న్యూఢిల్లీ: ప్రముఖ ఫార్మా కంపెనీ లుపిన్‌కు చెందిన గోవా, మధ్యప్రదేశ్‌లోని పితంపూర్ ప్లాంట్లకు అమెరికా ఎఫ్‌డీఏ హెచ్చరిక లేఖలు జారీ చేసింది. ఈ ఏడాది ఏప్రిల్ 7న గోవా తయారీ కేంద్రం విషయమై అమెరికా మూడు ‘ఫామ్ 483’ అభ్యంతరాలను వ్యక్తం చేసిందని, అలాగే, పితంపూర్ ప్లాంట్‌కు సంబంధించి మే 19న ఆరు అభ్యంతరాలు వ్యక్తం చేయగా వాటికి బదులు ఇచ్చామని లుపిన్ స్పష్టం చేసింది. ఈ నేపథ్యంలో గోవా, పితంపూర్ యూనిట్–2లపై ఈ నెల 6న యూఎస్‌ఎఫ్‌డీఏ హెచ్చరిక లేఖలు జారీ చేసిందని లుపిన్ స్టాక్ ఎక్సేంజ్‌లకు సమాచారమిచ్చింది.
ఎఫ్‌డీఏ లేఖలతో తాము తీవ్రంగా నిరాశ చెందామని పేర్కొంది. అయితే, ఈ యూనిట్ల నుంచి ఉత్పత్తుల సరఫరాకు ఎటువంటి అవాంతరాలు ఉండవని, కాకపోతే కొత్త ఉత్పత్తులకు అనుమతులు ఆలస్యమయ్యే అవకాశం ఉంద ని వివరించింది. ఈ ప్లాంట్లకు సంబం ధించి అమెరికా ఔషధ నియంత్రణ సంస్థ వ్యక్తం చేసిన అభ్యంతరాలను లుపిన్ బయటకు వెల్లడించలేదు.
యూఎస్‌ఎఫ్‌డీఏ ఆందోళనలకు వేగంగా బదులిస్తామని, సత్వర పరిష్కారానికి వీలుగా సహకారం అందిస్తామని పేర్కొంది. నాణ్యత, నిబంధనల అమలులో కచ్చితంగా వ్యవహరిస్తామని, అన్ని కేంద్రాల్లో ఉత్తమ తయారీ, నాణ్యత ప్రమాణాలను కొనసాగించేందుకు కట్టుబడి ఉన్నామని లుపిన్ తన ప్రకటనలో తెలిపింది. పితంపూర్ యూనిట్ ఇండోర్‌కు సమీపంలో ఉంది.
17 శాతం డౌన్: అమెరికా హెచ్చరికలు లుపిన్ షేరును కుదేలు చేశాయి. మధ్యాహ్నం ఒంటి గంట తర్వాత షేరు ఒక్కసారిగా పతనమైంది. అమ్మకాల ఒత్తిడికి రూ.846.20 వరకు పడిపోయింది. ఆ స్థాయి నుంచి కాస్త కోలుకుని చివరికి 17 శాతం నష్టంతో బీఎస్‌ఈలో రూ.860.50 వద్ద క్లోజయింది. ఇది నాలుగేళ్ల కనిష్ట స్థాయి.
Comments
Please login to add a commentAdd a comment