శాన్‌ఫ్నాన్సిస్కో: గూగుల్ పై మాజీ ఉద్యోగులు సంచలన ఆరోపణలతో దావా వేశారు. గూగుల్ విధానాల్ని ప్రశ్నించినందుకే తమ పై వేటు వేశారని ఆరోపిస్తూ ఉద్వాసనకు గురైన ఇద్దరు గూగుల్ ఇంజనీర్లు పిటిషన్ దాఖలు చేశారు. శాంటా క్లారా కౌంటీ సుపీరియర్ కోర్ట్‌లో దాదాపు 161 పేజీల ఫిర్యాదును నమోదు చేశారు. గూగుల్ నిబద్ధతను ప్రశ్నించడం వల్లే తమని తొలగించారన్నారు.
కార్పోరేట్ కల్చర్, తెల్లవారిపై వివక్ష కారణంగా తమను తొలగించారని వారు విమర్శించారు. అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ మద్దతు దారులతో పాటు కన్సర్వేటివ్ దృక్పథం ఉన్న వారి పట్ల వివక్షా పూరితంగా వ్యవహరిస్తోందని జేమ్స్ దామోర్ (28), మరో మాజీ గూగుల్ ఇంజనీర్ మండిపడ్డారు. ఉన్నతమైన సంస్థగా వ్యవహరిస్తున్న గూగుల్ ఉదారవాద ఎజెండా నుంచి వైదొలగాలని ధైర్యం చేస్తున్న అనేక మంది ఉద్యోగులపై వేటు వేస్తోందని ఆరోపించారు.
గూగుల్ సహా ఇతర ప్రముఖ టెక్నాలజీ కంపెనీల్లో కన్సర్వేటివ్ అభిప్రాయాలను వ్యక్తం చేస్తే లేదా బహిరంగంగా ట్రంప్‌కు మద్దతు ఇస్తున్న డజన్ల కొద్దీ ఉద్యోగులపై వేటుపడుతోందనీ, దీంతో మిగిలిన ఉద్యోగులు కూడా భయపడుతున్నారని దామెర్ లాయర్ రిపబ్లికన్ పార్టీ అధికారి హర్మీత్ డల్లాన్ వ్యాఖ్యానించారు. గూగుల్ ఉద్యోగం పొందడానికి అధ్యక్షుడికి ఓటు వేయలేదని రుజువు చేసుకోవాల్సిన అవసరం లేదని పేర్కొన్నారు.
మరోవైపు దామోర్ ఆరోపణలపై తమవాదనలను కోర్టులో వినిపిస్తామని గూగుల్ చెప్పింది. అయితే అతని రాజకీయ అభిప్రాయాల నేపథ్యంలో తొలగించలేదని వెల్లడించింది. సంస్థ ప్రవర్తనా నియమావళిని ఉల్లంఘించినందుకే చర్య తీసుకున్నామని గూగుల్ తెలిపింది. ఏ విధమైన వేధింపులను తాము సహించమని పేర్కొంది. కాగా సిలికాన్ వ్యాలీ టెక్ నియామాకాల్లో లింగ వివక్ష ఉందన్న వాదనను సమర్ధిస్తూ ఒక లేఖ రాయడం కలకలం రేపింది. గత ఏడాది ఆగస్టు 7 న గూగుల్ అతణ్ని తొలగించింది.
Comments
Please login to add a commentAdd a comment