ఇప్పటికే మాంద్యంతో నెట్టుకొస్తున్న 19 దేశాల యూరోజోన్ కూటమిలో గ్రీస్ రూపంలో మరోసారి ముసలం మొదలైంది. గ్రీస్ రాజకీయ పరిణామాలు ఆ దేశాన్ని యూరో జోన్ కూటమి నుంచి బయటికి పంపే దిశగా తీసుకెళుతున్నాయి. ఎందుకంటే అక్కడ అధ్యక్ష ఎన్నికల్లో అధికార పక్షం నిలబెట్టిన అభ్యర్థికి తగిన మద్దతు దక్కలేదు. దీంతో ఈ నెలాఖరులో అనివార్యంగా ఎన్నికలు జరగబోతున్నాయి. ఈ ఎన్నికల్లో ప్రతిపక్ష సిరిజా పార్టీ అధికారాన్ని చేజిక్కించుకోవచ్చన్న అంచనాలు సర్వత్రా వ్యక్తమవుతున్నాయి. అయితే సిరిజా పార్టీ నాయకుడు అలెక్సిస్ సిప్రాస్ గతంలో ప్రవేశపెట్టిన సంస్కరణలకు (ఉద్యోగాలు, ప్రభుత్వ వ్యయాల్లో కోతలు ఇతరత్రా) తాను వ్యతిరేకమని చెబుతున్నారు.
దీంతో యూరోజోన్ అస్థిత్వానికే ముప్పు వాటిల్లుతుందన్న ఆందోళనలు వ్యక్తమవుతున్నాయి. 2010లో గ్రీస్ దివాలా అంచుకు చేరుకోవడంతో యూరోపియన్ సెంట్రల్ బ్యాంక్, ఐఎంఎఫ్‌లు జోక్యం చేసుకుని సహాయ ప్యాకేజీలు అందించాయి. దీనికి ప్రతిగా ఆ దేశం సంస్కరణలను ప్రవేశపెట్టింది. ప్రస్తుతం గ్రీస్ ప్రభుత్వ అప్పులు 376 బిలియన్ డాలర్లకు పెరిగాయి. గ్రీస్ స్థూల దేశీయోత్పత్తి(జీడీపీ)తో పోలిస్తే ఇది 177 శాతం. వచ్చే మార్చినాటికి గ్రీస్ ఖజానా ఖాళీ కానుంది. ఇదే సమయంలో ఈసీబీకి దాదాపు 8 బిలియన్ డాలర్ల రుణ చెల్లింపులు జరపాలి. కొత్త సర్కారు కనుక సంస్కరణలను ఉపసంహరించి... చెల్లింపుల్లో విఫలమైతే(డీఫాల్ట్) ఆ దేశానికి భారీగా అప్పులిచ్చిన(ప్రభుత్వ బాండ్లను కొనుగోలు చేసిన) జర్మనీ(24 బిలియన్ డాలర్ల మేర), ఇతరత్రా దేశాలపై తీవ్ర ప్రభావం పడుతుంది. ఈ కూటమిలోని ఇతర బలహీన(అధిక అప్పుల భారం ఉన్నవి) దేశాలూ ఇదే బాటపడితే యూరోజోన్ విచ్ఛిన్నం అయ్యేందుకు.. చివరికి యూరో కరెన్సీ కనుమరుగయ్యేందుకు కూడా దారీతీయొచ్చని విశ్లేషకులు చెబుతున్నారు. జర్మనీ మాత్రం గ్రీస్ యూరోజోన్ నుంచి బయటికెళ్లిపోయినా ఇబ్బందేమీ లేదంటోంది.
ముడిచమురు ముచ్చెమటలు!
ప్రపంచవ్యాప్తంగా డిమాండ్ తగ్గుముఖం పట్టడానికి తోడు సరఫరా విపరీతంగా పెరిగిపోవటంతో ముడిచమురు ధర అంతకంతకూ పడిపోతోంది. తాజాగా ఐదున్నరేళ్ల కనిష్టమైన 50 డాలర్ల దిగువకు నెమైక్స్ క్రూడ్ బ్యారెల్ రేటు దిగజారడం ప్రపంచ ఆర్థిక వ్యవస్థ మందగమనంపై ఆందోళనలను మరింత పెంచుతోందని కొటక్ సెక్యూరిటీస్‌కు చెందిన దీపేన్ షా అభిప్రాయపడ్డారు. యూరప్, జపాన్ ఇతరత్రా ఆర్థిక వ్యవస్థల బలహీనతతో పాటు అమెరికా, రష్యా వంటి దేశాల నుంచి అధిక సరఫరాలే క్రూడ్ పతనానికి ప్రధాన కారణమని పరిశీలకులు చెబుతున్నారు. చమురు ఎగుమతి దేశాల కూటమి(ఒపెక్)లోని ప్రధాన దేశమైన సౌదీ కూడా క్రూడ్ ధర 20 డాలర్ల స్థాయికి పడిపోయినా.. ఇప్పట్లో తాము ఉత్పత్తిని తగ్గించేదిలేదని తెగేసి చెబుతుండటంతో ధర ఇం కెంత జారిపోతుందోననే ఆందోళనలు పెరుగుతున్నాయి.
యూరోజోన్‌లో ‘గ్రీస్’ ముసలం..!
Published Wed, Jan 7 2015 1:00 AM | Last Updated on Thu, Jul 11 2019 8:00 PM
Advertisement
Advertisement