హైదరాబాద్‌లో రీగల్ రాప్టార్ మోటార్‌సైకిల్స్ ప్లాంటు
- ఏర్పాటు చేస్తున్న ఫ్యాబ్ మోటార్స్
- రూ.1,000 కోట్ల పెట్టుబడి
హైదరాబాద్, బిజినెస్ బ్యూరో: లగ్జరీ బైక్‌ల తయారీలో ఉన్న అమెరికా కంపెనీ రీగల్ రాప్టార్ మోటార్‌సైకిల్స్ భారత్‌లో అడుగు పెడుతోంది. సంస్థ భారతీయ భాగస్వామి అయిన ఫ్యాబులస్ అండ్ బియాండ్ మోటార్స్ ఇండియా (ఫ్యాబ్ మోటార్స్) హైదరాబాద్‌లో రూ.1,000 కోట్లతో అసెంబ్లింగ్ ప్లాంటును ఏర్పాటు చేస్తోంది. కొన్ని రోజుల్లో ప్లాంటు పనులు ప్రారంభం కానున్నాయి. షిఫ్ట్‌కు నెలకు 500 బైక్‌ల తయారీ సామర్థ్యంతో తొలి దశ ప్లాంటు ఏడాదిలో సిద్ధమవుతుందని ఫ్యాబ్ మోటార్స్ మేనేజింగ్ డెరైక్టర్ ఎంజీ షారిఖ్ తెలిపారు. హైదరాబాద్‌లో జరుగుతున్న ఆటో షో సందర్భంగా శుక్రవారమిక్కడ ఆయన మీడియాతో మాట్లాడారు. రీగల్ రాప్టార్ కూడా కొంత పెట్టుబడి పెడుతోందని చెప్పారు. ప్రత్యక్షంగా, పరోక్షంగా 25,000 మందికి ఉపాధి లభిస్తుందని వివరించారు.
తొలి షోరూం హైదరాబాద్‌లో..
యూఎస్ డిజైన్‌తో షాంఘైలో తయారైన రీగల్ రాప్టార్ బైక్‌లు ప్రపంచవ్యాప్తంగా 39 దేశాల్లో అమ్ముడవుతున్నాయి. భారత్‌లో తొలుత బాబర్, డేటోనా 350, డీడీ 350ఈ 9బీ వంటి మోడళ్లను విడుదల చేయనుంది. రీగల్ రాప్టార్ బ్రాండ్‌లో 320-1,800 సీసీ ఇంజన్ సామర్థ్యంగల బైక్‌లు ఉన్నాయి. ధర రూ.2.90-20 లక్షల మధ్య ఉంది. తొలి షోరూం హైదరాబాద్‌లో ప్రారంభం కానుంది. దేశవ్యాప్తంగా ప్రధాన నగరాల్లో షోరూంలను తెరువనున్నారు. రీగల్ రాప్టార్ మోటార్‌సైకిల్స్, ఫ్యాబ్ మోటార్స్ మధ్య గతేడాది అక్టోబరులో ఒప్పందం కుదిరింది. భారత్‌లో తయారైన బైక్‌లను సౌదీ అరేబియా, యూఏఈ, ఒమన్‌తోపాటు పొరుగున ఉన్న దేశాలకు ఎగుమతి చేయనున్నారు. తొలుత విడిభాగాల రూపంలో(సీకేడీ) బైక్‌లను దిగుమతి చేస్తారు. రానున్న రోజుల్లో కొన్ని విడిభాగాలను దేశీయంగా తయారీ చేపడతారు.