
ఎఫ్‌ఐఐలతో ఆర్థిక శాఖ సమావేశం రేపు
న్యూఢిల్లీ: ఆర్థిక శాఖ అధికారులు విదేశీ సంస్థాగత ఇన్వెస్టర్ల(ఎఫ్‌ఐఐలు)తో మంగళవారం సమావేశాన్ని నిర్వహించనున్నారు. దేశంలో మరిన్ని పెట్టుబడులు పెట్టేందుకు ప్రోత్సహించడంతోపాటు, శాశ్వత కార్యకలాపాలు చేపట్టేందుకు వీలుగా సమావేశంలో చర్చలు నిర్వహించనున్నట్లు తెలుస్తోంది. దీనిలో భాగంగా ఎఫ్‌ఐఐలు ఎదుర్కొంటున్న సమస్యలపై దృష్టిపెట్టనున్నారు. అంతేకాకుండా అడ్డంకులను తొలగించడంపై చర్చించనున్నట్లు సంబంధిత వర్గాలు తెలిపాయి. కాగా, దేశీయంగా శాశ్వత స్థాయిలో కార్యకలాపాల నిర్వహణకు అడ్డుపడుతున్న పన్ను సంబంధిత విషయాలపై చర్చలకు ఎఫ్‌ఐఐలు ఆసక్తిగా ఉన్నట్లు నిపుణులు పేర్కొన్నారు.
బ్యాంక్ చీఫ్‌లతోనూ...: బ్యాంక్‌లు, బీమా సంస్థలు, తదితర ఫైనాన్షియల్ సంస్థల చీఫ్‌లతో మంగళవారం(10న) ఆర్థిక మంత్రి అరుణ్ జైట్లీ బడ్జెట్‌కు ముందు సమావేశాన్ని నిర్వహించనున్నారు. సీఎండీ, సీఈవో స్థాయి అధికారులతో జైట్లీ సమావేంకానున్నారు. ఈ ప్రీబడ్జెట్ సమావేశంలో ఆర్థిక మంత్రికి బ్యాంకర్లు, బీమా సంస్థల అధిపతులనుంచి పలుసూచనలు, అభ్యర్థనలు అందనున్నాయి. పెరిగిపోతున్న మొండి బకాయిల అంశానికి సంబంధించి బ్యాంకర్లు పలురకాల సూచనలు చేసే అవకాశముంది.