ఐదో నెలా ఎగుమతులు అప్..!
• జనవరిలో వృద్ధి 4.32%; 22 బిలియన్ డాలర్లు
• దిగుమతుల విలువ 32 బిలియన్ డాలర్లు
న్యూఢిల్లీ: భారత్ ఎగుమతులు వరుసగా ఐదవనెలా వృద్ధిని నమోదుచేసుకున్నాయి. 2016 జనవరితో పోల్చిచూస్తే... 2017 జనవరిలో ఎగుమతులు 4 శాతం పైగా వృద్ధిని నమోదుచేసుకున్నాయి. విలువ 22 బిలియన్ డాలర్లుగా నమోదయ్యింది. ఇక దిగుమతులు ఇదే నెలలో 11 శాతం పెరిగి 32 బిలియన్ డాలర్లుగా నమోదయ్యాయి. దీనితో ఎగుమతులు – దిగుమతుల మధ్య నికర వ్యత్యాసం 10 బిలియన్ డాలర్లుగా నమోదయ్యింది. 2016 జనవరిలో వాణిజ్యలోటు 7.66 బిలియన్ డాలర్లు. వాణిజ్య, పరిశ్రమల మంత్రిత్వశాఖ బుధవారం విడుదల చేసిన గణాంకాల్లో కొన్ని ముఖ్యాంశాలు చూస్తే...
⇔ జనవరిలో ఎగుమతుల పెరుగుదలలో పెట్రోలియం ఉత్పత్తులు, ఇంజనీరింగ్ వస్తువులు, ముడి ఇనుములది కీలకపాత్ర. ముడి ఇనుము ఎగుమతులు 10 శాతం పెరిగి 184 మిలియన్ డాలర్లుగా నమోదయ్యాయి. పెట్రోలియం ఉత్పత్తుల విషయంలో ఈ రేటు 29 శాతం పెరిగి 3 బిలియన్ డాలర్లుగా నమోదయ్యింది. ఇక ఇంజనీరింగ్ ఉత్పత్తుల విషయంలో ఎగుమతులు 12 శాతం వృద్ధితో 6 బిలియన్ డాలర్లుగా నమోదయ్యాయి.
⇔ జనవరిలో ఎగుమతుల వృద్ధి డిసెంబర్ వృద్ధి రేటుకన్నా (5.72%) తక్కువ.
⇔ కాగా ప్రస్తుత ఆర్థిక సంవత్సరం ఏప్రిల్ నుంచి జనవరి మధ్య కాలంలో ఎగుమతులు కేవలం 1 శాతం పెరిగి, విలువలో 221 బిలియన్ డాలర్లుగా నమోదయ్యాయి. ఈ కాలంలో వాణిజ్యలోటు 108 బిలియన్ డాలర్ల నుంచి 86 బిలియన్ డాలర్లకు తగ్గింది.
పసిడి వెలవెల...: మరోవైపు పసిడి దిగుమతులు జనవరిలో భారీగా 30 శాతం పడిపోయాయి. విలువలో కేవలం 2.04 బిలియన్ డాలర్లుగా నమోదయ్యింది. దేశంలో పెద్ద నోట్ల రద్దుతో జనవరిలో డిమాండ్ తగ్గడం పసిడి దిగుమతులపై ప్రధానంగా ప్రభావం చూపింది.
డిసెంబర్‌లో సేవల ఎగుమతులు ఇలా...
ఇదిలావుండగా, 2016 డిసెంబర్‌లో సేవల విభాగం నుంచి ఎగుమతులు 3 శాతం పెరిగాయి. విలువలో 14 బిలియన్ డాలర్లుగా నమోదయ్యాయి. 2016 నవంబర్‌లో ఈ విభాగం నుంచి వృద్ధి రేటు 2 శాతం.