
న్యూఢిల్లీ: ఆన్‌లైన్ మార్కెట్ ప్లేస్ ఫ్లిప్‌కార్ట్.. తన చెల్లింపుల విభాగం ఫోన్‌పేలో 50 కోట్ల డాలర్లు (సుమారు రూ.3,250 కోట్లు) పెట్టుబడిగా పెడుతోంది. 2015లో ఫోన్‌పే సంస్థను కొనుగోలు చేశామని, అప్పటి నుంచి ఈ సంస్థలో 7.5 కోట్ల డాలర్లు పెట్టుబడులు పెట్టామని ఫ్లిప్‌కార్ట్ తెలియజేసింది. ఫోన్‌పే కార్యకలాపాలను మరింత విస్తృతం చేయడం కోసం తాజాగా 50 కోట్ల డాలర్లు పెట్టుబడులు పెట్టనున్నామని వివరించింది. ఒక భారత ఫైనాన్షియల్ టెక్నాలజీ చెల్లింపుల రంగంలో ఇదే అత్యధిక పెట్టుబడి అని పేర్కొంది.
ఈ నిధులను టెక్నాలజీ ప్లాట్‌ఫార్మ్స్ కోసం, మర్చంట్ నెట్‌వర్క్ విస్తరణకు, వినియోగదారులను మరింతగా పెంచుకోవడానికి వినియోగిస్తామని ఫోన్‌పే సీఈఓ, వ్యవస్థాపకుల్లో ఒకరైన సమీర్ నిగమ్ వెల్లడించారు. ఈ ఏడాది ప్రతి రెండు నెలలకు వంద శాతం చొప్పున ఫోన్‌పే వృద్ధి సాధిస్తోందని పేర్కొన్నారు. డిజిటల్ ఇండియా జోరుకు ఫైనాన్షియల్ టెక్నాలజీ, ఈ కామర్స్‌లు కీలకమని, యువజనం, టెక్నాలజీ కారణంగా ఇవి మంచి వృద్ధిని సాధించనున్నాయని ఫ్లిప్‌కార్ట్ గ్రూప్ సీఈఓ బిన్నీ బన్సాల్ చెప్పారు.