ఈ ఏడాదే మార్కెట్లోకి ఫోర్డ్ ‘మస్టాంగ్’ | Ford Mustang arrives in India | Sakshi
Sakshi News home page

ఈ ఏడాదే మార్కెట్లోకి ఫోర్డ్ ‘మస్టాంగ్’

Published Fri, Jan 29 2016 1:51 AM | Last Updated on Sun, Sep 3 2017 4:29 PM

ఈ ఏడాదే మార్కెట్లోకి ఫోర్డ్ ‘మస్టాంగ్’

ఈ ఏడాదే మార్కెట్లోకి ఫోర్డ్ ‘మస్టాంగ్’

న్యూఢిల్లీ: దాదాపు 50 ఏళ్లకుపైగా చరిత్ర... అమెరికాలో చక్కని జనాదరణ ఉన్న స్పోర్ట్స్ కారు ‘మస్టాంగ్’ భారతీయ రోడ్లపై పరిగెత్తడానికి సిద్ధమవుతోంది. అమెరికా దిగ్గజ కార్ల తయారీ కంపెనీ ఫోర్డ్ తాజాగా ఆరవ జనరేషన్ ‘మస్టాంగ్’ను గురువారం ఆవిష్కరించింది.

 దీన్ని ఈ ఏడాదే భారత మార్కెట్‌లో ప్రవేశపెట్టనున్నట్లు ప్రకటించింది. కంపెనీ దీన్ని ఫిబ్రవరి నెలలో జరగనున్న ‘ఢిల్లీ ఆటో ఎక్స్‌పో-2016’లో ప్రదర్శించనుంది. అదిరిపోయే డిజైన్, అత్యాధునిక టెక్నాలజీ, అంతర్జాతీయ స్థాయి ప్రమాణాలు ‘మస్టాంగ్’ సొంతమని, స్టైల్, పనితీరు తదితర అంశాలకు ప్రాధాన్యమిచ్చే వారికి ఈ కారు కచ్చితంగా సరి పోతుందని ఫోర్డ్ ఇండియా ప్రెసిడెంట్ నిగెల్ హారిస్ తెలిపారు.

కారు ప్రత్యేకతలు: ‘మస్టాంగ్’లో షార్ట్ రియర్ డెక్, లాంగ్ హుడ్, ఫ్రంట్ అండ్ రియర్ సస్పెన్షన్ సిస్టమ్, వాల్వ్ ట్రైన్ అండ్ సిలిండర్ హెడ్స్‌తో కూడిన 5.0 లీటర్ శక్తివంతమైన వీ8 ఇంజిన్, ఫోర్డ్ సింక్ టెక్నాలజీ ద్వారా డ్రైవర్ తన మాటలతో కారులోని ఎంటర్‌టైన్‌మెంట్ వ్యవస్థను కమాండ్ చేసే వెసులుబాటు, పుష్ బటన్ స్టార్ట్, నావిగేషన్, పవర్ ఫోల్డింగ్ మిర్రర్స్, రియర్ కెమెరా వంటి తదితర ప్రత్యేకతలు ఉంటాయని కంపెనీ తెలిపింది.

 1964లో మార్కెట్లోకి వచ్చిన ఈ కారు విక్రయాలు ఇప్పటి వరకు 90 లక్షల యూనిట్లకు చేరాయని పేర్కొంది. ‘మస్టాంగ్’ కారు ప్రస్తుతం ఫాస్ట్‌బ్యాక్, కన్వర్టబుల్ అనే రెండు మోడళ్లలో అంతర్జాతీయ మార్కెట్‌లో లభ్యమౌతోంది. భారత్‌లోకి ఫాస్ట్‌బ్యాక్ మోడల్ ముందుగా రానుంది. ధరను కంపెనీ ప్రకటించలేదు. రూ.50-60 లక్షల శ్రేణిలో ఉండొచ్చని మార్కెట్ వర్గాలు అంచనా వేస్తున్నాయి.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement