ఫైనాన్షియల్‌ బేసిక్స్‌ | Financial Basics | Sakshi
Sakshi News home page

ఫైనాన్షియల్‌ బేసిక్స్‌

Published Mon, Jan 30 2017 12:37 AM | Last Updated on Tue, Sep 5 2017 2:25 AM

ఫైనాన్షియల్‌ బేసిక్స్‌

ఫైనాన్షియల్‌ బేసిక్స్‌

► భారీగా ఓవర్‌ సబ్‌స్క్రైబ్‌ అయితే కేటాయింపు కష్టం
► కనీస లాట్‌ మేరకే కేటాయింపులుంటాయి
►  అది కూడా దాటితే లాటరీ పద్ధతిలోనే


ఐపీఓలో ఇలాగైతే షేర్లు దక్కవు!!  
ఇపుడు దాదాపు అన్ని ఐపీవోలకు చక్కని స్పందన వస్తోంది. ఎన్నో రెట్లు ఓవర్‌ సబ్‌స్రై్కబ్‌ అవుతున్నాయి. ఆఫర్‌ చేస్తున్న షేర్ల సంఖ్యకు తగినట్టు దరఖాస్తులు వస్తే ఏ సమస్యా లేదు. కానీ, అధిక స్పందన వస్తే షేర్ల కేటాయింపు ఎలా చేస్తారు...? ఎవరికి కేటాయిస్తారు..? దరఖాస్తు చేసుకున్న వారిలో ఎవరికి షేర్లు దక్కుతాయి, ఇందుకు అనుసరించే విధానాలు ఏంటి..?  ఒకసారి చూద్దాం...

బోంబే స్టాక్‌ ఎక్సే్ఛంజీ (బీఎస్‌ఈ) ఐపీవో 51 రెట్లు అధికంగా సబ్‌స్రై్కబ్‌ అయింది. ఆ మధ్య వచ్చిన క్వెస్‌ కార్ప్‌ ఐపీవోకు ఆఫర్‌ చేస్తున్న షేర్ల కంటే ఏకంగా 147 రెట్లు అధికంగా స్పందనొచ్చింది. ఇన్నేసి రెట్లు ఓవర్‌ సబ్‌స్రైబ్‌ అయితే షేర్లు దక్కే అవకాశాలు తక్కువేనని అనుకోవాలి. ఎందుకంటే ఐపీవోకు సంబంధించి ఇన్వెస్టర్లను పలు కేటగిరీలుగా విభజించి, వారి కంటూ నిర్ణీత వాటా ప్రకారం షేర్లను కేటాయిస్తుంటారు. రిటైల్‌ ఇన్వెస్టర్లు, క్వాలిఫైడ్‌ ఇనిస్టిట్యూషనల్‌ ఇన్వెస్టర్లు, నాన్ ఇనిస్టిట్యూషనల్‌ ఇన్వెస్టర్లు వంటి కేటగిరీలున్నాయి. ఉద్యోగుల కోటా కూడా ప్రత్యేకంగా ఉంది. ఇటీవలి బీఎస్‌ఈ ఐపీవోనే చూసుకుంటే... రిటైల్‌ ఇన్వెస్టర్ల విభాగం నుంచి 6.18 రెట్లు అధికంగా చందాలొచ్చాయి. క్వాలిఫైడ్‌ ఇనిస్టిట్యూషనల్‌ ఇన్వెస్టర్ల విభాగంలో 48.64 రెట్లు, నాన్  ఇనిస్టిట్యూషనల్‌ ఇన్వెస్టర్ల కేటగిరీలో 77.22 అధికంగా బిడ్లు వచ్చాయి.

ఇలాంటప్పుడు కేటాయింపు ఎలా...?
అధిక స్పందన వచ్చినప్పుడు సెబీ నిబంధనల ప్రకారం షేర్ల కేటాయింపు జరుగుతుంది. ఐపీవోలో కనీస దరఖాస్తు రుసుం రూ.10,000 నుంచి రూ.15,000 మధ్య ఉండాలన్నది సెబీ నిబంధన. అంటే ఈ విలువ మేర షేర్ల కేటాయింపు ఉండాలి. మొత్తం షేర్ల సంఖ్యకు అనుగుణంగా షేర్ల లాట్‌ సైజ్‌ ను నిర్ణయించాలి. రిటైల్‌ ఇన్వెస్టర్లు కనీసం ఒక లాట్‌కు సరిపడా దరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుంది. గరిష్ట పెట్టుబడి పరిమితి మేరకు ఎన్ని లాట్ల వరకు అయినా దరఖాస్తు చేసుకోవచ్చు.

రిటైల్‌ ఇన్వెస్టర్ల విభాగంలో ఎక్కువ స్పందన వచ్చినపుడు అందుబాటులో ఉన్న మొత్తం షేర్ల సంఖ్యను కనీస లాట్‌ సైజ్‌తో డివైడ్‌ చేస్తే... ఎంత మంది దరఖాస్తు దారులకి షేర్లు వచ్చేదీ తెలుస్తుంది. వచ్చిన మొత్తం దరఖాస్తులకు సమానంగా ఉంటే అప్పుడు ఒక్కో ఇన్వెస్టర్‌ గరిష్టంగా ఎన్ని షేర్లకు దరఖాస్తు చేసినప్పటికీ, కనీసం ఒక లాట్‌ మేరకే షేర్లు కేటాయిస్తారు. ఒకవేళ ఈ స్థాయి కంటే అధికంగా దరఖాస్తులు వస్తే, అప్పుడు లాటరీ విధానాన్ని అనుసరిస్తారు. కనుక భారీ స్పందన వచ్చిన ఇష్యూల్లో షేర్లు లభించే అవకాశం తక్కువగా ఉంటుందని అర్థం చేసుకోవాలి.

 తో ఉపయోగం
రిటైల్‌ ఇన్వెస్టర్లు తమ బ్యాంకు ఖాతాల నుంచే ‘అప్లికేషన్  సపోర్టెడ్‌ బై బ్లాక్డ్‌ అమౌంట్‌ (ఏఎస్‌బీఏ)’ విధానం ద్వారా ఐపీవోకు దరఖాస్తు చేసుకునే విధానం ఉంది. ఈ విధానంలో డీపీఐడీ, క్లయింట్‌ ఐడీ ఇచ్చి ఐపీవోకు దరఖాస్తు చేసుకోవచ్చు. బ్యాంకు మీ తరఫున ఐపీవోకు దరఖాస్తు పంపి, షేర్ల కేటాయింపు వరకు బిడ్‌కు సరిపడా నగదును బ్లాక్‌ చేసి ఉంచుతుంది. షేర్ల కేటాయింపు జరిగితే ఆ మేరకు నగదు ఖాతాలోంచి బదిలీ అవుతుంది. కేటాయింపు లేకుంటే ఆ మొత్తాన్ని రిలీజ్‌ చేసి ఖాతాదారుడికి అందుబాటులోకి తెస్తుంది. పైగా బ్లాక్‌ చేసి ఉంచినన్ని రోజులూ ఆ మొత్తంపై వడ్డీ కూడా చెల్లిస్తుంది. దీని వల్ల అనవసర వ్యయాలు తగ్గుతాయి. 

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement