
ప్రస్తుతం ఉబర్ క్యాబ్‌లకు ఉన్న డిమాండ్ అంతా ఇంతా కాదు. చాలా మంది ఏదైనా పనిమీద బయటకి వెళ్లాలనుకుంటే ఉబర్ క్యాబ్‌లనే ఆశ్రయిస్తున్నారు. ఉబర్ క్యాబ్‌లకు అంతకంతకు పెరుగుతున్న డిమాండ్‌ను బట్టి, మరికొన్నేళ్లలో ఉబర్ సరికొత్త సర్వీసులను ప్రారంభించబోతుంది. ఆకాశంలో ప్రయాణించడానికి కూడా ఉబర్ క్యాబ్ సర్వీసులను మొదలు పెట్టబోతుంది. ఒకవేళ ఉబర్ ప్రణాళికలు కనుక విజయవంతమైతే, 2024 వరకు వాణిజ్య అవసరాల కోసం క్యాబ్‌లోనే ఎగురవచ్చు. ఎంబ్రేర్ ఎస్‌ఏతో పాటు ఉబర్ టెక్నాలజీస్ ఎలక్ట్రిక్ ఎయిర్‌క్రాఫ్ట్‌ను అభివృద్ధి చేస్తోందని ఈ బ్రెజిలియన్ ప్లేన్ మేకర్ చీఫ్ ఎగ్జిక్యూటివ్ తెలిపారు. ఉబర్ చీఫ్ ప్రొడక్ట్ ఆఫీసర్ జెఫ్ హోల్డెన్ కూడా గత నెలలో ఈ విషయంపై క్లారిటీ ఇచ్చారు.
2023 వరకు చెల్లింపులతో ఎగిరే ట్యాక్సి సర్వీసులను ప్రారంభించనున్నామని పేర్కొన్నారు. విమానాల మధ్య ఐదు నిమిషాల వ్యవధిలో ఛార్జ్ చేయగల బ్యాటరీలతో ఈ ఎయిర్‌క్రాఫ్ట్ ప్రాజెక్టు రూపొందుతోంది. ఫ్లయింగ్ ఉబర్ ట్యాక్సీల ఏర్పాటుకి అనుగుణంగా ఎయిర్ ట్రాఫిక్ కంట్రోల్‌ని ఏర్పరచడానికి నాసాతో కూడా ఉబర్ ఓ ఒప్పందం చేసుకున్నట్టు తెలుస్తోంది. అయితే ఈ ప్రాజెక్ట్ అంత సులువు కాదని.. ఎగిరే క్యాబ్ వల్ల ఎన్నో సమస్యలు రావచ్చునని నిపుణులు అంటున్నారు. ఎయిర్ క్రాఫ్ట్ నడిపిన పైలెట్లను నియమించాల్సి ఉంటుందని.. లేదా ఎయిర్ క్రాఫ్ట్ ఫ్లయింగ్‌లో శిక్షణనివ్వాల్సి వస్తుందని తెలిపారు. వీటితో పాటు బ్యాటరీ టెక్నాలజీలో పలు మార్పులు చేయాల్సి ఉంటుంది.