7 వికెట్లతో అమెరికాపై గెలుపు
రాణించిన అర్ష్ దీప్, సూర్యకుమార్
శనివారం కెనడాతో టీమిండియా ‘ఢీ’
బ్యాటింగ్‌కు బద్ధ విరోధిలా నిలిచిన న్యూయార్క్ పిచ్‌పై భారత్ మరోసారి తమ స్థాయి ఆటను చూపించింది. వరుసగా మూడో విజయంతో టి20 ప్రపంచకప్‌లో ‘సూపర్–8’ దశకు చేరి తమ ఆధిపత్యాన్ని ప్రదర్శించింది. పట్టుదలగా పోరాడి అమెరికా కొంత ఇబ్బంది పెట్టినా... చివరకు టీమిండియా ముందు తలవంచక తప్పలేదు.
అర్ష్ దీప్‌తో పాటు ఇతర బౌలర్ల పదును ముందు యూఎస్ అతి కష్టమ్మీద 100 పరుగులు దాటింది. ఛేదనలో భారత బ్యాటింగ్ కాస్త తడబడి ఉత్కంఠను పెంచినా... సూర్యకుమార్, శివమ్ దూబే జోడీ మరో 10 బంతులు మిగిలి ఉండగా జట్టును గెలుపు తీరం చేర్చింది.
న్యూయార్క్: టి20 వరల్డ్ కప్ వేటలో ‘హ్యాట్రిక్’ విజయాన్ని అందుకున్న భారత్ సూపర్–8లోకి అడుగు పెట్టింది. బుధవారం జరిగిన గ్రూప్ ‘ఎ’ మ్యాచ్‌లో భారత్ 7 వికెట్ల తేడాతో యూఎస్‌ఏపై ఘన విజయం సాధించింది.
టాస్ ఓడి ముందుగా బ్యాటింగ్‌కు దిగిన యూఎస్‌ఏ 20 ఓవర్లలో 8 వికెట్ల నష్టానికి 110 పరుగులు చేసింది. నితీశ్ కుమార్ (23 బంతుల్లో 27; 2 ఫోర్లు, 1 సిక్స్), స్టీవెన్ టేలర్ (30 బంతుల్లో 24; 2 సిక్స్‌లు) ఫర్వాలేదనిపించారు. ‘ప్లేయర్ ఆఫ్ ద మ్యాచ్’ అర్ష్ దీప్ (4/9) ప్రత్యర్థిని దెబ్బ తీయగా... హార్దిక్ పాండ్యాకు 2 వికెట్లు దక్కాయి.
అనంతరం భారత్ 18.2 ఓవర్లలో 3 వికెట్లకు 111 పరుగులు చేసి గెలిచింది. సూర్యకుమార్ యాదవ్ (49 బంతుల్లో 50 నాటౌట్; 2 ఫోర్లు, 2 సిక్స్‌లు), శివమ్ దూబే (35 బంతుల్లో 31 నాటౌట్; 1 ఫోర్, 1 సిక్స్) నాలుగో వికెట్‌కు 65 బంతుల్లో అభేద్యంగా 67 పరుగులు జోడించారు. భారత్ తమ చివరి లీగ్ మ్యాచ్‌లో శనివారం లాడర్‌హిల్‌లో కెనడాతో తలపడుతుంది.
తలా ఓ చేయి..
గత రెండు మ్యాచ్‌లలో ఆకట్టుకున్న అమెరికాకు ఈసారి సరైన ఆరంభం లభించలేదు. అర్‡్షదీప్ వేసిన ఓవర్లో మొదటి బంతికే జహాంగీర్ (0) వికెట్ల ముందు దొరికిపోగా, చివరి బంతికి గూస్ (2) అవుటయ్యాడు. పవర్‌ప్లేలో యూఎస్ 18 పరుగులు చేసింది. ఆ తర్వాత కూడా ఇన్నింగ్స్ తడబడుతూనే సాగినా... చిన్న చిన్న భాగస్వామ్యాలు ఇన్నింగ్స్‌ను నడిపించాయి.
ఫామ్‌లో ఉన్న జోన్స్ (11)ను పాండ్యా వెనక్కి పంపించగా, దూకుడుగా ఆడబోయిన టేలర్‌ను అక్షర్ బౌల్డ్ చేశాడు. పాండ్యా ఓవర్లో సిక్స్, ఫోర్‌తో కొంత ధాటిని ప్రదర్శించిన నితీశ్ ఇన్నింగ్స్ బౌండరీ వద్ద సిరాజ్ అద్భుత క్యాచ్‌తో ముగిసింది. ఆ తర్వాత ఐదు బంతుల వ్యవధిలో అండర్సన్ (15), హర్మీత్ (10) వెనుదిరిగారు. 18వ ఓవర్ ఐదో బంతికి యూఎస్ స్కోరు వంద పరుగులకు చేరింది.
కోహ్లి మళ్లీ విఫలం...
లెఫ్టార్మ్ పేసర్ సౌరభ్ నేత్రావల్కర్ పదునైన బౌలింగ్‌తో భారత్‌ను ఇబ్బంది పెట్టాడు. గత రెండు మ్యాచ్‌లలో 1, 4 పరుగులే చేసిన కోహ్లి (0) ఈసారి తొలి బంతికే వెనుదిరిగి టి20 వరల్డ్ కప్‌లో తొలిసారి డకౌట్ నమోదు చేశాడు. ఆ తర్వాత నేత్రావల్కర్ బౌలింగ్‌లోనే రోహిత్ శర్మ (3) కూడా అవుట్ కాగా, కుదురుకుంటున్నట్లు అనిపించిన రిషభ్ పంత్ (18; 1 ఫోర్, 1 సిక్స్)ను చక్కటి బంతితో అలీఖాన్ క్లీన్ బౌల్డ్ చేశాడు.
ఈ దశలో సూర్య, దూబే కలిసి జట్టును ఆదుకున్నారు. మరీ ధాటిగా ఆడకపోయినా పిచ్‌ను బట్టి సింగిల్స్‌తో పరుగులు రాబట్టారు. 22 పరుగుల వద్ద సూర్య ఇచ్చిన క్యాచ్‌ను నేత్రావల్కర్ వదిలేయడం కూడా కలిసొచ్చింది. ఆ తర్వాత మరో అవకాశం ఇవ్వకుండా భారత ద్వయం ఆటను ముగించింది.
అమెరికాకు పెనాల్టీ...
తొలి వరల్డ్ కప్ ఆడుతున్న అమెరికా ఓవర్‌రేట్ నిబంధనల అమలు విషయంలో ఇంకా పరిణతి చెందలేదు. అనూహ్య రీతిలో మ్యాచ్‌లో ఆ జట్టుకు అంపైర్లు 5 పరుగులు పెనాల్టీగా విధించారు. ఓవర్ల మధ్యలో ఆ జట్టు ఒక నిమిషంకంటే ఎక్కువ సమయం తీసుకోవడం మూడుసార్లు జరిగింది. దాంతో కేవలం హెచ్చరికతో వదిలి పెట్టకుండా శిక్ష వేయడంతో భారత్‌కు 5 అదనపు పరుగులు వచ్చాయి.
స్కోరు వివరాలు
అమెరికా ఇన్నింగ్స్: జహాంగీర్ (ఎల్బీ) (బి) అర్ష్ దీప్ 0; టేలర్ (బి) అక్షర్ 24; గూస్ (సి) పాండ్యా (బి) అర్ష్ దీప్ 2; జోన్స్ (సి) సిరాజ్ (బి) 11; నితీశ్ (సి) సిరాజ్ (బి) అర్ష్ దీప్ 27; అండర్సన్ (సి) పంత్ (బి) పాండ్యా 15; హర్మీత్ (సి) పంత్ (బి) అర్ష్ దీప్ 10; షాడ్‌లీ (నాటౌట్) 11; జస్‌దీప్ (రనౌట్) 2; ఎక్స్‌ట్రాలు 8; మొత్తం (20 ఓవర్లలో 8 వికెట్లకు) 110. వికెట్ల పతనం: 1–0, 2–3, 3–25, 4–56, 5–81, 6–96, 7–98, 8–110. బౌలింగ్: అర్‡్షదీప్ 4–0–9–4, సిరాజ్ 4–0–25–0, బుమ్రా 4–0–25–0, పాండ్యా 4–1–14–2, దూబే 1–0–11–0, అక్షర్ 3–0–25–1.
భారత్ ఇన్నింగ్స్: రోహిత్ (సి) హర్మీత్ (బి) నేత్రావల్కర్ 3; కోహ్లి (సి) గూస్ (బి) నేత్రావల్కర్ 0; పంత్ (బి) ఖాన్ 18; సూర్యకుమార్ (నాటౌట్) 50; దూబే (నాటౌట్) 31; ఎక్స్‌ట్రాలు 9; మొత్తం (18.2 ఓవర్లలో 3 వికెట్లకు) 111. వికెట్ల పతనం: 1–1, 2–10, 3–39. బౌలింగ్: సౌరభ్ నేత్రావల్కర్ 4–0–18–2, అలీ ఖాన్ 3.2–0–21–1, జస్‌దీప్ సింగ్ 4–0–24–0, షాడ్లీ 4–0–25–0, అండర్సన్ 3–0–17–0.
టి20 ప్రపంచకప్‌లో నేడు
వెస్టిండీస్ X న్యూజిలాండ్
వేదిక: ట్రినిడాడ్, ఉదయం గం. 6 నుంచి
బంగ్లాదేశ్ X నెదర్లాండ్స్
వేదిక: కింగ్స్‌టౌన్, రాత్రి గం. 8 నుంచి
ఇంగ్లండ్ X ఒమన్
వేదిక: నార్త్‌సౌండ్, అర్ధరాత్రి గం. 12:30 నుంచిస్టార్ స్పోర్ట్స్, హాట్ స్టార్‌లో ప్రత్యక్ష ప్రసారం
Comments
Please login to add a commentAdd a comment