పన్ను సమస్యలను పరిష్కరిస్తాం | Finance Minister brainstorms with foreign portfolio investors | Sakshi
Sakshi News home page

పన్ను సమస్యలను పరిష్కరిస్తాం

Published Wed, Oct 21 2015 2:33 AM | Last Updated on Thu, Jul 11 2019 8:48 PM

పన్ను సమస్యలను పరిష్కరిస్తాం - Sakshi

పన్ను సమస్యలను పరిష్కరిస్తాం

విదేశీ ఇన్వెస్టర్లకు ఆర్థిక శాఖ హమీ
* దిగ్గజ సంస్థల ప్రతినిధులతో భేటీ
న్యూఢిల్లీ: విదేశీ పోర్ట్‌ఫోలియో ఇన్వెస్టర్ల(ఎఫ్‌పీఐ) పన్ను సంబంధిత ఆందోళనలన్నింటినీ వీలైనంతం వేగంగా పరిష్కరిస్తామని కేంద్రం హామీనిచ్చింది. అయితే, దేశంలో శాశ్వత కార్యకలాపాలను ఏర్పాటు చేయాల్సిందిగా వారిని కోరుతున్నట్లు కూడా పేర్కొంది. వచ్చే ఆర్థిక సంవత్సరం(2016-17) బడ్జెట్ కసరత్తులో భాగంగా మంగళవారం ఆర్థిక శాఖ ఉన్నతాధికారులు దిగ్గజ ఎఫ్‌పీఐలతో భేటీ అయ్యారు. సిటీ బ్యాంక్, డాయిష్ బ్యాంక్, ఫిడిలిటీ, గోల్డ్‌మన్ శాక్స్, బ్లాక్‌రాక్ సహా రెండు డజన్లకుపైగా అంతర్జాతీయ ఇన్వెస్ట్‌మెంట్ సంస్థల ప్రతినిధులు ఈ సమావేశంలో పాల్గొన్నారు.

‘ఈ భేటీలో ఎఫ్‌పీఐలు అనేక సూచనలు, సలహాలను ఇచ్చారు. ప్రభుత్వం వీటిని పరిశీలించి తగిన నిర్ణయం తీసుకుంటుంది. ఇక పన్ను సంబంధ సమస్యలు సహజంగా ఉత్పన్నమైనవే. దేశంలో ఫండ్ మేనేజ్‌మెంట్ పరిశ్రమ స్థితిగతులపై కూడా మేం చర్చించాం’ అని ఆర్థిక వ్యవహరాల కార్యదర్శి శక్తికాంత దాస్ పేర్కొన్నారు. ఆర్‌బీఐ, సెబీ, సీబీడీటీలకు చెందిన ఉన్నతాధికారులకు కూడా ఈ సమావేశానికి హజరయ్యారు.

ప్రస్తుతం ఎఫ్‌పీఐలు భారత్‌తో ద్వంద్వ పన్ను నిరోధక ఒప్పందం(డీటీఏఏ) ఉన్న దేశాల నుంచి తమ నిధులను ఇక్కడికి తరలిస్తున్నారని.. దీనివల్ల వారికి స్వల్పకాలిక మూలధన లాభాల పన్ను నుంచి మినహాయింపు లభిస్తున్నట్లు దాస్ చెప్పారు. అయితే, ఆయా సంస్థలు భారత్‌లోనే తమ కార్యకాలాపాలను నెలకొల్పినట్లయితే ఇక్కడి చట్టాల ప్రకారం క్యాపిటల్ గెయిన్స్ ట్యాక్స్ చెల్లించాల్సి వస్తుందన్నారు. కార్పొరేట్ బాండ్‌లపై 5 శాతం విత్‌హోల్డింగ్ పన్ను అంశాన్ని ఈ సమావేశంలో చర్చించినట్లు నోమురా ఫిక్స్‌డ్ ఇన్‌కమ్ సెక్యూరిటీస్ ఎండీ నీరజ్ గంభీర్ చెప్పారు. 2017తో ఈ 5 శాతం పన్ను విధింపునకు గడువు ముగియనుంది.
 
ఈ ఏడాది వృద్ధి 7.5 శాతం పైనే...
* ఎస్‌అండ్‌పీ అంచనాలతో విబేధం
భారత్ ఆర్థిక వ్యవస్థ వృద్ధిపై అంతర్జాతీయ రేటింగ్ ఏజెన్సీ స్టాండర్డ్ అండ్ పూర్స్(ఎస్‌అండ్‌పీ) వెలిబుచ్చిన అనుమానాలను శక్తికాంత దాస్ తోసిపుచ్చారు. అది కేవలం ఆ సంస్థ అభిప్రాయం మాత్రమేనని.. ఈ ఆర్థిక సంవత్సరంలో భారత్ వృద్ధి రేటు 7.5 శాతంపైనే ఉంటుందని తాము అంచనావేస్తున్నట్లు ఆయన పేర్కొన్నారు. వృద్ధి జోరందుకోవాడానికి ప్రభుత్వం మరిన్ని సంస్కరణ చర్యలను చేపట్టనున్నట్లు కూడా దాస్ వెల్లడించారు.

భారత్ ఆర్థిక మూలాలు అత్యంత పటిష్టంగా ఉన్నాయన్నారు. కాగా, భారత్ సార్వభౌమ రేటింగ్‌ను ఇప్పుడున్న బీబీబీ(మైనస్) స్థాయిలోనే కొనసాగిస్తున్నట్లు ఎస్‌అండ్‌పీ తాజా నివేదికలో పేర్కొంది. ప్రస్తుత, వచ్చే ఆర్థిక సంవత్సరంలో కూడా రేటింగ్ పెంచే అవకాశాల్లేవని స్పష్టం చేసింది. పెట్టుబడులకు సంబంధించి ఇదే అత్యల్ప స్థాయి రేటింగ్. కాగా, విధాన, సంస్కరణల పరంగా తాము ఇప్పటికే అనేక చర్యలు తీసుకున్నామని... రేటింగ్ అప్‌గ్రేడ్ చేయాలంటూ ఆర్థిక శాఖ చాన్నాళ్లుగా కోరుతున్న సంగతి తెలిసిందే.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement