సెర్చింజిన్ దిగ్గజం గూగుల్ (ఫైల్ ఫోటో)
సెర్చింజిన్ దిగ్గజం గూగుల్‌కు ఐరోపా సమాఖ్య(ఈయూ) బుధవారం భారీ షాకిచ్చింది. మరోసారి భారీ మొత్తంలో 4.34 బిలియన్ యూరోలు(దాదాపు 5 బిలియన్ డాలర్లు) జరిమానా విధించింది. పోటీదారులను రానీయకుండా.. స్మార్ట్‌ఫోన్ యూజర్లు గూగుల్ యాప్స్‌నే వాడేలా అనుచిత విధానాలను గూగుల్ అనుసరిస్తుందనే ఆరోపణలతో ఈ జరిమానా వేసింది. యూరోపియన్, అమెరికన్ ప్రత్యర్థుల ఫిర్యాదులపై 2015 నుంచి విచారణ చేపట్టిన యూరప్, నేడు తన నిర్ణయాన్ని వెలువరించింది. గతేడాది కూడా గూగుల్ భారీ మొత్తంలో 2.8 బిలియన్ డాలర్ల( రూ.17,478 కోట్లకు పైగా) జరిమానాను ఎదుర్కొంది. అప్పుడు తన షాపింగ్ సర్వీసులకు అనుకూలంగా యాంటీ ట్రస్ట్ నిబంధనలను అది ఉల్లంఘించడంతో, జరిమానా పడింది.
ఈ సెర్చింజిన్ దిగ్గజం గూగుల్‌తో పాటు, ఆపిల్, అమెజాన్, ఫేస్‌బుక్ లకు కూడా యూరోపియన్ రెగ్యులేటర్లు జరిమానాలు విధించాయి. గూగుల్ ప్రస్తుతం యాంటీ ట్రస్ట్ నిబంధనలను ఉల్లంఘించి, డివైజ్ విక్రయించడాని కంటే ముందస్తుగా స్మార్ట్‌ఫోన్లలో తన యాప్స్‌ను ఇన్‌స్టాల్ చేస్తుందని కమిషన్ ఆరోపించింది. తన ఆండ్రాయిడ్ ఆపరేటింగ్ సిస్టమ్‌లో ప్రత్యామ్నాయాలను వాడకుండా నిరోధించేలా తయారీదారులతో ముందస్తుగానే గూగుల్ సంప్రదింపులు జరిపిందని రెగ్యులేటర్లు ఆరోపిస్తున్నాయి. తన వ్యాపార ధోరణిని మార్చుకోవాలని గూగుల్‌ను యూరోపియన్ యూనియన్ ఆదేశించింది.
Comments
Please login to add a commentAdd a comment