అమెరికాతో నేడు రోహిత్ బృందం ‘ఢీ’
రెండు విజయాలతో జోరు మీదున్న ఆతిథ్య జట్టు
పటిష్టమైన బలగంతో టీమిండియా
రాత్రి 8 గంటల నుంచి స్టార్ స్పోర్ట్స్, హాట్‌స్టార్‌లో ప్రత్యక్ష ప్రసారం
న్యూయార్క్: ‘హ్యాట్రిక్’ విజయంపై గురి పెట్టిన భారత్ దీంతో పాటే టి20 ప్రపంచకప్‌లో ‘సూపర్–8’ దశకు దర్జాగా చేరుకోవాలనుకుంటుంది. గ్రూప్ ‘ఎ’లో బుధవారం జరిగే మ్యాచ్‌లో టీమిండియా... ఆతిథ్య అమెరికాతో తలపడుతుంది. ఈ గ్రూప్‌లో ఇరు జట్లు కూడా ఆడిన రెండు మ్యాచ్‌ల్లోనూ నెగ్గి అజేయంగా ఉన్నాయి.
రోహిత్ బృందం వరుస విజయాలు సాధించడంలో పెద్ద విశేషమైతే లేదు కానీ... అమెరికాలాంటి కూన ఓ మాజీ చాంపియన్ పాకిస్తాన్‌ను అదికూడా... ‘సూపర్ ఓవర్’ దాకా లాక్కొచ్చి మరీ ఓడించడమే పెద్ద సంచలనం.
ఎప్పుడైనాగానీ సూపర్ ఓవర్ అనేది మేటి జట్టుకే ఎక్కువ సానుకూలంగా ఉంటుంది. అలాగని భారత్‌పై కూడా మరో సంచలనం కొనసాగిస్తుందని చెప్పలేం. కానీ ఈ మ్యాచ్‌లో ఎవరు గెలిచినా వారికి ‘హ్యాట్రిక్’ విజయంతో పాటు ‘సూపర్–8’ బెర్త్ కూడా దక్కుతుంది.
సూపర్ ఫామ్‌లో...
బంగ్లాదేశ్‌తో మొదలుపెట్టిన ప్రాక్టీస్ మొదలు చిరకాల ప్రత్యర్థి పాకిస్తాన్‌తో జరిగిన మ్యాచ్ దాకా భారత్ విజయవంతమైంది. ఐర్లాండ్‌తో జరిగిన తొలి లీగ్‌లో ప్రత్యర్థి తక్కువ లక్ష్యం నిర్దేశించడంతో కెపె్టన్ రోహిత్, రిషభ్ పంత్‌ల జోరుతో సులువుగానే ఛేదించారు. అయితే తొలి రెండు మ్యాచ్‌ల్లో ‘కింగ్’ కోహ్లి, టి20 స్పెషలిస్టు సూర్యకుమార్ యాదవ్ ఏమాత్రం మెరిపించలేకపోయారు.
గత రెండు మ్యాచ్‌లకు బాకీ పడిన పరుగుల వానను బహుశా ఈ మ్యాచ్‌లో వడ్డీతో సహా తీర్చేస్తారేమోనని అమెరికాలోని భారత అభిమానులంతా ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. బుమ్రా, సిరాజ్, అర్‡్షదీప్‌లతో కూడిన పేస్ త్రయానికి, రవీంద్ర జడేజా, అక్షర్ పటేల్‌ల స్పిన్ ద్వయానికి అమెరికా ఎదురునిలవడం అంత సులువు కాదు.
సర్వశక్తులతో...
ఆడుతోంది తొలి వరల్డ్‌కప్పే అయినా అమెరికా ఆట మాత్రం అద్భుతం. కెనడా, పాక్‌లపై సాధించిన విజయాలు ఏమాత్రం గాలివాటం కాదు. మొదట కెనడాపై 195 పరుగుల భారీ లక్ష్యాన్ని ఛేదించి మరీ గెలిచింది. ఆండ్రీస్ గౌస్, ఆరోన్ జోన్స్ భారీ షాట్లతో విరుచుకుపడ్డారు. మళ్లీ పాక్‌తో రెండో మ్యాచ్‌లో కెప్టెన్ మోనంక్ పటేల్ అర్ధసెంచరీతో ఆకట్టుకుంటే గౌస్, జోన్స్ ‘టై’ అయ్యేదాకా పటిష్టమైన పాక్ బౌలింగ్‌ను ఎదుర్కొన్నారు.
ఇటు బౌలింగ్‌లోనూ కెంజిగే, సౌరభ్ నేత్రవాల్కర్, అలీఖాన్, జస్‌దీప్‌లు ఫామ్‌లో ఉండటంతో భారత్‌పై పైచేయి సాధించలేకపోయినా... ఆల్‌రౌండ్ వనరులతో గట్టి పోటీ ఇవ్వాలనే పట్టుదలతో అమెరికా బృందం ఉంది.
పిచ్, వాతావరణం
న్యూయార్క్ పిచ్‌లో ఏ మార్పు లేదు. తక్కువ స్కోర్లే తప్ప మెరుపులకు అంతగా అవకాశమైతే ఉండదు. చేజింగ్ కష్టం కావడంతో టాస్ గెలిచిన జట్టు బ్యాటింగ్‌కే మొగ్గు చూపడం ఖాయం. వర్షంతో పూర్తిగా ముప్పయితే లేకపోయినా... అంతరాయం తప్పదు.
జట్లు (అంచనా)
భారత్: రోహిత్ శర్మ (కెప్టెన్ ), కోహ్లి, పంత్, సూర్యకుమార్, శివమ్ దూబే, హార్దిక్, జడేజా, అక్షర్, బుమ్రా, సిరాజ్, అర్‡్షదీప్.
అమెరికా: మోనంక్ పటేల్ (కెప్టెన్ ), స్టీవెన్ టేలర్, ఆండ్రీస్ గౌస్, ఆరోన్ జోన్స్, నితీశ్ కుమార్, కోరె అండర్సన్, హర్మీత్
సింగ్, జస్‌దీప్ సింగ్, కెంజిగె, సౌరభ్, అలీఖాన్.
10 అమెరికాలో భారత జట్టు ఆడిన మొత్తం టి20 మ్యాచ్‌లు. ఇందులో ఎనిమిది మ్యాచ్‌లు ఫ్లోరిడా రాష్ట్రంలోని లాడర్‌హిల్ పట్టణంలో వెస్టిండీస్‌తో జరిగాయి. ఆ ఎనిమిది మ్యాచ్‌ల్లో ఐదింటిలో భారత్ గెలిచి, రెండింటిలో ఓడిపోయింది. మరో మ్యాచ్ రద్దయింది. ప్రస్తుత ప్రపంచకప్‌లో న్యూయార్క్ వేదికగా ఐర్లాండ్‌తో, పాకిస్తాన్‌తో భారత్ ఒక్కో మ్యాచ్ విజయం సాధించింది.
టి20 ప్రపంచకప్‌లో నేడు
శ్రీలంక X నేపాల్
వేదిక: ఫ్లోరిడా; ఉదయం గం. 5 నుంచి
ఆ్రస్టేలియా X నమీబియా
వేదిక: నార్త్ సౌండ్; ఉదయం గం. 6 నుంచి
భారత్ X అమెరికా
వేదిక: న్యూయార్క్; రాత్రి గం. 8 నుంచిస్టార్ స్పోర్ట్స్, హాట్ స్టార్‌లో ప్రత్యక్ష ప్రసారం
Comments
Please login to add a commentAdd a comment