ఆగస్టు వరకు నాన్-జీఎస్టీ ధరల్లోనే...
పేషెంట్లు తమకు అవసరమైన మందులను ఆగస్టు వరకు నాన్-జీఎస్టీ ధరల్లోనే కొనుగోలు చేసుకునేలా ఫార్మసీలు, రిటైల్ షాపులు అవకాశం కల్పిస్తున్నాయి
ముంబై : దేశమంతటా ఒకే పన్ను విధానం జీఎస్టీ జూలై 1 నుంచి అమల్లోకి వచ్చేసింది. అన్ని రకాల ఉత్పత్తులు మార్కెట్లో జీఎస్టీ ధరల్లోనే లభ్యమవుతున్నాయి. కానీ ఒక్క ఫార్మాస్యూటికల్ ఉత్పత్తులు మాత్రం పేషెంట్లకు మామూలు ధరల్లోనే లభ్యంకానున్నాయి. పేషెంట్లు తమకు అవసరమైన మందులను ఆగస్టు వరకు నాన్-జీఎస్టీ ధరల్లోనే కొనుగోలు చేసుకునేలా ఫార్మసీలు, రిటైల్ షాపులు అవకాశం కల్పిస్తున్నాయి.. ఫార్మసీల్లోకి, రిటైల్ షాపుల్లోకి కొత్తగా సరుకు వచ్చేంత వరకు పేషెంట్లకు ఈ నాన్-జీఎస్టీ ధరల్లోనే మందులు లభ్యం కానున్నాయని ఇండస్ట్రీ వర్గాలు చెబుతున్నాయి. మార్కెట్ ఇన్వెంటరీ అయిపోయేంత వరకు ఇది కొనసాగనుందని, సుమారు రెండు నెలల వరకు దీనికి సమయం పట్టవచ్చని ఇండస్ట్రీ నిపుణులు చెప్పారు. ఆగస్టు నుంచి మార్కెట్లోకి వచ్చిన కొత్త స్టాక్‌లకు సమీక్షించిన ఎంఆర్పీలను అప్లయ్ చేస్తారని వారు పేర్కొన్నారు. జీఎస్టీ అమలుతో ఇన్సులిన్, క్రిటికల్-కేర్ ఉత్పత్తులు అంటే కిడ్ని, క్యాన్సర్‌లకు సంబంధించిన ధరలు కిందకి దిగొచ్చాయి.
కానీ వీటిని అప్లయ్ చేయడానికి మరో రెండు నెలలు పట్టే అవకాశం కనిపిస్తోంది. జీఎస్టీ కింద ఇన్సులిన్ వంటి వాటికి 5 శాతమే పన్ను విధించగా.. అవసరమైన మందులపై మాత్రం 12 శాతం మేర జీఎస్టీ విధించారు. జీఎస్టీ అమలుతో కంపెనీల పన్ను చెల్లింపులు కూడా పెరుగనున్నాయి. దీంతో ఎన్‌ఎల్‌ఈఎం డ్రగ్స్ ధరల్లో స్వల్పంగా 2.29 శాతం పెంపు ఉండనుంది. ఎన్‌ఎల్‌ఈఎం డ్రగ్స్‌లో చాలావరకు ప్రాణాలని కాపాడే మందులే ఉండటం గమనార్హం. ఫార్మా రిటైల్‌మార్కెట్లో ఇవి 25-30 శాతం స్థానాన్ని ఆక్రమించుకున్నాయి. సాధారణంగా మార్కెట్ ఇన్వెంటరీ రెండు నెలలకు ఉందని, ఆగస్టు నుంచి పాక్షికంగా కొత్త ధరలను అమల్లోకి తీసుకొచ్చి, సెప్టెంబర్ నుంచి పోస్టు-జీఎస్టీ ధరలను ఫార్మసీలు అమల్లోకి తీసుకొస్తాయని అంచనావేస్తున్నట్టు ఓ ఫార్మాస్యూటికల్ రీసెర్చ్ సంస్థ డైరెక్టర్ అమీష మసురేకర్ చెప్పారు.