
న్యూఢిల్లీ: వాహన కాలుష్యాన్ని అరికట్టే దిశగా చర్యలు తీసుకుంటున్న కేంద్ర ప్రభుత్వం ఆటో ఎల్‌పీజీ వంటి చౌకైన ప్రత్యామ్నాయాలపై కూడా దృష్టి సారించాలని ఇండియన్ ఆటో ఎల్‌పీజీ సంస్థల సమాఖ్య (ఐఏసీ) కోరింది. సబ్సిడీపై విక్రయించేందుకు విద్యుత్, హైబ్రీడ్ వాహనాల కోసం రూ. 10,000 కోట్ల స్కీమును ప్రకటించడం స్వాగతిస్తున్నామని, అదే సమయంలో ఆటో ఎల్‌పీజీ వాహనాల వినియోగాన్ని సైతం ప్రోత్సహించాలని విజ్ఞప్తి చేసింది. మిగతా ఇంధనాలతో పోలిస్తే మెరుగైన ఆటో ఎల్‌పీజీ వంటి గ్యాస్ ఇంధన వినియోగదారులకు కూడా సమాన అవకాశాలు కల్పించాలని పేర్కొంది. ఇందుకోసం సబ్సిడీలు ఇవ్వనక్కర్లేదని.. విధానాలపరంగా ఆటో ఎల్‌పీజీపై జీఎస్‌టీని తగ్గించడం తదితర చర్యలు తీసుకుంటే చాలని ఐఏసీ ఒక ప్రకటనలో పేర్కొంది.
‘ప్రపంచంలోనే అత్యంత కాలుష్యమయమైన నగరాల జాబితాలో కొన్ని భారతీయ నగరాలు కూడా ఉన్నాయి. ప్రస్తుతం దేశీయంగా 65 శాతం విద్యుదుత్పత్తి శిలాజ ఇంధనాల నుంచే జరుగుతోంది. ఇక ఎలక్ట్రిక్ వాహనాలు పూర్తి స్థాయిలో వినియోగంలోకి రావాలంటే మరో రెండు దశాబ్దాలు పట్టేసే అవకాశం ఉంది. నగరాల్లో స్వచ్ఛమైన గాలి కోసం 20 ఏళ్లు ఆగే పరిస్థితి ఉందా.. అంటే లేదనే చెప్పాల్సి ఉంటుంది. ఈ నేపథ్యంలో ఇవాళ్టి రోజున కాలుష్య సమస్యను అరికట్టేందుకు తగు తక్షణ పరిష్కారమార్గాలు కనుగొనాల్సిన అవసరం ఉంది. ఇందుకు ఆటో ఎల్‌పీజీ ఒక మంచి ప్రత్యామ్నాయం‘ అని ఐఏసీ డైరెక్టర్ జనరల్ సుయశ్ గుప్తా తెలిపారు.
Comments
Please login to add a commentAdd a comment