అమెరికాకు చెందిన ప్రముఖ కార్ల తయారీ సంస్థ ఫోర్డ్ భారత్‌లోకి రీఎంట్రీ ఇస్తోంది. ఎలక్ట్రిక్ వాహనాలపై ప్రత్యేక దృష్టితో భారత మార్కెట్లోకి తిరిగి రావాలని యోచిస్తోంది. రీ-ఎంట్రీ అంశాన్ని కంపెనీ సీఈవో జిమ్ ఫార్లీ నేతృత్వంలోని ఫోర్డ్ గ్లోబల్ టీమ్ సమీక్షిస్తోంది.
పాశ్చాత్య మార్కెట్లలో స్తబ్దత కారణంగా భవిష్యత్ వృద్ధికి కీలకమైన మార్కెట్‌గా భావించే భారత్‌లో తిరిగి ప్రవేశించే అవకాశాలను అంచనా వేయడానికి వివరణాత్మక సాధ్యాసాధ్యాల నివేదిక ఇప్పటికే సిద్ధమైనట్లు తెలుస్తోంది.
ఫోర్డ్ గతంలో భారత్‌లో 2 బిలియన్ డాలర్లకు పైగా పెట్టుబడి పెట్టింది. ఎకో స్పోర్ట్ మినీ-ఎస్‌యూవీ, ఫిగో చిన్న కారు వంటి మోడళ్లతో విజయాన్ని సాధించింది. మహీంద్రా & మహీంద్రాతో కలిసి జాయింట్ వెంచర్లతో చారిత్రక ఉనికి ఉన్నప్పటికీ, ఫోర్డ్ భారత్‌లో స్థిరమైన వ్యాపారాన్ని స్థాపించడంలో సవాళ్లను ఎదుర్కొంది. ఈ వెంచర్లు కంపెనీ అంచనాలను అందుకోలేకపోయాయి. దీంతో ఫోర్డ్ తన గుజరాత్ ప్లాంట్‌ను టాటా మోటార్స్‌కు విక్రయించాలని, భారత మార్కెట్ నుంచి నిష్క్రమించాలనే ఆలోచనకు దారితీసింది.
ఫోర్డ్ తన చెన్నై ప్లాంట్‌ను సజ్జన్ జిందాల్ జేఎస్‌డబ్ల్యూకి విక్రయించే ఒప్పందాన్ని వెనక్కి తీసుకోవాలని నిర్ణయించుకోవడంతో భారత మార్కెట్లోకి తిరిగి ప్రవేశించే పునరాలోచన ఊపందుకుంది. ఫోర్డ్ కార్యకలాపాలకు కేంద్ర బిందువుగా ఉన్న చెన్నై ప్లాంట్‌ను కంపెనీ పునరుద్ధరణ వ్యూహానికి కీలకమైనదిగా పరిగణిస్తున్నారు.
ఫోర్డ్ గ్లోబల్ టీమ్ రీ-ఎంట్రీ ప్లాన్‌ను ఆమోదించినట్లయితే, కంపెనీ గణనీయమైన చట్టపరమైన సన్నాహాలను చేపట్టవలసి ఉంటుంది. చెన్నై ప్లాంట్‌లో ఇప్పటికే ఉన్న మెషినరీని అప్‌డేట్ చేయాల్సి ఉంటుంది. దీని వలన ఉత్పత్తి దాదాపు ఒక సంవత్సరం ఆలస్యం కావచ్చు. భారత్‌లో అభివృద్ధి చెందుతున్న మార్కెట్ పరిస్థితులు, ముఖ్యంగా గత మార్చిలో ఆవిష్కరించిన కొత్త ఎలక్ట్రిక్ వాహన విధానం ఫోర్డ్ పునరాలోచనకు కీలకమైన అంశాలు.
Comments
Please login to add a commentAdd a comment