ముందు పొదుపు తర్వాతే ఖర్చు
ధనమేరా అన్నిటికీ మూలం... ఆ ధనము విలువ తెలుసుకొనుటె మానవ ధర్మం అన్నారు ఒక సినీ కవి. మనిషి అన్ని అవసరాలకూ ధనం అవసరం. సంపాదన ప్రారంభించిన నాటి నుంచి ఆదాయంలో కనీసం మూడవ వంతును ఆదా చేస్తూ వస్తే వయసు మళ్లాక హాయిగా కాలు మీద కాలు వేసుకుని కూర్చోవచ్చు. నేడు ప్రపంచ పొదుపు దినం సందర్భంగా ఎలా పొదుపు చేసుకుంటే జీవితం హాయిగా ఉంటుందో తెలుసుకుందాం...
ఒకసారి కావ్య అనే అమ్మాయి నా దగ్గరకు వచ్చి తనకు ఈ మధ్యనే పెళ్లయిందనీ, తను గృహిణిననీ, భర్త ఒక ప్రైవేట్ కంపెనీలో పనిచేస్తున్నారనీ, నెలకు 15 వేలు జీతమనీ చెప్పింది. వాళ్లు ప్రస్తుతం నెలకు 5 10 శాతం మ్యూచువల్ ఫండ్స్‌లో పెడుతున్నామనీ, మిగతా జీతమంతా ఖర్చు చేస్తున్నామనీ పొదుపు వివరాలు తెలిసింది.
ఇంతకీ వారిద్దరికీ పెద్దలు ఇచ్చిన ఆస్తిపాస్తులు లేవు. ఒక సంవత్సరం తరువాత పిల్లలను కనాలనుకుంటున్నారు. కనుక కాన్పు, చదువు, ఇతర ఖర్చులను దృష్టిలో ఉంచుకుని పొదుపు చేయడానికి ఆర్థిక ప్రణాళికను సూచించమంది.
కావ్య ప్రస్తుత పరిస్థితి గమనిస్తే చాలా తక్కువ మొత్తాన్ని పొదుపు చేస్తున్నట్లు లెక్క. అందువల్ల ఆమెకు ఈ కింది సంప్రదాయిక ఆర్థిక ప్రణాళికను సూచించాను.
ప్రతి వ్యక్తికి శారీరక, మానసిక ఆరోగ్యం ఎంత ముఖ్యమో ఆర్థికారోగ్యం కూడా అంతే ముఖ్యం. విద్య, వైద్యం, గృహవసతి లాంటి ఖర్చులు ఏటా 10 నుంచి 20 శాతం దాకా పెరుగుతూ ఉంటాయి. ఇక నిత్యావసరాలు, అత్యవసరాల సంగతి సరే సరి. ఇవన్నీ కుటుంబ ఆదాయానికి గండికొడుతున్నాయి. ఆర్థిక వనరులను సక్రమంగా వాడుకుంటూ ప్రణాళికాబద్ధంగా లక్ష్యాలను చేరుకోవాలి. ఆ దిశగా ఉపయోగపడే కొన్ని ముఖ్యాంశాలు...
బడ్జెట్ తయారీ: ప్రతి ఒక్కరూ ఆదాయవ్యయాలను రాసు కోవాలి. దీనివల్ల క్యాష్ ఫ్లో తెలుస్తుంది. అలాగే వారికున్న కీలకలక్ష్యాలను చేరడానికి పట్టే సమయాన్ని తెలుసుకుంటే, ఆర్థికప్రయాణం ఎక్కడవరకు చేయాలో అర్థం అవుతుంది.
రూపాయి పాపాయి: రూపాయిని పాపాయిలా చూడాలని పెద్దలు చెబుతారు. ఒక రూపాయిని పొదుపు చేశామంటే, ఒక రూపాయిని సంపాదించినట్లు. కుటుంబానికి ఏది ఏ మేర అవసరం అనే స్పష్టతతో ఖర్చులను అదుపు చేసుకోవాలి. పక్కింటివారో, స్నేహితులో ఫలానాది కొన్నారని, అవసరం లేని వస్తువుల కోసం ఖర్చు పెట్టుకుంటూ పోతే రానున్న రోజుల్లో అవసరమైన వాటిని అమ్ముకోవలసి వస్తుంది. ప్రఖ్యాత పెట్టుబడిదారునిగా పేరొందిన వారెన్ బఫెట్ ‘పొదుపు చేశాకే ఖర్చు గురించి ఆలోచించు. అంతేగాని ఖర్చులు పోను ఏమైనా మిగిలితే అదే పొదుపు అనేది సరికాదు’ అన్నారు.
అనుకోని సంఘటనలు: మరణం, అనారోగ్యం, అంగవైకల్యం లాంటివి మనల్ని ఇబ్బందిపెట్టే విషయాలు. జీవిత బీమా, ఆరోగ్య బీమా, వ్యక్తిగత ప్రమాద బీమా... వీటి ద్వారా అవసరాలను కొంతవరకు అధిగమించవచ్చు. వీటితోపాటు ఇతర అత్యవసరాలను దాటేలా ఒక అత్యవసర నిధిని 3 నుండి 6 నెలల జీతంతో ఏర్పాటుచేసుకోగలగాలి.
పొదుపు మదుపు: సంపాదనలో సింహభాగాన్ని పొదుపు- మదుపులకు మళ్లించాలి. వాటి రిస్క్, రిటర్న్స్ ఏ విధంగా ఉంటాయో ముందుగా తెలుసుకోవాలి. ఏయే సాధనాలు ఏ విధంగా ఉపయోగపడతాయో తెలుసుకుని కాలానుగుణంగా అవసరమైన మార్పు చేసుకోవాలి.
వాయిదా చిన్నచూపు: పొదుపు అనగానే ఇప్పుడే కెరీర్ ప్రారంభించాం, ఇప్పుడే పెళ్లయ్యింది. వంశపారంపర్యంగా ఆస్తులు వచ్చాయి, ఇప్పుడు కాదులే... అంటూ వాయిదా వేయడం ఆర్థిక ప్రగతికి మొదటి అడ్డంకి. వంద రూపాయలకి ఏం వస్తుంది, ఈ చిన్న మొత్తాలలో మనం సాధించేదేమిటి... అనే చిన్నచూపును రెండో అడ్డంకిగా చెప్పవచ్చు. సంపాదన తొలినాళ్ల నుండే 20 30 శాతం పొదుపునకు కేటాయించితే, ఆర్థిక లక్ష్యాలను సులువుగా అందుకోవచ్చు.
అప్పు ముప్పు: నెలసరి వాయిదాలతో వస్తువులు కొనడం, పర్సనల్ లోన్, వెహికల్ లోన్, క్రెడిట్ కార్ ్డలోన్ అంటూ కొంతమంది జీవితాంతం అప్పులు చేసి తిప్పలు పడుతుంటారు. ఇంటికోసం, పిల్లల చదువు కోసం, మంచి వ్యాపారం కోసం తప్పనిసరి పరిస్థితులలో తీసుకోవచ్చు. ఇప్పటికే అధిక వడ్డీ రేట్లకు రుణాలు తీసుకున్నవారు తక్కువ వడ్డీ రుణాలకు మారడం లేదా పూర్తిగా రుణవిముక్తులు కావడం మంచిది.
సంపద సృష్టి: ఉమ్మడి కుటుంబాలు తగ్గుతూ మేమిద్దరం మాకిద్దరనే కుటుంబాలు పెరుగుతున్న రోజులివి. ఎక్కువ కుటుంబాలలో ఒకరే సంపాదించడం, మిగిలిన సభ్యులు ఆ వ్యక్తిపై ఆధారపడడం చూస్తుంటాం. ఆర్థిక లక్ష్యాలను సకాలంలో చేరుకోవాలంటే అంతా డబ్బుతోనే ముడిపడి ఉంటుంది. అందుకోసం ఎవరికివారు ఎక్కువ మొత్తాన్ని సంపాదించాలి తక్కువ ఖర్చులు పెట్టుకొంటూ ఎక్కువ భాగాన్ని ‘పొదుపు మదుపుకి కేటాయించాలి. ఈ రెండవ పని స్థితప్రజ్ఞతతో, పట్టుదలతో చాలామంది చెయ్యటానికి అవకాశం ఉన్న మార్గం. సంపాదించే వయస్సులో వీలైనంత కూడపెడితే, ఆర్థిక లక్ష్యాలను అధిగమించి, మలి వయస్సు జీవితపు ఆర్థిక అవసరాలను అధిగమించగలుగుతాం.
కావ్యకి 35 సంవత్సరాలు వచ్చేసరికి 15 లక్షల విలువైన ఇల్లు కొనుక్కుంది. 5 లక్షలతో ఒక కారు కొంది. పిల్లల కోసం 10 లక్షలు పొదుపు చేసింది. ఒక్క కావ్య మాత్రమే కాదు, అందరూ ఈ సూచనలను పాటించి, పొదుపు చేస్తే ఆనంద మయమైన జీవితాన్ని సొంతం చేసుకోవచ్చు.
రజని భీమవరపు, సర్టిఫైడ్ ఫైనాన్షియల్ ప్లానర్, హైదరాబాద్