భారత్ రేటింగ్ యథాతథం: ఫిచ్
అధిక వృద్ధి కొనసాగుతుంది..
న్యూఢిల్లీ: అమెరికాలో వడ్డీ రేట్ల పెరుగుదల, డాలర్ బలపడటం, కమోడిటీల రేట్లు తగ్గడం తదితర పరిణామాలతో ఆసియా పసిఫిక్ ప్రాంత దేశాల వృద్ధి ఒక మోస్తరుగానే ఉన్నా.. భారత్ మాత్రం అధిక వృద్ధి సాధించడం కొనసాగుతుందని రేటింగ్ ఏజెన్సీ ఫిచ్ తెలిపింది. ఈ నేపథ్యంలో భారత్‌కి ప్రస్తుతం స్థిరమైన అవుట్‌లుక్‌తో ఇచ్చిన బీబీబీ మైనస్ రేటింగ్‌ను యథాతథంగా కొనసాగిస్తున్నట్లు వివరించింది. ఇది పెట్టుబడులకు అత్యంత కనిష్ట స్థాయిని సూచిస్తుంది.
‘వర్ధమాన ఆసియా దేశాల అంచనాలు 2016’ నివేదికలో ఫిచ్ ఈ విషయాలు పేర్కొంది. అయితే, ప్రభుత్వ ఖజానాపరమైన బలహీనతల కారణంగా భారత్‌కు మరింత సానుకూల రేటింగ్స్ ఇవ్వలేకపోతున్నామని వివరించింది. చైనాలో మందగమన ప్రభావంతో వచ్చే ఏడాది వర్ధమాన ఆసియా వృద్ధి 6.5% నుంచి 6.3%కి తగ్గవచ్చని ఫిచ్ అంచనా వేసింది. ఇక, అమెరికాలో వడ్డీ రేట్ల పెరుగుదల, అంతర్జాతీయంగా వాణిజ్య మందగమనం తదితర అంశాలు 2016లో వర్ధమాన ఆసియా దేశాలకు సవాలుగా నిల్చే అవకాశం ఉందని పేర్కొంది.