ట్రాఫిక్ చిక్కులకు ఫ్లిప్ కార్ట్ బెస్ట్ ప్లాన్స్
ట్రాఫిక్ చిక్కులకు ఫ్లిప్ కార్ట్ బెస్ట్ ప్లాన్స్
Published Thu, Jun 8 2017 9:27 AM | Last Updated on Wed, Aug 1 2018 3:40 PM
బెంగళూరు : ఈ-కామర్స్ దిగ్గజం ఫ్లిప్ కార్ట్ దేశీయంగా శరవేగంగా దూసుకెళ్తున్న సంగతి తెలిసిందే. ఈ ఏడాదే 10వ సంవత్సరంలోకి అడుగుపెట్టింది. అయితే ఎక్కడైతే ఈ దిగ్గజం ఆవిర్భవించిందో ఆ ప్రాంతానికి ఏదైనా చేయాలనే ధృడసంకల్పంతో ఫ్లిప్ కార్ట్ ముందుకు వెళ్తోంది. ఫ్లిప్ కార్ట్ వెలిసిన ప్రాంతం బెంగళూరు. బెంగళూరు కేంద్రంగా దీన్ని సచిన్, బిన్నీ బన్సాల్ ఏర్పాటుచేశారు. ఈ ప్రాంతంలో ప్రజలు ఎక్కువగా ఎదుర్కొంటున్న సమస్య ట్రాఫిక్. ట్రాఫిక్ తో ఈ సిటీ ఎల్లవేళలా సతమతమవుతూ ఉంటుంది. ఇక ఆఫీసులకు వెళ్లేవారైతే, కాస్త ఆలస్యం చేశారో ఇక అంతే సంగతులు. దీంతో ట్రాఫిక్ సమస్యను కంట్రోల్ చేయడానికి ఫ్లిప్ కార్ట్ సన్నద్ధమవుతోంది.
తమ ప్లాట్ ఫామ్ పై ప్రజలు తమ ఐడియాలను షేర్ చేసుకోవాలని కోరుతోంది. ''మా చిన్న ఆలోచన ద్వారా, మేము ఓపెన్ ఇన్నోవేషన్ ప్లాట్ ఫామ్ ను ఏర్పాటుచేశాం. ఈ ప్లాట్ ఫామ్ పై ప్రజలు ముందుకు వచ్చి, మాతో కలిసి ట్రాఫిక్ సమస్యను చర్చించాలి.. సమస్యను రూపుమాల్చడానికి మీరు సూచించే కొన్ని మార్గాలు సహాయపడతాయి. సిల్క్ బోర్డు జంక్షన్, కేఆర్ పురం జంక్షన్ వంటి చిన్న చిన్న జంక్షన్ లలో ఏం అవసరమో అవి చేద్దాం. దీనికి సహాయంగా ఫ్లిప్ కార్ట్ ఇన్వెస్ట్ చేస్తుంది'' అని కంపెనీ చీఫ్ ఆర్కిటెక్ట్ ఉత్కర్ష్ చెప్పారు. చుట్టూ ఉన్న ఎకో సిస్టమ్ మంచిగా లేకపోతే, కస్టమర్లు సంతోషంగా ఉండలేరు. సంతోషమైన మన నగరాన్ని మనం తిరిగి తెచ్చేసుకుందాం అని పేర్కొన్నారు.
ఫ్లిప్ కార్ట్ కొన్ని కార్యాలయాలు కూడా రద్దీగా ఉండే ప్రాంతంలో ఉండటంతో ఆ కంపెనీ ఉద్యోగులు కూడా టెర్రిబుల్ ట్రాఫిక్ సమస్యలను ఎదుర్కొంటున్నారు. ఈ కార్యక్రమంలో పాల్గొనాలనుకునే అభ్యర్థులకు రెండువారాల పాటు తమ ఆలోచనలపై పనిచేసే అవకాశం కల్పిస్తోంది. తర్వాత దరఖాస్తులను క్లోజ్ చేసి, వాటిని షార్ట్ లిస్టు చేస్తోంది. టాప్ 10 టీమ్స్ తమ ఐడియాలను జ్యురీ ముందు వివరించాల్సి ఉంటుంది. ఈ సమస్యకు తగిన పరిష్కారం కల్పించిన బెస్ట్ ఐడియాలను జూలై 1న ప్రదర్శించి, గెలుపొందిన వారికి రెండు లక్షల విలువైన, లక్ష విలువైన, 50వేల విలువైన ఓచర్లను అందిస్తోంది.
Advertisement