బంగారుకొండ కరుగుతోంది..
అంతర్జాతీయంగా ఐదేళ్ల కనిష్టానికి క్షీణత
- అమెరికా ఫెడ్ వడ్డీ రేట్లు పెంచుతుందనే భయాలు
- చైనాలో కమోడిటీ మార్కెట్లో అమ్మకాల వెల్లువ
- ముంబైలో పది గ్రాముల రేటు రూ. 520 డౌన్
- రెండేళ్ల కనిష్టం... రూ. 25,400
లండన్/ముంబై: అమెరికా ఫెడరల్ రిజర్వ్ బ్యాంక్ వడ్డీ రేట్లు పెంచవచ్చనే అంచనాలతో పసిడి రేట్లు అంతకంతకూ పతనమవుతున్నాయి. తాజాగా సోమవారం.. అంతర్జాతీయంగా ఔన్సు బంగారం రేటు 1.7 శాతం పైగా తగ్గి అయిదేళ్ల కనిష్ట స్థాయి 1,115.14 డాలర్లకు పడిపోయింది. ఒక దశలో ఏకంగా 4.2 శాతం క్షీణతతో 1,086.18 డాలర్ల స్థాయినీ తాకింది. రాబోయే రోజుల్లో పసిడి రేటు 1,000 డాలర్ల కన్నా కూడా తక్కువకి పతనం కావొచ్చన్న అంచనాలు నెలకొన్నాయి. మార్కెట్ వర్గాలు ఊహించుకుంటున్నంత స్థాయిలో చైనా బంగారం నిల్వలు పెంచుకోవడం లేదన్న వార్తలు పుత్తడి ధరలు క్షీణించడానికి మరో కారణం. తాజా పరిణామాలతో చైనాలో పసిడి అమ్మకాలు వెల్లువెత్తాయి.
షాంఘై స్పాట్ మార్కెట్లో ఇన్వెస్టర్లు సోమవారం 33 టన్నుల పసిడిని విక్రయించారని అంచనా. బంగారం ఆధారిత ఎక్స్ఛేంజ్ ట్రేడెడ్ ఫండ్స్ (గోల్డ్ ఈటీఎఫ్) సైతం భారీగా అమ్మకాలు జరిపాయి. దేశీయంగా ఫ్యూచర్స్ మార్కెట్ మల్టీ కమోడిటీ ఎక్స్ఛేంజ్ (ఎంసీఎక్స్)లో ఆగస్టు నెల కాంట్రాక్టు 10గ్రాముల రేటు సుమారు రెండు శాతం తగ్గి ఒక దశలో రూ. 24,904కి క్షీణించింది. దాదాపు దశాబ్ద కాలంలో అమెరికా తొలిసారిగా వడ్డీ రేట్లు పెంచితే డాలరు విలువ మరింతగా బలపడుతుందన్న అంచనాలతో పసిడి నుంచి వైదొలిగి.. ఇతర లాభదాయక పెట్టుబడి సాధనాల వైపు ఇన్వెస్టర్లు మళ్లుతున్నారని పరిశీలకులు పేర్కొంటున్నారు.
దేశీయంగా రెండేళ్ల కనిష్టానికి...
అంతర్జాతీయంగా పసిడి పతన ప్రభావం భారత్‌లోనూ కనిపించింది. దేశీయంగా వివిధ బులియన్ మార్కెట్లలో బంగారం రేట్లు గణనీయంగా తగ్గాయి. ముంైబె లో మేలిమి బంగారం రేటు ఏకంగా రూ. 520 క్షీణించి రూ. 25,400కి పడిపోయింది. ఆభరణాల బంగారం కూడా అంతే తగ్గి రూ. 25,250 వద్ద ముగిసింది. 2013 జూన్ 28 తర్వాత పసిడి ధర ఈ స్థాయికి పడటం ఇదే తొలిసారి. అటు న్యూఢిల్లీలో 10 గ్రాముల మేలిమి బంగారం రేటు రూ. 300 తగ్గి రూ. 25,700కి క్షీణించింది.
బంగారం దిగుమతులను తగ్గించేందుకు ప్రభుత్వం, రిజర్వ్ బ్యాంకు కఠిన చర్యలు తీసుకుంటుండటం, ఈక్విటీల్లో ర్యాలీతో పసిడిలో పెట్టుబడులకు డిమాండ్ తగ్గుతుండటం వంటి అంశాలు పసిడి ధరలపై ప్రతికూల ప్రభావాలు చూపుతున్నాయి. దేశీయంగా జ్యువెలర్స్ నుంచి డిమాండ్ అంతగా లేకపోవడం కూడా దీనికి కారణమని మార్కెట్ వర్గాలు తెలిపాయి. బంగారంతో పాటు వెండి రేట్లు కూడా నేలచూపులు చూస్తున్నాయి. అమ్మకాల ఒత్తిడితో ముంబైలో వెండి ధర కిలోకి రూ. 340 క్షీణించి రూ. 34,650 వద్ద క్లోజయ్యింది.
ఇప్పుడు కొనొచ్చా?
ఇలాంటి అంశాలన్నీ కలగలిసి పసిడి రేట్లను పడేస్తున్నాయని మార్కెట్ వర్గాలు చెబుతున్నాయి. అయితే, రేట్లు మరింత తగ్గిపోతాయేమోనన్న భయాలతో అంతా పుత్తడి నుంచి వైదొలుగుతున్న తరుణంలోనే కొనుగోళ్లకు మంచి అవకాశాలు ఉంటాయన్నది వారి వాదన. అమెరికా వడ్డీ రేట్ల పెంపు భయాల కారణంగా పసిడి రేట్లు ఎల్లకాలం తగ్గుతూనే ఉండవని కొందరు పరిశీలకులు చెబుతున్నారు. 1985 నుంచి 1987 దాకా ఒకవైపు వడ్డీ రేట్లు పెరుగుతున్నా .. వాటితో పాటు బంగారం రేట్లు కూడా పెరిగాయని, అలాగే 2003 అక్టోబర్ నుంచి 2006 అక్టోబర్ దాకా కూడా అలాంటి పరిస్థితే పునరావృతం అయిందన్నది వారి విశ్లేషణ.
పతనానికి పలు కారణాలు..
పసిడికి 1998 నుంచి 2011 దాకా బుల్ మార్కెట్‌లా గడిచింది. అయితే, ఎంత ఎత్తుకి పెరిగిందో.. అదే స్థాయిల్లో కరెక్షన్లు కూడా చవిచూసింది. ఈ నేపథ్యంలో పుత్తడి భారీ పతనానికి ప్రస్తుతం పలు కారణాలను విశ్లేషిస్తున్నారు పరిశీలకులు. వీటిలో కొన్ని..
1. అమెరికా ఫెడరల్ రిజర్వ్ కీలక పాలసీ రేట్లను పెంచనుండటం (దీని వల్ల అక్కడ వడ్డీ రేట్లూ పెరుగుతాయ్)
2. వడ్డీ రేట్లు పెరుగుతున్న కొద్దీ డాలరు మారకం విలువ కూడా పెరగనుండటం
3. తాత్కాలికంగానైనా గ్రీస్, ఇరాన్, చైనా తదితర దేశాల ఆర్థికాంశాలపై రిస్కు భయాలు తగ్గుతుండటం.
4. అంతా ఊహించినంత స్థాయిలో చైనా బంగారం నిల్వలను భారీ స్థాయిలో పెంచుకోవడం లేదన్న వార్తలు.