తప్పిన భారీ ప్రమాదం.. ఎయిర్‌పోర్టులో ల్యాండింగ్
శంషాబాద్ (రాజేంద్రనగర్): హైదరాబాద్ నుంచి హాంగ్‌కాంగ్ బయలుదేరిన విమానానికి భారీ ప్రమాదం తప్పింది. విమానం రెక్కల్లో ఇరుక్కుపోయిన పక్షిని గమనించిన పైలట్ అప్రమత్తంగా వ్యవహరించడంతో 244 మంది ప్రయాణికులు సురక్షితంగా బయటపడ్డారు. శంషాబాద్ విమానాశ్రయంలో శనివారం అర్ధరాత్రి 1.50 గంటలకు క్యాథే పసిఫిక్ ఎయిర్‌లైన్స్‌కు చెందిన సీఎక్స్646 విమానం హాంగ్‌కాంగ్ బయలుదేరడానికి టేకాఫ్ తీసుకుంది. ఇక్కడి నుంచి వికారాబాద్ జిల్లాలోకి ప్రవేశించిన తర్వాత విమానం రెక్కల్లో పక్షి ఇరుక్కుపోయినట్లు పైలట్ గమనించాడు. వెంటనే శంషాబాద్ ఎయిర్‌ట్రాఫిక్ కంట్రోల్ అధికారులకు సమాచారం అందించాడు.
వారి సూచనల మేరకు 2.30 గంటల సమయంలో విమానాన్ని తిరిగి శంషాబాద్ ఎయిర్‌పోర్టులో అత్యవసరంగా దింపాడు. ఇందులో మొత్తం 244 మంది ప్రయాణికులున్నారు. ప్రయాణికులకు నొవాటెల్ హోటల్‌లో బస ఏర్పాటు చేశారు. ప్రయాణికులకు వేర్వేరు కనెక్టివిటీ విమానాల ద్వారా ప్రత్యామ్నాయ ఏర్పాట్లు చేయడంతో ఆదివారం మధ్యాహ్నం వారు బయలుదేరారు. విమానాన్ని శంషాబాద్ ఎయిర్‌పోర్టులోనే నిలిపివేశారు. షెడ్యూల్ ప్రకారం రాత్రి 1.50 బయలుదేరే ఈ విమానం ఉదయం 9.40 గంటలకు హాంగ్‌కాంగ్ చేరుకోవాల్సి ఉంటుంది. తిరిగి రాత్రి 9 గంటలకు అక్కడి నుంచి బయలుదేరి అర్ధరాత్రి 12.30 గంటలకు ఇక్కడి చేరుకుంటుంది. దీంతో విమానం నిర్ధారిత సమయాల్లో మార్పులు చోటు చేసుకున్నట్లు ఎయిర్‌పోర్టు వర్గాలు వెల్లడించాయి.
విమానం రెక్కల్లో ఇరుక్కుపోయిన పక్షి
Published Mon, May 22 2017 2:55 AM | Last Updated on Wed, Apr 3 2019 7:53 PM
Advertisement
Advertisement