30% బ్యాంకు కొలువులకు ముప్పు | Ex-Citi CEO Vikram Pandit says 30% of bank jobs at risk from technology | Sakshi
Sakshi News home page

30% బ్యాంకు కొలువులకు ముప్పు

Published Thu, Sep 14 2017 1:30 AM | Last Updated on Tue, Sep 19 2017 4:30 PM

30% బ్యాంకు కొలువులకు ముప్పు

30% బ్యాంకు కొలువులకు ముప్పు

టెక్నాలజీలతోపొంచి ఉన్న సవాళ్లు
సిటీ గ్రూపు మాజీ సీఈవో విక్రమ్‌ పండిట్‌ అభిప్రాయం...


న్యూఢిల్లీ: టెక్నాలజీలతో బ్యాంకు ఉద్యోగాలకూ ముప్పు పొంచి ఉంది. టెక్నాలజీలో వస్తున్న మార్పుల కారణంగా రానున్న ఐదేళ్లలో 30 శాతం బ్యాంకు ఉద్యోగాలు కనుమరుగు కానున్నట్లు సిటీ గ్రూపు మాజీ సీఈవో విక్రమ్‌ పండిట్‌ (60) తెలిపారు. సిటీ గ్రూపునకు 2007 నుంచి 2012 వరకు విక్రమ్‌ పండిట్‌ సీఈవోగా వ్యవహరించారు. గతేడాది న్యూయార్క్‌ కేంద్రంగా ఓరెగాన్‌ అనే ఇన్వెస్ట్‌మెంట్‌ కంపెనీని ఏర్పాటు చేశారు. బుధవారం ఓ వార్తా సంస్థకు ఇంటర్వ్యూ ఇచ్చిన సందర్భంలో ఆయన మాట్లాడుతూ... ఆర్టిఫీషియల్‌ ఇంటెలిజెన్స్, రోబోటిక్స్‌ వల్ల బ్యాక్‌ ఆఫీస్‌ పనుల్లో ఉద్యోగాల సంఖ్య తగ్గిపోతున్నట్లు చెప్పారు. ఈ టెక్నాలజీల వల్ల పని కూడా సులువు అవుతుందని అభిప్రాయపడ్డారు.

వీటి వల్ల ఉద్యోగాల నష్టం అన్నది సిటీగ్రూపు గతేడాది అంచనా వేసిన స్థాయిలోనే ఉండొచ్చని అభిప్రాయపడ్డారు. సిటీ గ్రూపు గతేడాది మార్చిలో రూపొందించిన నివేదికలో... 2015 నుంచి 2025 మధ్య రిటైల్‌ బ్యాంకింగ్‌లో ఆటోమేషన్‌ (యాంత్రీకరణ) కారణంగా 30 శాతం ఉద్యోగాలు తగ్గిపోతాయని అంచనా వేసింది. ఒక్క అమెరికాలోనే 7,70,000 పూర్తి స్థాయి ఉద్యోగాలు, యూరోప్‌లో 10 లక్షల ఉద్యోగాలు కనుమరుగవుతాయన్నది సిటీ గ్రూపు అంచనా. బ్యాంకింగ్‌ రంగం మరింత పోటాపోటీగా మారుతోందని, ప్రత్యేకమైన సేవలు అందించే వారి అవసరంతోపాటు ఈ రంగంలో స్థిరీకరణకు అవకాశం ఉందని పండిట్‌ పేర్కొన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement