
నేటి నుంచి ఆర్థిక మంత్రి ప్రీ-బడ్జెట్ సంప్రదింపులు
న్యూఢిల్లీ: కేంద్రంలో మోడీ నేతృత్వంలోని కొత్త సర్కారు మొట్టమొదటి బడ్జెట్ ప్రక్రియకు తెరలేస్తోంది. ఆర్థిక మంత్రి అరుణ్ జైట్లీ నేటి(గురువారం) నుంచి వివిధ రంగాల నిపుణులు, ప్రతినిధులతో బడ్జెట్ ముందస్తు సంప్రదింపులను ప్రారంభించనున్నారు. ముందుగా వ్యవసాయ రంగ ప్రతినిధులతో ఈ కసరత్తు మొదలు కానుంది. జూలై మొదటివారంలో జైట్లీ తన తొలి బడ్జెట్‌ను సమర్పించనున్నట్లు తెలుస్తోంది. అంతేకాదు మోడీ ప్రభుత్వం ఆర్థిక వ్యవస్థకు ఎలాంటి దిశానిర్ధేశం చేయనుందో, పాలసీ పరంగా ఎలాం టి చర్యలు ఉంటాయనేది కూడా ఈ బడ్జెట్‌లో ప్రతిబింబించనుంది. కాగా, బడ్జెట్‌కు ముందు సామాజిక రంగానికి చెందిన బృందాల ప్రతినిధులతో కూడా జైట్లీ భేటీ కానున్నారు. గత నెల 27న విత్తమంత్రిగా బాధ్యతలు చేపట్టిన జైట్లీకి ఆర్థిక మంత్రిత్వ శాఖలోని 5 విభాగాల కార్యదర్శులు ప్రస్తుత పరిస్థితులను ఇప్పటికే వివరించారు.
మందగమనం నేపథ్యంలో...
ప్రతి ఏటా బడ్జెట్‌కు ముందు ఆర్థిక మంత్రితో పారిశ్రామిక మండళ్లు, ట్రేడ్ యూనియన్లు, ఫైనాన్షియల్ సేవల రంగ ప్రతినిధులతో పాటు పలు రంగాలకు చెందిన పక్షాలన్నీ సమావేశమవుతాయి. రాష్ట్రాలకు చెందిన ఆర్థిక మంత్రులు కూడా విత్తమంత్రితో సంప్రదింపుల్లో పాల్గొం టారు. ఈ సమావేశాల సందర్భంగా బడ్జెట్‌లో తాము ఆశించే అంశాలకు సంబంధించి విజ్ఞప్తులు, సూచనలు వెల్లువెత్తుతాయి. అయితే, ఆర్థిక వ్యవస్థ గత కొన్నేళ్లుగా మందగమనంలో కొనసాగుతున్న నేపథ్యంలో కొత్త సర్కారుకు తొలి బడ్జెట్ కత్తిమీద సామేనని నిపుణులు అభిప్రాయపడుతున్నారు.
2013-14 ఆర్థిక సంవత్సరంలో స్థూల దేశీయోత్పత్తి(జీడీపీ) వృద్ధి రేటు 4.7 శాతానికే పరిమితమైన సంగతి తెలిసిందే. మరోపక్క, ఆర్థిక స్థిరీకరణ సాధించాలంటే సబ్సిడీలకు కళ్లెంవేయడం తప్పనిసరి. పెరుగుతున్న ధరలకు అడ్డుకట్టవేయడం ఇతరత్రా అనేక సవాళ్లను ఆయన ఎదుర్కోవాల్సి ఉంది. ఈ నేపథ్యంలో రానున్న కాలంలో దేశ ఆర్థిక వ్యవస్థను గాడిలోపెట్టడం సహా మధ్యతరగతి వర్గాలు, పారిశ్రామిక రంగానికి జైట్లీ తన తొట్టతొలి బడ్జెట్‌లో ఎలాంటి వరాలు కురిపిస్తారనే ఉత్కంఠ కూడా నెలకొంది.