ఉద్యోగులూ!! రిటర్న్‌లు వేద్దామా? | Employees !! do know returns? | Sakshi
Sakshi News home page

ఉద్యోగులూ!! రిటర్న్‌లు వేద్దామా?

Published Sun, Apr 24 2016 11:32 PM | Last Updated on Thu, Sep 27 2018 4:47 PM

ఉద్యోగులూ!! రిటర్న్‌లు వేద్దామా? - Sakshi

ఉద్యోగులూ!! రిటర్న్‌లు వేద్దామా?

గడిచిన ఆర్థిక సంవత్సరానికి సంబంధించి వేతనదారులు తమ సంపాదనపై రిటర్న్‌లు దాఖలు చేయాల్సిన అవసరం ఉంది. దీనికి సంబంధించి వేతనదారులు ఐటీఆర్-1 లేదా ఐటీఆర్-2 ఫారమ్‌లను వినియోగించాల్సి ఉంటుంది. కేవలం వేతనం మాత్రమే ఆదాయంగా ఉన్నా, దీంతో పాటు ఇంటి మీద అద్దెల రూపంలో ఆదాయం ఉన్నా ఐటీఆర్-1ను వినియోగించాలి. ఒకవేళ ఒకటి కంటే ఎక్కువ ఇళ్లపై ఆదాయం ఉన్నవారు ఐటీఆర్-2 వినియోగించవచ్చు. ఈ ఐటీఆర్ ఫారంలను ఇన్‌కమ్ ట్యాక్స్ ఇండియా ఈ ఫైలింగ్ వెబ్‌సైట్ నుంచి డౌన్ లోడ్ చేసుకోవచ్చు. అలాగే రిటర్న్‌లను ఆన్‌లైన్ ద్వారా లేదా ఆఫ్‌లైన్ ద్వారా కూడా వేసుకోవచ్చు.

ఈ రిటర్న్‌లు దాఖలు చేయడానికి జూలై 31 చివరి తేదీ. ఒక ఆర్థిక సంవత్సరంలో ఒకటి కంటే ఎక్కువ కంపెనీల్లో ఉద్యోగం చేసి ఉంటే వారు కూడా ఐటీఆర్-1 దాఖలు చేయొచ్చు. వేతనంతో పాటు వడ్డీ ఆదాయం అంటే బ్యాంకు డిపాజిట్లు లేదా సేవింగ్స్ ఖాతాపై వచ్చే వడ్డీ ఆదాయం ఉన్నా వీటిని ఐటీఆర్-1లోనే చూపించొచ్చు.
 
ఇలా నింపండి..
ముందుగా మీ ఆదాయ వివరాలను బట్టి ఐటీఆర్-1 లేదా ఐటీఆర్-2ను డౌన్‌లోడ్ చేసుకోండి. ఇందులో మొదట మీ వ్యక్తిగత వివరాలైన ఫోన్ నంబర్, ఈ మెయిల్‌తో సహా అన్నీ నింపండి. మీరు వేస్తున్న రిటర్న్ ఒరిజనలా లేక రివైజ్‌డా అనేది స్పష్టంగా తెలియజేయాలి. అలాగే మీరు రెసిడెంటా? లేక నాన్ రెసిడెంటా?, ప్రభుత్వ ఉద్యోగా లేక ప్రైవేటు ఉద్యోగా? అనేది తెలియజేయటంతో పాటు ఆధార్ నంబర్ ఇవ్వాలి. వీటితో పాటు మీ ట్యాక్స్ స్టేటస్ కూడా తెలియచేయాలి.
 
వీటి తర్వాత మీ ఆదాయ వివరాలు... అంటే వేతనం మరియు ఇంటి అద్దె వంటి ఇతర ఆదాయ వివరాలను  తెలియచేయాలి. ఆ తరువాత చాప్టర్ ఆరు ఏ కింద ఏమైనా డిడక్షన్స్ ఉంటే వాటి వివరాలు తెలియజేయండి. గడువు తేదీలోగా రిటర్నులు దాఖలు చేయడం వల్ల అనేక ప్రయోజనాలుంటాయి. ఒక వేళ మీ పన్ను భారం రూ. 10,000కు మించి ఉంటే సెక్షన్ 234ఏ, 234 బీ, 234 సీ వల్ల పడే వడ్డీ కట్టవలసిన అవసరం ఉండదు.
 
మీ మొత్తం ఆదాయం (వేతనం + ఇతర ఆదాయాలు) రూ. 5 లక్షలు మించకుండా ఉంటే సెక్షన్ 87ఏ కింద పన్ను భారంలో రూ. 2,000 రిబేటు పొందవచ్చు. ఒకవేళ మీ ఆదాయం రూ.5 లక్షలు దాటితే మాత్రం తప్పనిసరిగా ఆన్‌లైన్‌లోనే ఫైల్ చేయాల్సి ఉంటుంది. అయిదు లక్షల లోపు ఉంటే ఆన్‌లైన్ లేదా ఆఫ్‌లైన్‌లో మీ వీలును బట్టి రిటర్న్‌లు దాఖలు చేసుకోవచ్చు. పన్ను భారంపై 3 శాతం సెస్ చెల్లించాల్సి ఉందన్న విషయం మర్చిపోవద్దు.
 
పన్ను వివరాలు...
మీరు పనిచేస్తున్న కంపెనీ ఇచ్చే ఫారం-16 ద్వారా టీడీఎస్ రూపంలో ఎంత పన్ను రికవరీ చేశారో తెలుసుకోవచ్చు. కాబట్టి కంపెనీ నుంచి ఫారం-16 తీసుకోవడం మర్చిపోవద్దు. వేతనం కాకుండా ఇతర ఆదాయాలపై టీడీఎస్ రికవరీ చేస్తే దానికి సంబంధించి ఫారం 16ఏ  తప్పనిసరిగా తీసుకోవాలి. అలా కాకుండా మీకు టీడీఎస్ రికవరీ చేయని పక్షంలో సొంతంగా పన్ను భారం చెల్లించాల్సి వస్తే సెల్ఫ్ అసెస్‌మెంట్ టాక్స్‌గా చెల్లించాలి. అలా చెల్లించగా వచ్చిన చలానా వివరాలను ఐటీఆర్ ఫారంలో పొందుపర్చాలి. ఫారం-16, ఫారం-16ఏలో ‘ట్యాన్’ మరియు యజమాని వివరాలను సరైన పద్ధతిలో పొందుపర్చాలి.
 
చివరగా.. మీ పన్ను భారం, చెల్లించిన పన్ను వివరాలు అన్నీ సరిగా ఉన్నాయా లేదా సరిచూసుకోండి. అలాగే మీ వ్యక్తిగత బ్యాంక్ ఖాతాల వివరాలు (ఒకటి అంతకంటే ఎక్కువ) తెలియచేయాలి. వీటితో పాటు ఏదైనా సంస్థకు గాని, ట్రస్ట్‌కు గాని విరాళం ఇచ్చినచో వాటి వివరాలను 80జీ కాలమ్‌లో పొందుపర్చాలి. విరాళం ఇచ్చిన వారి పాన్ నంబర్, మరియు చిరునామా తప్పకుండా పొందుపర్చాలి. ఇలా విరాళం ఇచ్చి ఉంటే పన్ను భారం తగ్గుతుంది.

గడువు తేదీలోగా రిటర్న్ దాఖలు చేయండి నిశ్చింతగా ఉండండి.
 
కె.సీహెచ్.ఎ.వి.ఎస్.ఎన్ మూర్తి,కె.వి.ఎన్ లావణ్య
ట్యాక్సేషన్ నిపుణులు

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement