వడ్డీరేట్ల పెంపు విషయంలో గతంలో మాదిరి దూకుడుగా వ్యవహరించబోమని అమెరికా ఫెడరల్ రిజర్వ్ చైర్మన్ జెరోమి పావెల్ చేసిన వ్యాఖ్యలు మన స్టాక్ మార్కెట్లలో లాభాల వర్షాన్ని కురిపించాయి. సాధారణంగా డెరివేటివ్స్ సిరీస్ ముగింపు రోజు స్టాక్‌సూచీలు తీవ్రమైన ఒడిదుడుకులకు గురవుతాయి. లేదా పరిమిత శ్రేణిలో కదలాడి నష్టాల్లోనో, ఫ్లాట్‌గానూ ముగుస్తాయి. కానీ ఈ నవంబర్ సిరీస్ దీనికి భిన్నంగా జరిగింది. వడ్డీరేట్ల విషయంలో భారత్ వంటి వర్ధమాన దేశాలకు ఊరటనిచ్చే వ్యాఖ్యలను ఫెడ్ చైర్మన్ పావెల్ చేశారు.
మరోవైపు నవంబర్ సిరీస్ డెరివేటివ్స్ కాంట్రాక్టుల ముగింపు రోజు షార్ట్ కవరింగ్ కొనుగోళ్లు జోరుగా సాగడం కలసివచ్చింది. వీటన్నిటికీ తోడు డాలర్‌తో రూపాయి మారకం ఇంట్రాడేలో 74 పైసలు బలపడి 70కు దిగువన (69.88) రావడం సానుకూల ప్రభావాన్ని చూపించింది. బీఎస్‌ఈ సెన్సెక్స్ 36వేల పాయింట్లు, ఎన్‌ఎస్‌ఈ నిఫ్టీ 10,800 పాయింట్లపైకి ఎగబాకాయి. స్టాక్ సూచీలు వరుసగా నాలుగో రోజూ ముందుకే దూసుకుపోయాయి. సెన్సెక్స్ 453 పాయింట్లు లాభపడి 36,170 పాయింట్ల వద్ద, నిఫ్టీ 130 పాయింట్లు పెరిగి 10,859 పాయింట్ల వద్ద ముగిశాయి. స్టాక్ సూచీలకు ఇది దాదాపు రెండు నెలల గరిష్ట స్థాయి. ఐటీ షేర్లు నష్టపోగా, బ్యాంక్, వాహన, వినియోగ, లోహ, ఫార్మా షేర్లు లాభపడ్డాయి.
ఆరంభమే అదిరింది....
స్టాక్ మార్కెట్ ఆరంభమే అదిరిపోయింది. వడ్డీరేట్ల విషయమై పావెల్ చేసిన సానుకూల వ్యాఖ్యలతో బుధవారం అమెరికా స్టాక్ మార్కెట్లు భారీ లాభాల్లో ముగిశాయి. ఈ జోష్‌తో ఆసియా మార్కెట్లు మంచి లాభాలతో మొదలయ్యాయి. ఈ ప్రభావంతో మన మార్కెట్ కూడా దూకుడుగా ఆరంభమైంది. సెన్సెక్స్ 280 పాయింట్ల లాభంతో శుభారంభం చేయగా. ఎన్‌ఎస్‌ఈ నిఫ్టీ 80 పాయింట్ల లాభంతో 10,800 పాయింట్ల ఎగువన ఆరంభమైంది. రోజు గడుస్తున్న కొద్దీ లాభాలు అంతకంతకూ పెరిగాయి. ఇంట్రాడేలో సెన్సెక్స్ 537 పాయింట్లు, నిఫ్టీ 154 పాయింట్ల వరకూ పెరిగాయి. ముడి చమురు ధరలు తగ్గడం, రూపాయి బలపడటంతో ఈక్విటీ మార్కెట్ జోరుగా పెరిగిందని ఎమ్‌కే వెల్త్ మేనేజ్‌మెంట్ ఎనలిస్ట్ జోసెఫ్ థామస్ చెప్పారు. వడ్డీరేట్ల విషయమై అమెరికా ఫెడరల్ రిజర్వ్ చైర్మన్ జెరోమి పావెల్ చేసిన వ్యాఖ్యలు కొనుగోళ్లకు ఊపునిచ్చాయని పేర్కొన్నారు. ఆసియా మార్కెట్లు మిశ్రమంగా, యూరప్ మార్కెట్లు స్వల్ప లాభాలతో ముగిశాయి.
నవంబర్‌లోనే భారీ లాభాలు...
ఈ ఏడాది మొత్తం మీద ఈ నెలలోనే స్టాక్ మార్కెట్ భారీగా లాభపడింది. నవంబర్ సిరీస్‌లో నిఫ్టీ 7 శాతం ఎగసింది. 10,100 పాయింట్ల నుంచి 10,859 పాయింట్ల వరకూ పెరిగింది.
మార్కెట్ మరింత ముందుకేనా?
రేపు (శనివారం) జరిగే జీ–20 సమావేశంలో అమెరికా–చైనాల మధ్య వాణిజ్య ఉద్రిక్తతలు తగ్గే ఒప్పందం ఏదైనా కుదిరితే మార్కెట్ మరింత ముం దుకు దూసుకుపోతుందని నిపుణులు చెబు తున్నారు. సూచీలు మరో 12– 15 శాతం వరకూ పెరగడానికి అవకాశముందని బీఎన్‌పీ పారిబా ఎనలిస్ట్ హేమాంగ్ జని అంచనా వేశారు. ఎన్నికల కారణంగా ఒకింత ఒడిదుడుకులు చోటు చేసుకోవచ్చని, మార్కెట్ పతనమైనప్పుడల్లా కొనుగోళ్లకు మంచి అవకాశంగా భావించాలని ఆయన సూచించారు.
గత 3–4 రోజుల్లో వాల్యూమ్స్ పెరిగాయని, ఇది ర్యాలీ మరింత కొనసాగడానికి సూచిక అని ఇదే సంస్థకు చెందిన విశ్లేషకులు, గౌరవ్ రత్నపర్కి పేర్కొన్నారు. నిఫ్టీ 11,000–11,140 స్థాయికి పెరగవచ్చని అంచనాలున్నాయన్నారు. మరోవైపు గత నాలుగు రోజుల్లో మార్కెట్ పెరిగినందున లాభాల స్వీకరణ చోటు చేసుకునే అవకాశాలున్నాయని, ఇన్వెస్టర్లు అప్రమత్తంగా ఉండాలని కొందరు నిపుణులు హెచ్చరిస్తున్నారు. కాగా స్టాక్ మార్కెట్లో ఈ జోరు కొనసాగే అవకాశాల్లేవని, ఐదు రాష్ట్రాల ఎన్నికల ఫలితాల కారణంగా మార్కెట్‌లో జోరు ఉండకపోవచ్చని, మార్కెట్ నుంచి బైటకు రావడానికి ఈ ర్యాలీ మంచి అవకాశమని మరికొందరు విశ్లేషకులు చెబుతుండటం గమనార్హం.
► ముడి చమురు ధరలు తగ్గడంతో ప్రభుత్వ రంగ ఆయిల్ మార్కెటింగ్ షేర్లు–బీపీసీఎల్, హెచ్‌పీసీఎల్, ఐఓసీలు 1–3% రేంజ్‌లో పెరిగాయి.
► రానున్న సంవత్సరాల్లో వృద్ధి జోరుగా ఉండగలదన్న అంచనాల కారణంగా హోటల్ షేర్లు ఇంట్రాడేలో 20% వరకూ పెరిగాయి. హోటల్ లీలా, కామత్, తాజ్ జీవీకే, ఓరియంటల్ హోటల్స్ తదితర షేర్లు జాబితాలో ఉన్నాయి.
► మార్కెట్ భారీ లాభాల్లో ఉన్నా కొన్ని బ్లూ చిప్ షేర్లు తాజా ఏడాది కనిష్ట స్థాయిలకు పడిపోయాయి. ఓఎన్‌జీసీ, కోల్ ఇండియా, ఎన్‌టీపీసీ, యస్ బ్యాంక్ వంటి షేర్లు ఇందులో ఉన్నాయి.
నాలుగు రోజుల్లో రూ. 2 లక్షల కోట్లు
గత 4 రోజుల్లో సెన్సెక్స్ మంచి లాభాలు సాధించడంతో ఇన్వెస్టర్ల సంపద భారీగా పెరిగింది. ఇన్వెస్టర్ల సంపదగా పరిగణించే బీఎస్‌ఈలో మొత్తం కంపెనీల మార్కెట్ విలువ రూ.2.03 లక్షల కోట్లు పెరిగి రూ.1,42,49,327 కోట్లకు పెరిగింది. ఒక్క గురువారం రోజే ఇన్వెస్టర్ల సంపద రూ.88,000 కోట్లు ఎగసింది.
లాభాలు ఎందుకంటే...
► ఫెడ్ చైర్మన్ వ్యాఖ్యలతో జోరు....
ఫెడరల్ రిజర్వ్ రేట్లు తటస్థ స్థాయి కంటే దిగువనే ఉన్నాయని ఫెడ్ చైర్మన్ పావెల్ వ్యాఖ్యానించారు. వడ్డీరేట్ల విధానంలో మార్పులు.. ఆర్థిక వృద్ధికి ఊతమిచ్చేలా కానీ, అడ్డుకునేలా కానీ లేవని పేర్కొన్నారు. దీంతో వచ్చే ఏడాది రేట్లను ఫెడరల్ రిజర్వ్ దూకుడుగా పెంచబోదని ఆయన సంకేతాలిచ్చారని నిపుణులు అంటున్నారు. పావెల్ వ్యాఖ్యల కారణంగా డాలర్ పతనం కాగా, బాండ్ల రేట్లు దిగివచ్చాయి. ఫెడ్ రేట్లను పెంచకపోతే, భారత్ వంటి వర్థమాన దేశాల నుంచి విదేశీ పెట్టుబడులు తరలిపోయే అవకాశాలు ఉండవు. విదేశీ పెట్టుబడులు కొనసాగుతాయని, ఇది మార్కెట్లకు మంచి చేస్తుందనే అంచనాలతో కొనుగోళ్లు జోరుగా సాగాయి.
► రూపాయి 70 దిగువకు...
ఎగుమతి దారులు డాలర్లను విక్రయించడం కొనసాగింది. దీనికి ముడి చమురు ధరలు దిగిరావడం తోడయింది. ఫలితంగా రూపా యి మరింత బలపడింది.
► విదేశీ ఇన్వెస్టర్ల కొనుగోళ్లు..
అక్టోబర్‌లో ఈక్విటీలను తెగ విక్రయించిన విదేశీ ఇన్వెస్టర్లు నవంబర్‌లో రూ.9,000 కోట్ల వరకూ కొనుగోలు చేశారు. ఈ వారంలో 4 రోజులూ నికర కొనుగోళ్లు జరిపారు.
► చల్లబడ్డ చమురు ధరలు....
ముడి చమురు నిల్వలు ఏడాది గరిష్ట స్థాయికి చేరడంతో ముడి చమురు ధరలు తగ్గాయి. ఒక పీపా బ్రెంట్ ముడి చమురు ధర 1 శాతం వరకూ తగ్గి 58 డాలర్లకు దిగివచ్చింది.
► సాంకేతిక కారణాలు...
నిఫ్టీ 200 రోజుల చలన సగటు.. 10,774 పాయింట్లపైకి ఎగబాకడంతో సెంటిమెంట్ పాజిటివ్‌గా మారిందని ఎనలిస్ట్‌లు అంటు న్నారు. నిఫ్టీ కీలక 10,850 పాయింట్లపైన ముగియడంతో 11,000 దిశగా కదలనున్నదని, రానున్న నెల రోజుల్లో 11,400 స్థాయికి వెళ్లవచ్చని ఐసీఐసీఐ సెక్యూరిటీస్ అంచనా.
Comments
Please login to add a commentAdd a comment