దీర్ఘకాలిక మూలధన లాభాల పన్నుపై స్పష్టత
♦ ప్రమోటర్లకు ఊరట
♦ అసలైన లావాదేవీలకు పన్ను మినహాయింపు
న్యూఢిల్లీ: దీర్ఘకాలిక మూలధన లాభాల పన్ను విషయంలో ప్రమోటర్లకు, ఉద్యోగులకు ఊరట కల్పిస్తూ కేంద్ర ఆర్థిక శాఖ మంగళవారం నోటిఫికేషన్ జారీ చేసింది. సెక్యూరిటీ లావాదేవీల పన్ను చెల్లించకుండా జరిగే లావాదేవీలపై పన్ను విషయంలో ఉన్న అనిశ్చితికి ముగింపు పలికింది. కంపెనీల్లో విదేశీ ప్రత్యక్ష పెట్టుబడులు, ఉద్యోగులకు ఇచ్చే స్టాక్ ఆప్షన్లు, మార్కెట్ వెలుపల జరిగే లావాదేవీలు... వీటికి ఆర్‌బీఐ, సెబీ, హైకోర్టు లేదా సుప్రీంకోర్టు, జాతీయ కంపెనీ లా ట్రిబ్యునల్ ఆమోదం ఉంటే మూలధన లాభాల పన్ను ఉండదని ఈ నోటిఫికేషన్ స్పష్టం చేసింది.
2004 అక్టోబర్ 1 తర్వాత కొనుగోలు చేసిన షేర్లపై సెక్యూరిటీ లావాదేవీల పన్ను చెల్లించి ఉంటేనే పన్ను మినహాయింపు వర్తిస్తుందని బడ్జెట్లో పేర్కొనగా... ఎంప్లాయీ స్టాక్ ఆప్షన్లు, ఎఫ్‌డీఐలకు ఇది వర్తించదని తాజా నోటిఫికేషన్‌లో స్పష్టతనిచ్చారు. ఐపీవోలు, లిస్టెడ్ కంపెనీ జారీచేసే బోనస్‌లు, రైట్స్ ఇష్యూలు, మెర్జర్, డీమెర్జర్ లావాదేవీలు, ఎఫ్‌డీఐ నిబంధనల కింద ఎన్‌ఆర్‌ఐలు చేసే పెట్టుబడులకూ దీర్ఘకాలిక మూలధన లాభాల పన్ను నుంచి మినహాయింపు కల్పించారు.