మైదానంలో శ్రమించిన భారత క్రికెటర్లు
తొలి రోజు ఫిట్‌నెస్‌పై దృష్టి
న్యూయార్క్: టి20 ప్రపంచకప్ వేటలో అమెరికా గడ్డపై అడుగు పెట్టిన భారత క్రికెట్ బృందం మొదటి రోజు ఫిట్‌నెస్‌పై ప్రత్యేక శ్రద్ధ పెట్టింది. స్టార్ బ్యాటర్ విరాట్ కోహ్లి మినహా మిగతా ఆటగాళ్లంతా ఇందులో పాల్గొన్నారు. కోహ్లి ఇంకా న్యూయార్క్ చేరుకోలేదు. టీమిండియా స్ట్రెంత్ అండ్ కండిషనింగ్ కోచ్ సోహమ్ దేశాయ్ ఈ ట్రయినింగ్ సెషన్‌ను పర్యవేక్షించారు. ముఖ్యంగా భారత్‌తో పోలిస్తే పూర్తిగా భిన్నమైన యూఎస్ వాతావరణానికి అలవాటు పడటంపై ఆటగాళ్లు దృష్టి సారించారు.
ఐపీఎల్ కారణంగా మన క్రికెటర్లంతా 90 శాతంకి పైగా డే అండ్ నైట్ మ్యాచ్‌లే ఆడారు. కానీ వరల్డ్ కప్ లీగ్ దశలో అమెరికా వేదికపై జట్టు 25–27 డిగ్రీల వాతావరణంలో అన్నీ డే మ్యాచ్‌లే (ఉదయం గం. 10:30 నుంచి) ఆడబోతోంది. ట్రయినింగ్ సెషన్‌లో క్రికెటర్లు స్వల్ప జాగింగ్, రన్నింగ్‌తో పాటు కొద్దిసేపు ఫుట్‌బాల్ ఆడారు.
‘టైమ్ జోన్‌కు అలవాటు పడటం అన్నింటికంటే ముఖ్యం. జట్టు సభ్యులంతా కూడా దాదాపు రెండున్నర నెలల తర్వాత మళ్లీ ఒక్క చోటికి చేరారు. వారి ఫిట్‌నెస్ స్థితి ఏమిటో తెలుసుకోవాల్సిన అవసరం ఉంది. దానిని బట్టి మున్ముందు రోజుల కోసం ప్రణాళికలు రూపొందిస్తాను’ అని దేశాయ్ చెప్పారు. వాతావరణం చాలా బాగుందని హార్దిక్ పాండ్యా అభిప్రాయపడగా... న్యూయార్క్‌లో తొలిసారి ఆడనుండటం పట్ల రవీంద్ర జడేజా ఉత్సాహంగా ఉన్నాడు.
నగర శివార్లలోని నాసా కౌంటీ స్టేడియంలో జూన్ 1న బంగ్లాదేశ్‌తో భారత్ ప్రాక్టీస్ మ్యాచ్ ఆడుతుంది. ఈ మ్యాచ్ వరకైనా కోహ్లి జట్టుతో చేరతాడా లేదా అనే విషయంలో బీసీసీఐ స్పష్టతనివ్వలేదు. జూన్ 5న అసలు పోరులో ఐర్లాండ్‌తో భారత్ ఆడుతుంది.
‘నంబర్‌వన్’ ర్యాంక్‌తో ప్రపంచకప్‌లోకి...
టి20 ప్రపంచకప్ టోర్నీలో టీమిండియా నంబర్‌వన్ ర్యాంకర్‌గా బరిలోకి దిగనుంది. బుధవారం విడుదల చేసిన అంతర్జాతీయ క్రికెట్ కౌన్సిల్ టి20 ర్యాంకింగ్స్‌లో భారత్ 264 రేటింగ్ పాయింట్లతో తమ టాప్ ర్యాంక్‌ను నిలబెట్టుకుంది.
రెండుసార్లు టి20 వరల్డ్ చాంపియన్ వెస్టిండీస్ రెండు స్థానాలు ఎగబాకి నాలుగో ర్యాంక్‌కు చేరుకుంది. దక్షిణాఫ్రికాతో స్వదేశంలో జరిగిన మూడు మ్యాచ్‌ల టి20 సిరీస్‌ను వెస్టిండీస్ 3–0తో క్లీన్‌స్వీప్ చేయడంతో ఆ జట్టు ర్యాంక్ మెరుగైంది. దక్షిణాఫ్రికా నాలుగు స్థానాలు పడిపోయి ఏడో ర్యాంక్‌లో నిలిచింది.
Comments
Please login to add a commentAdd a comment