న్యూఢిల్లీ: ప్రస్తుత ఆర్థిక సంవత్సరానికి ద్రవ్యలోటును లక్ష్యానికి పరిమితం చేసే విషయమై సందేహాలు వ్యక్తమవుతున్నాయి. పూర్తి ఆర్థిక సంవత్సరానికి ద్రవ్యలోటును 6.24 లక్షల కోట్లుగా (జీడీపీలో 3.3 శాతం) కేంద్ర ప్రభుత్వం లక్ష్యాన్ని విధించుకుంది. కానీ, తొమ్మిది నెలలకే, ఏప్రిల్ నుంచి డిసెంబర్ నాటికి జీడీపీలో ద్రవ్యలోటు 112.4 శాతానికి రూ.7.01 లక్షల కోట్లకు చేరుకుంది. ప్రభుత్వ ఖర్చులు, ఆదాయం మధ్య లోటునే ద్రవ్యలోటుగా పేర్కొంటారు. నిజానికి అంతక్రితం ఆర్థిక సంవత్సరంలోనూ మొదటి తొమ్మిది నెలల్లో ద్రవ్యలోటు 113.6 శాతంగా ఉండడం గమనార్హం. 2017–18 ఆర్థిక సంవత్సరంలో ద్రవ్యలోటు జీడీపీలో 3.53 శాతంగా ఉంది.
దీన్ని 2018–19లో 3.3 శాతానికి కట్టడి చేయాలని కేంద్రం నిర్ణయించగా, తాజాగా దీన్ని 3.4 శాతానికి (రూ.6.34 లక్షల కోట్లు) సవరిస్తున్నట్టు మధ్యంతర బడ్జెట్‌లో కేంద్ర ఆర్థిక మంత్రి పేర్కొన్నారు. పలు వర్గాలకు ప్రకటించిన ఆర్థిక ప్రోత్సాహకాల రూపంలో అదనంగా రూ.20,000 కోట్ల మేర భారం పడనుందని తెలిపారు. ప్రస్తుత ఆర్థిక సంవత్సరానికి రూ.17.25 లక్షల కోట్ల ఆదాయాన్ని తొలుత అంచనా వేయగా, దీన్ని రూ.17.29 లక్షల కోట్లకు సవరిస్తున్నట్టు మధ్యంతర బడ్జెట్ పేర్కొంది. అలాగే సవరించిన అంచనాల మేరకు ప్రభుత్వ వ్యయాలు రూ.24.42 లక్షల కోట్ల నుంచి రూ.24.57 లక్షల కోట్లకు పెరిగాయి.
Comments
Please login to add a commentAdd a comment