చౌక టికెట్లకు కిటుకులున్నాయ్‌ ! | flight tickets Discounts offers | Sakshi
Sakshi News home page

చౌక టికెట్లకు కిటుకులున్నాయ్‌ !

Published Sun, Mar 5 2017 11:44 PM | Last Updated on Tue, Oct 2 2018 7:37 PM

చౌక టికెట్లకు కిటుకులున్నాయ్‌ ! - Sakshi

చౌక టికెట్లకు కిటుకులున్నాయ్‌ !

విమాన టికెట్ల బుకింగ్‌కు రకరకాల మార్గాలు
సెర్చ్‌ నుంచి చెల్లింపుల దాకా జాగ్రత్త పడితే మేలు
డిస్కౌంట్లు, ఆఫర్లను అందుకుంటే మరింత చౌక  


హైదరాబాద్‌ నుంచి విశాఖపట్నానికి గనక ఒకటిరెండు వారాల ముందు టికెట్‌ తీసుకుంటే... రూ.3,000తో ఎంచక్కా వెళ్లి వచ్చేయొచ్చు. ఎందుకంటే... ఒకవైపు విమాన చార్జీ రూ.1,500 మాత్రమే కాబట్టి!! నిజానికి బస్సుల్లో వెళ్లినా రూ.1,200 చెల్లించక తప్పదు. ఒకవేళ రైల్లో థర్డ్‌ ఏసీలో వెళ్లాలన్నా దాదాపు వెయ్యి రూపాయల వరకూ అవుతుంది. మరి రూ.1,500కే గంటలో విశాఖ వెళ్లిపోవచ్చంటే..? ఇదిగో అందుకే విమానాల్లో రద్దీ పెరుగుతోంది. మధ్య తరగతి వారూ విమానాల్లో ప్రయాణించే స్థాయికి ధరలు దిగి రావటంతో... ఒకవైపు సర్వీసుల సంఖ్య పెరగటంతో పాటు మరోవంక కొత్త కొత్త విమానయాన కంపెనీలూ మార్కెట్లోకి దూసుకొస్తున్నాయి.

ఇదంతా ఎందుకంటే... ప్రయాణికులు పెరుగుతున్న కొద్దీ విమానయాన సంస్థల్లో పోటీ కూడా పెరుగుతోంది. ఫలితంగా టికెట్లు ఒక్కోసారి మరింత తక్కువ ధరకు దొరుకుతున్నాయి. ఇక టికెట్లు విక్రయించేందుకు రకరకాల సంస్థలు బరిలోకి దిగుతున్నాయి. ఇవి విమానయాన సంస్థలతో ప్రత్యేక ఒప్పందాలు చేసుకుంటున్నాయి. ఈ నేపథ్యంలో... ఆఫర్లను అందిపుచ్చుకోవటం ఎలా? విమాన టికెట్లపై చక్కని డిస్కౌంట్‌ పొందేందుకు ఉన్న మార్గాలేంటి? ఏం చేస్తే తక్కువ ధరకు టికెట్లు పొందొచ్చు? ఈ వివరాల సమాహారమే ఈ కథనం...

మీ కార్డులూ డిస్కౌంట్‌ ఇస్తాయి..
పలు బ్యాంకులు తమ క్రెడిట్‌ కార్డులపై తరచూ ఆఫర్లు ప్రకటిస్తుంటాయి. ఉదాహరణకు ఎస్‌బీఐ కార్డు ఉందనుకోండి. ఎస్‌బీఐ కార్డు ఆఫర్‌ ఫ్లయిట్‌ టికెట్స్‌ అని గూగుల్‌లో సెర్చ్‌ చేయడం ద్వారా వాటి వివరాలు పొందవచ్చు. అలాగే మేక్‌ మై ట్రిప్, యాత్రా వంటి పోర్టళ్లలోనూ ఆఫర్ల వివరాలు తెలుసుకోవచ్చు. అయితే, ఇందులో కొన్ని షరతులు కూడా ఉంటాయి. ఉదాహరణకు ఒక బ్యాంకు కార్డులకు ఇచ్చే ఆఫర్‌కు గడువు తేదీ, కనీస టికెట్‌ విలువ వంటివి ఉంటాయి. వాటికి మీరు అర్హులే అయితే అక్కడున్న డిస్కౌంట్‌ కోడ్‌ను టికెట్‌ బుక్‌ చేసే సమయంలో అప్లయ్‌ చేయాల్సి ఉంటుంది. అలా చేస్తేనే తగ్గింపు లభిస్తుంది. ఇక అమెరికన్‌ ఎక్స్‌ప్రెస్‌ అయితే జెట్‌ ఎయిర్‌వేస్‌తో కలసి విమానయాన ప్రయాణికులకు ప్రత్యేకంగా క్రెడిట్‌ కార్డును ఆఫర్‌ చేస్తోంది. సిటీ బ్యాంక్‌ వంటివి కూడా విమాన ప్రయాణికులకు ప్రత్యేక ఆఫర్లు అందిస్తున్నాయి. ఎక్కువగా విమానాల్లో ప్రయాణించేవారు... విమానయాన సంస్థలతో కలసి బ్యాంకులు అందించే ప్రత్యేక క్రెడిట్‌ కార్డులు తీసుకుంటే అధిక ప్రయోజనం ఉంటుందన్నది నిపుణుల మాట.

ముందు బుక్‌ చేసుకుంటే బెటర్‌
విమాన ప్రయాణానికి ఎంత ముందుగా బుక్‌ చేసుకుంటే అంత మంచిది. కనీసం 30 రోజుల నుంచి 90 రోజుల్లోపు బుక్‌ చేసుకుంటే తక్కువ ధరకు టికెట్లను పొందొచ్చు. ప్రారంభంలో రేట్లు ఒక మోస్తరుగా ఉంటాయి. 60 రోజుల ముందుకు వచ్చే సరికి కొంత తగ్గుతాయి. ఆ తర్వాత నుంచి ప్రయాణానికి రోజులు దగ్గర పడుతున్నకొద్దీ రేట్లు పెరుగుతూ వెళతాయి. అయితే పండుగలు, ప్రత్యేక రోజుల్లో తగ్గింపులకు అవకాశాలు చాలా తక్కువ. ఎందుకంటే అప్పుడు డిమాండ్‌ అధికం కనక.

వ్యాలెట్‌ ద్వారా చెల్లిస్తే కొంత డిస్కౌంట్‌!
గో–ఐబిబో, యాత్రా, మేక్‌ మై ట్రిప్, క్లియర్‌ ట్రిప్‌ తదితర వెబ్‌సైట్లన్నీ ఫ్లయిట్‌ టికెట్లకు, హోటల్‌ బుకింగ్‌లకు, పర్యాటక ప్యాకేజీలకు వీలు కల్పిస్తాయి. ఇవన్నీ కూడా ఇపుడు వర్చువల్‌ వ్యాలెట్లను నిర్వహిస్తున్నాయి. వీటిలో నగదును లోడ్‌ చేసుకుని వాటి ద్వారా ఫ్లయిట్‌ టికెట్లను బుక్‌ చేసుకుంటే కొంత క్యాష్‌ బ్యాక్‌ రూపంలో పొందేందుకు అవకాశం ఉంది. ఇలా మళ్లీ మన వ్యాలెట్లోకి వచ్చిన క్యాష్‌ను తిరిగి మరోసారి బుకింగ్‌ సమయంలో ఉపయోగించుకోవచ్చు. ఇక గో–ఐబిబో యాప్‌ను డౌన్‌లోడ్‌ చేసుకుంటే కొంత నగదు సైతం వ్యాలెట్‌కు జమయ్యే ఆఫర్లు ఒకోసారి ఉంటుంటాయి. వీటికి అదనంగా కొన్ని సందర్భాల్లో టికెట్‌ బుకింగ్‌పై ఉచితంగా షాపింగ్‌ వోచర్లు కూడా అందుకోవచ్చు. ఇక్సిగో డాట్‌కామ్‌ అయితే యాప్‌ ద్వారా ఫ్లయిట్‌ టికెట్లు బుక్‌ చేసుకుంటే క్యాష్‌ బ్యాక్‌ ప్రయోజనాన్ని సిట్రస్‌ వ్యాలెట్‌కు బదిలీ చేసుకునే అవకాశం కల్పిస్తోంది. ఫ్రీచార్జ్, పేటీఎం, మొబిక్విక్, పేయూ మనీ వంటివి తమ వ్యాలెట్ల ద్వారా చెల్లింపులు చేస్తే అదనంగా క్యాష్‌ బ్యాక్‌ సౌకర్యాన్ని అందిస్తుంటాయి.


సమయాన్ని బట్టి ఛార్జీలు!
అర్ధరాత్రి దాటాక ప్రయాణానికి మీకు ఇబ్బంది లేకపోతే తక్కువ ధరకు విమాన టికెట్లను పొందే అవకాశాలుంటాయి. అత్యవసర పని మీద, ఫలానా సమయానికి చేరుకునే విధంగా వెళ్లే వారికి ఇది కుదరకపోవచ్చు. మిగిలిన వారికి ఆ అవకాశం ఉంటుంది. అర్ధరాత్రి సమయాల్లో ప్రయాణానికి డిమాండ్‌ తక్కువగా ఉంటుంది కనక కంపెనీలు కొంత తక్కువ ధరకే టికెట్లు ఆఫర్‌ చేస్తాయి.  

మొబైల్‌ యాప్‌లూ ఉన్నాయి
టికెట్ల బుకింగ్‌కు మొబైల్‌ యాప్స్‌ను ఉపయోగించడం మరో విధానం. వెబ్‌సైట్ల ద్వారా బుకింగ్‌ చేసే అలవాటున్న వారు తగ్గింపు ధరలపై ఫ్లయిట్‌ టికెట్లు పొందాలంటే యాప్స్‌ను కూడా పరిశీలించాల్సిందే. ఎక్కువ సంస్థలు యాప్స్‌ ద్వారా బుకింగ్‌లపై తరచు ఆఫర్లు ఇస్తున్నాయి. కనీసం 5–10 శాతం తగ్గింపు అయినా పొందడానికి వీలుంటుంది. ఇంకా రివార్డు పాయింట్లు, క్యాష్‌ బ్యాక్‌ ఆఫర్లు, ప్రత్యేకమైన డిస్కౌంట్లు, ఆహార పదార్థాలపై తగ్గింపులకు అవకాశం ఉంటుంది.  

నేరుగా ఎయిర్‌లైన్‌ సైట్ల నుంచి...
ఒకవేళ టికెట్‌ బుకింగ్‌లకు మీడియేటరీ సంస్థలుగా ఉన్న పేటీఎం, మేక్‌మై ట్రిప్, ఇక్సిగో, ఎక్సపీడియా, గోఐబిబో వంటి సంస్థల నుంచి ఆఫర్లు లేవనుకుంటే ఎయిర్‌లైన్‌ సంస్థల వెబ్‌సైట్లను పరిశీలించాలి. ఎందుకంటే మధ్యవర్తిత్వ సేవలందించే పేటీఎం వంటి సంస్థలకు టికెట్ల బుకింగ్‌పై విమానయాన సంస్థలు కొంత మొత్తాన్ని కన్వేయన్స్‌ చార్జ్‌ రూపంలో చెల్లించాల్సి ఉంటుంది. నేరుగా వాటి సైట్ల నుంచి బుక్‌ చేసుకుంటున్నందున కొంత తగ్గింపునకు అవకాశం లేకపోలేదు.

డైనమిక్‌ ప్రైసింగ్‌... జాగ్రత్త!!
డిమాండ్‌కు అనుగుణంగా టికెట్ల ధరలను పెంచే విధానాన్ని విమానయాన సంస్థలు అనుసరిస్తున్నాయి. ఓ వ్యక్తి ఫలానా తేదీ, ఫలానా సమయానికి విమాన టికెట్ల బుకింగ్‌ కోసం నాలుగైదు సంస్థల సైట్లలో సెర్చ్‌ చేశారనుకోండి. ఆ వివరాలు కుకీల ద్వారా ఆయా సంస్థలకు తెలిసిపోతాయి. దీంతో బుకింగ్‌కు వచ్చే సరికి ధర పెరిగిపోతుంది. అందుకే వీలయితే, వెబ్‌సైట్‌ ద్వారా సెర్చ్‌ చేసేటపుడు ఇన్‌కాగ్నిటో మోడ్‌లో ఉండి సెర్చ్‌ చేయండి.

కోరుకున్న రోజు డిమాండ్‌ ఎక్కువుంటే?
మీరు ఏప్రిల్‌ 1న ప్రయాణించాలని డిసైడ్‌ అయ్యారు. టికెట్‌ బుక్‌ చేసుకుందామని సైట్‌ ను ఆశ్రయించారు. కానీ, ఆ రోజు టికెట్‌రేట్లు ఎక్కువగా ఉన్నాయనుకోండి. వీలుంటే రెండు రోజులు అటో, ఇటో ప్రయాణాన్ని మార్చుకోవచ్చేమో కూడా పరిశీలించాలి. అందుకు సిద్ధమైతే తగ్గింపునకు అవకాశం ఉంటుంది. ఇందుకు సెర్చ్‌ సమయంలో ఎడిట్‌ ఆప్షన్‌కు వెళ్లి ప్రయాణ తేదీని క్లిక్‌ చేస్తే వేర్వేరు తేదీల్లో ధరలతో పట్టిక కనిపిస్తుంది. గూగుల్‌ ఫ్లయిట్స్‌లో సెర్చ్‌ చేస్తే రెండు మూడు నెలల పాటు ఏ రోజున ఎంత ధర ఉందో ఒక్కచోటే తెలుసుకోవచ్చు కూడా. ఒక్కో తేదీన 50 శాతం తక్కువ ధరకు కూడా టికెట్‌ లభించొచ్చు. వారంలో విమాన ప్రయాణానికి తక్కువ చార్జీలుండే రోజులు మంగళవారం, బుధవారం అని గమనించాలి.

టికెట్లన్నీ ఒకే సంస్థ ద్వారా కాకుండా...
ప్రయాణం, తిరుగు ప్రయాణం టికెట్లను ఒకే సంస్థ ద్వారా బుక్‌ చేసుకుంటే చాలా సందర్భాల్లో తగ్గింపు ప్రయోజనాలకు దూరమవ్వాల్సి ఉంటుంది. పైగా రెండు వైపులా టికెట్లను ఒకే లావాదేవీగా బుక్‌ చేసుకుంటే తగ్గింపు పరిమితి కూడా ఉంటుంది. కనుక ఆఫర్లున్న రెండు సంస్థలను ఎంచుకుని ఒకవైపు ప్రయాణానికి ఒక వేదిక నుంచి, తిరుగు ప్రయాణానికి మరో వేదిక నుంచి టికెట్లను బుక్‌ చేసుకోవడం తెలివైన చర్య. ఉదాహరణకు ఓ సంస్థ రూ.5,000 టికెట్‌పై 10 శాతం తగ్గింపునందిస్తోంది. అదే సమయంలో గరిష్ట ప్రయోజనం రూ.500గానే నిర్దేశించిందనుకోండి. మీరు ఇరువైపులా టికెట్లను ఒకే లావాదేవీ కింద చేసేస్తే మొత్తం తగ్గింపు రూ.500కే పరిమితం అవుతుంది. అందుకే రెండు వేర్వేరు సంస్థల నుంచి టికెట్లను బుక్‌ చేసుకోవడం వల్ల డబుల్‌ బెనిఫిట్‌ పొందొచ్చు.  

ఇంకా ఇలా చేయొచ్చు...


పలు విమానయాన సంస్థలు విద్యార్థులు, సీనియర్‌ సిటిజన్లకు టికెట్లపై 8–10 శాతం రేంజ్‌లో తగ్గింపు ఇస్తున్నాయి. స్పైస్‌జెట్‌ విద్యార్థులకు బేస్‌ ధరపై 8 శాతం తగ్గింపు ఇస్తోంది. ఇలాంటివి కొన్ని రూట్లలో, కొన్ని తేదీల్లో మాత్రమే అందుబాటులో ఉంటాయి.

వీలయితే చిన్న బ్యాగుతో ప్రయాణం చేయండి. దీనివల్ల లగేజీ ఖర్చులు తగ్గుతాయి. కొన్ని సంస్థలు బ్యాగేజ్‌పై చార్జీలు వడ్డిస్తున్న విషయం తెలిసిందే కదా.

కూపన్‌ దునియా వంటి కొన్ని సైట్లు విమాన టికెట్ల బుకింగ్‌పై డిస్కౌంట్ల కూపన్లు ఇస్తుంటాయి. టికెట్ల బుకింగ్‌కు ముందు గూగుల్‌ లో సెర్చ్‌ చేయడం ద్వారా వీటిని తెలుసుకోవచ్చు.

మీరు కావాలనుకున్న ఫ్లయిట్‌కు టికెట్‌ రేటు బాగా ఎక్కువుందనుకోండి. అవి తగ్గినప్పుడు మిమ్మల్ని అప్రమత్తం చేయడానికి గూగుల్‌ అలర్ట్స్‌ ఉపయోగపడుతుంది. ధర మారినప్పుడల్లా ఆ వివరాలు ఈమెయిల్‌కు వచ్చేస్తాయి.

విమానయాన సంస్థలు, వాటి తరఫున బుకింగ్‌ సేవలు అందించే ఇతర సంస్థలు ఇచ్చే ఆఫర్ల వివరాలు తెలుసుకోవాలంటే ఎయిర్‌ఫేర్‌ న్యూస్‌లెటర్‌కు సబ్‌స్క్రయిబ్‌ చేయాలి. దానివల్ల ఎప్పటికప్పుడు ఆఫర్ల వివరాలు మీకు తెలుస్తుంటాయి.

గోఐబిబో, యాత్రా వంటి సంస్థలు ఎలాంటి నగదు చెల్లించకుండా టికెట్లను ముందుగా బుక్‌ చేసుకునే అవకాశాన్నిస్తున్నాయి. ప్రయాణం విషయంలో సందిగ్ధత ఉన్నా, డిస్కౌంట్ల కోసం వేచి ఉందామనుకున్నా, సీట్‌ను బ్లాక్‌ చేసుకుని తర్వాత చెల్లించే సదుపాయం ఉంది.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement