ఎంత సంపాదించినా పొదుపు తెలియకపోతే నెల చివరికొచ్చేసరికి రూపాయి కనిపించదు. ఎంత సంపాదించామన్నది కాదు, ఎంత పొదుపు, మదుపు చేశామన్నదే వ్యక్తుల ఆర్థిక ప్రణాళికలో కీలకం. ఖర్చులను నియంత్రించుకుని, తగినంత ఇన్వెస్ట్ చేయడం ద్వారానే అన్ని ఆర్థిక పరమైన లక్ష్యాలను చేరడం సాధ్యపడుతుంది. అందుకు ఏం చేయాలన్నది నిపుణుల సూచనల ఆధారంగా తెలియజేస్తున్న కథనం ఇది.
క్రమం తప్పకుండా పొదుపు చేయడం ద్వారానే ఆర్థిక భద్రత సమకూరుతుందని చాలా మందికి తెలిసిన విషయమే. అయినా, మనలో చాలా మంది అవసరమైనంత పొదుపు చేయరు. కొందరికి అవసరమైనంత మిగులు ఉండదు. కొందరు పొదుపు వాయిదా వేస్తుంటారు. భవిష్యత్తు సంగతి తర్వాత, ముందు ఈ రోజు గడిస్తే చాలనుకుంటారు.
పనుల్లో ఆలస్యం జరగకూడదన్న సంకల్పంతో తమ గడియారాన్ని 10–15 నిమిషాలు అధికంగా సెట్ చేసే వారున్నారు. దాంతో నిర్ణీత సమయానికి పనులను పూర్తి చేయగలమని, సమయ పాలన పాటించొచ్చని భావిస్తారు. గడియారం 10 నిమిషాలు వేగంగా నడుస్తుందని వారికి తెలుసు. కాకపోతే క్రమశిక్షణ కోసం వారు ఆ మార్గాన్ని ఎంచుకుంటారు. ఈ తరహా విధానాలు పొదుపు, మదుపులకు కూడా అవసరం. ఇక్కడున్నవి అటువంటివే. ఎంత సంపాదించినా పొదుపు చేయలేని వారికి ఇవి సాయంగా ఉంటాయి.
వేతన పెంపు
ఏటా వేతనం పెరుగుతూ ఉంటుంది. పెరిగే వేతనానికి అనుగుణంగా ఖర్చులు, వ్యయాల్లోనూ పెరుగుదల ఉంటుంది. అయితే, ఎంతో కొంత మిగులు ఉంటుంది. దాన్ని సైతం ఖర్చు చేసేయకుండా పెట్టుబడులకు మళ్లించాలి. వేతనం పెరిగిన నెల నుంచే ఆటోమేటిగ్గా బ్యాంకు ఖాతా నుంచి డెబిట్ అయ్యేలా సెట్ చేసుకోవాలి.
మీరు ఖర్చు చేసేందుకు చాన్స్ తీసుకునే అవకాశం లేకుండా ముందే పెట్టుబడులకు వెళతాయి. పెరిగే వేతనానికి తగ్గట్టుగా మ్యూచువల్ ఫండ్ సిప్ లేదా రికరింగ్ డిపాజిట్‌ను ఎంచుకోవాలి. వార్షికంగా వచ్చే బోనస్‌కు సైతం ఇదే సూత్రం వర్తిస్తుంది. బోనస్‌ను లంప్‌సమ్‌గా ఇన్వెస్ట్ చేసుకోవచ్చు.
వేర్వేరు ఖాతాలు
బ్యాంకు ఖాతాలు అధిక సంఖ్యలో ఉన్నా గందరగోళంగా ఉంటుంది. పొదుపు, పెట్టుబడులకు ఓ బ్యాంకు ఖాతాను ప్రత్యేకించడం మంచిది. అయితే, పెట్టుబడుల ఖాతాకు డెబిట్ కార్డును తీసుకోవద్దు. ఇక్కడ ఓ ఉదాహరణ చూస్తే రఘురామ్ తన ఆదాయాన్ని నెలవారీ తప్పనిసరి ఖర్చులు (రుణ వాయిదా తదితర), కిరాణ, ఇంటి వ్యయాల కోసం, పొదుపు, మదుపుల కోసం అంటూ మూడు భాగాలు చేయడం అలవాటు. దీంతో ఒక నెలలో ఖర్చులు ఎన్ని ఎదురైనా గానీ, అతడి సేవింగ్స్, ఇన్వెస్ట్‌మెంట్స్ ఆగడం లేదు. ఈ తరహా స్ట్రాటజీలను అనుసరించేవారు ఎందరో ఉన్నారు.
ఇలా చేయడం సరికాదు
అభినవ్ మిశ్రా ఏటా పన్ను ఆదా కోసం తన పెట్టుబడుల వివరాలను కంపెనీకి ఆర్థిక సంవత్సరం ప్రారంభంలో ఇచ్చే అలవాటు లేదు. దాంతో కంపెనీ అతడి వార్షికాదాయం ప్రకారం టీడీఎస్‌ను నెలవారీ అమలు చేస్తోంది. నిజానికి మిశ్రా సెక్షన్ 80సీ కింద రూ.1.5 లక్షలను ఇన్వెస్ట్ చేస్తున్నాడు. ఇంటి అద్దె కూడా భారీగానే చెల్లిస్తున్నాడు. అయితే, ఈ వివరాలను డిసెంబర్ నెలలోనే కంపెనీకి సమర్పిస్తున్నాడు. దీంతో కంపెనీ తర్వాతి మూడు నెలలు (జనవరి–మార్చి) టీడీఎస్ అమలు చేయడం లేదు.
దాంతో మిశ్రా చేతికి ఏటా చివరి మూడు నెలలు పూర్తి వేతనం అందుతోంది. కానీ, ఈ విధమైన విధానం సరికాదంటున్నారు నిపుణులు. అంచనాలు తప్పితే మరింత పన్ను చెల్లించాల్సి వస్తుంది. మరో కోణంలో టీడీఎస్ వెనక్కి వచ్చేందుకు నెలల సమయం పడుతుంది. పైగా టీడీఎస్ రిఫండ్ అంతా ఒకేసారి వచ్చి పడుతుంది. మరోవైపు జనవరి నుంచి మార్చి వరకు పూర్తి వేతనం వస్తుంది. ఈ అధికంగా వచ్చే నిధుల్ని అర్థవంతంగా ఇన్వెస్ట్ చేసినప్పుడే ప్రయోజనం నెరవేరుతుంది. లేక ఆ మొత్తం ఖర్చులకు వెళ్లిపోతే నష్టపోయినట్టే.
లగ్జరీకి పోతున్నారా...?
ప్రతీ ఒక్కరికీ లైఫ్‌స్టయిల్ కోరికలు ఉండడం సహజంగా మారింది. హాలిడేటూర్‌కు వెళ్లాలని, బయట డిన్నర్ చేయాలని, స్టయిల్‌గా ఉండే డ్రెస్ తీసుకోవాలి, మంచి ఫీచర్లతో కూడిన సెల్‌ఫోన్ చేతిలో ఉండాలని ఇలాంటి కోరికలు ఎన్నో ఉంటుంటాయి. అయితే, వీటిని త్యాగం చేయాలని చెప్పడంలేదు. కానీ, వీటిని కొనుగోలు చేసేవారు అదేసమయంలో అంతే మొత్తం నగదును పెట్టుబడిగా పెట్టడం అలవాటు చేసుకోవాలి. దీనివల్ల రెండు ప్రయోజనాలున్నాయి. ఒకటి మీ పెట్టుబడి వృద్ధి చెందుతుంది. రెండు ఖర్చులకు తగ్గ స్థాయిలో ఆదా చేయగలగడం.
ఈఎంఐ మంచిదే!
పొదుపు చేయలేకపోతున్నవారు పర్సనల్ లోన్ తీసుకుని ప్రతీ నెలా ఈఎంఐని బ్యాంకు ఖాతా నుంచి ఆటోమేటిగ్గా చెల్లించే ఏర్పాటు చేసుకోవాలి. రెండు, మూడేళ్ల పాటు ప్రతీ నెలా ఈఎంఐ రూపంలో వేతనం నుంచి రుణం చెల్లించడం చేస్తారు. దీనివల్ల పొదుపు అలవడినట్టే.
అయితే, రుణం తీరిన తర్వాత కూడా ఈఎంఐ ఎంత అయితే చెల్లించారో అంతే మొత్తాన్ని పెట్టుబడులకు ఆటోమేటిగ్గా వెళ్లేలా సెట్ చేసుకోవాలి. దీనివల్ల పొదుపు అలవడుతుంది. అప్పటి వరకు ఈఎంఐగా చెల్లించి ఉంటారు కనుక ఆ తర్వాత అంతే మొత్తాన్ని ఇన్వెస్ట్ చేయడం భారంగా అనిపించదు. పర్సనల్ లోన్ కింద తీసుకున్న మొత్తాన్ని అధిక రాబడులను ఇచ్చే డెట్ సాధనాల్లో ఇన్వెస్ట్ చేయడం ద్వారా వడ్డీ స్థాయిలో రాబడులను అందుకోవచ్చు.
సాయం తీసుకోండి...
మీకు అత్యంత సన్నిహితులను మీ పొదుపు, మదుపులను పరిశీలించేందుకు అనుమతించొచ్చు. ఆర్థిక విషయాలపై పట్టు సాధించలేని పరిస్థితుల్లో వారి సాయం పొందడంలో తప్పులేదు. వారు మీ ఖర్చులు, పొదుపులపు పరిశీలించి ట్రాక్‌లోనే ఉన్నదీ, లేనిదీ చూస్తారు. ట్రాక్ తప్పితే అప్రమత్తం చేస్తారు. ఇక మీకు సన్నిహితులైన వారితో కలసి ఆర్థిక విషయాల్లో, ప్రణాళిక, పెట్టుబడుల్లో పోటీ వాతావరణం ఉండేలా చూసుకోవడం కూడా
తెలివైన యోచనే.
ఖర్చుకు ముందు ఒక్క నిమిషం
ప్రతీ ఖర్చు కూడా మీ బడ్జెట్‌కు చిల్లు పెట్టేదే. అందుకే కొనుగోలుకు ముందు కాస్తంత సమయం ఇవ్వడం (తాత్కాలికంగా ఆగడం) ద్వారా అది నిజంగా అవసరమా, లేక కోరికా అన్నది తేల్చుకునేందుకు అవకాశం లభిస్తుంది. నిజంగా అవసరమే అయితే కొనుగోలుకు ముందుకు వెళ్లొచ్చు.
లాక్ చేయడం
దీర్ఘకాలిక పెట్టుబడి సాధనాల్లో ఇన్వెస్ట్ చేయడం ప్రారంభిస్తే కోరుకున్నప్పుడు వెనక్కి తీసుకోలేం. ఇది ఒకింత ఇబ్బందే. అయితే, దీనిలో ప్రయోజనమూ ఉంది. ఇలా అయినా దీర్ఘకాలం పాటు ఇన్వెస్ట్ చేస్తారు. పీపీఎఫ్ 15 ఏళ్ల కాల వ్యవధితో కూడినది. అయితే, ఐదేళ్ల తర్వాత పాక్షిక ఉపసంహరణకు వీలు కల్పిస్తుంది.
ఎన్‌పీఎస్ రిటైర్మెంట్‌కు ముందు విత్‌డ్రా చేసుకోవడానికి లేదు. అయితే, ఈ మధ్య కొన్ని ప్రత్యేక అవసరాల్లో విత్‌డ్రాకు వీలు కల్పిస్తామని ఎన్‌పీఎస్ ప్రకటించింది. బీమా పాలసీలు అయితే 15–30 ఏళ్ల పాటు కొనసాగించాల్సి ఉంటుంది. ప్రీమియం చెల్లించకపోతే ల్యాప్స్ అయిపోతుందని, సరెండర్ చేస్తే తక్కువగా రావడం వల్ల నష్టపోవాల్సి ఉంటుందన్న భయంతో కచ్చితంగా పాలసీని నిర్ణీత కాలం వరకు కొనసాగిస్తారు.
భవిష్యత్తుపై స్పష్టత
20–30 ఏళ్ల మధ్యలో ఉన్నవారికి రిటైర్మెంట్ పెద్ద ప్రాముఖ్యం అనిపించకపోవచ్చు. అలా అని రిటైర్మెంట్‌కు ఇన్వెస్ట్‌మెంట్‌ను ఆలస్యం చేయడం సరికాదు. ఎందుకంటే చిన్న వయసులో పెట్టుబడి ప్రారంభించడం వల్ల కాంపౌండింగ్ ప్రయో జనంతో దీర్ఘకాలంలో భారీ నిధి సమకూరుతుంది.
అందుకని మీ లక్ష్యాలు, వాటి ప్రాధాన్యతలు, మీ ఆదాయం, అవసరాలకు అనుగుణంగా తగిన ప్రణాళికను రూపొందించుకోవడం అవసరం. ప్రతీ లక్ష్యానికి ఎంత వ్యవధి ఉంది, ఎంత మొత్తం సమకూరాలి, అందుకు ఎంత ఇన్వెస్ట్ చేయాలి, ఏ సాధనంలో అన్నది నిర్ణయించుకోవాల్సి ఉంటుంది. అవసరమైతే నిపుణుల సాయం తీసుకునేందుకు వెనుకాడరాదు.
Comments
Please login to add a commentAdd a comment