసింది.
అది ఒక్కో బస్సుకు రూ.70 లక్షలు కోట్ చేసింది. ప్రస్తుతం ఆర్టీసీ ఆర్థిక పరిస్థితి ఏమాత్రం బాగోలేకపోవటం, మామూలు బస్సుల అవసరం బాగా ఉన్నందున డబుల్ డెక్కర్ బస్సులు కొనేబదులు సాధారణ బస్సులకు ఆ నిధులు వినియోగించాలన్న నిర్ణయానికి వచ్చింది. దీంతో అద్దెప్రాతిపదికన డబుల్ డెక్కర్ బస్సులు తీసుకోవాలని భావిస్తూ, ఆ బాధ్యతను అశోక్ లేలాండ్ కంపెనీకి అప్పగించాలని చూస్తోంది. ఆసక్తి ఉన్న సంస్థలను అద్దె పద్ధతిలో డబుల్ డెక్కర్ బస్సులు ఇచ్చేలా ఏర్పాట్లు చేయాలని కోరనున్నట్టు తెలిసింది. దీనిపై త్వరలో స్పష్టత రానుంది.
మధ్యేమార్గంగా..
ప్రస్తుత పరిస్థితిలో డబుల్ డెక్కర్ బస్సుల నిర్వహణ సరికాదన్న అభిప్రాయం దేశవ్యాప్తంగా వ్యక్తమవుతోంది. ఇటీవలే టీఎస్‌ఆర్టీసీతో పాటు ముంబైలో కూడా డబుల్ డెక్కర్ బస్సులకు టెండర్లు పిలిచారు. వంద బస్సులు తీసుకోవాలనుకోగా, అశోక్ లేలాండ్ టెండరే ఖరారైంది. కానీ అక్కడ కూడా బస్సులు తీసుకునేందుకు తటపటాయిస్తూ తాజాగా టెండర్‌ను రద్దు చేసుకుంటున్నట్టు తెలిసింది. ముంబైలోనే వద్దనుకున్నాక, తీవ్ర నష్టాల్లో ఉన్న తాము వీటిని ఎలా నిర్వహించగలమన్న యోచనలో టీఎస్‌ఆర్టీసీ ఉంది. మధ్యేమార్గంగా అద్దె విధానాన్ని తెరపైకి తెస్తోంది.
Comments
Please login to add a commentAdd a comment