
ముంబై: డాలర్ మారకంలో రూపాయి విలువ గడచిన ఐదు ట్రేడింగ్ సెషన్లలో వేగంగా బలపడింది. ఇంటర్‌బ్యాంక్ ఫారెక్స్ మార్కెట్‌లో శుక్రవారం 24పైసలు లాభపడితే, గడచిన ఐదు రోజుల్లో 104 పైసలు బలపడింది. ట్రేడింగ్ ప్రారంభం నుంచీ రూపాయి లాభాల బాటన నడిచింది. గురువారం ముగింపు 69.34పైసలు అయితే, శుక్రవారం మరింత లాభంతో 69.28 వద్ద ప్రారంభమైంది. ఒకదశలో 69.03ను స్థాయిని కూడా చూసింది. రూపాయి పెరుగుదలకు పలు కారణాలున్నాయి.
కారణాలు ఇవీ...
►ఎన్నికల అనంతరం దేశ ప్రధానిగా మళ్లీ మోదీనే పగ్గాలు చేపడతారన్న విశ్లేషణలు
► ఈ అంచనాల నేపథ్యంలో డెట్, ఈక్విటీ మార్కెట్‌లోకి విదేశీ ప్రత్యక్ష పెట్టుబడుల ప్రవాహం.
► క్రూడ్ ఆయిల్ (ఈ వార్త రాసే 9 గంటల సమయంలో బ్రెంట్ క్రూడ్ ధర 66.68) ధరలు అంతర్జాతీయంగా స్థిరంగా ఉండడం.
► దీనితో ద్రవ్యోల్బణం కట్టడి విశ్లేషణలు.
► వృద్ధి క్రియాశీలతకు రేటు తగ్గింపు అంచనా.
► డాలర్ ఇండెక్స్ కదలికలపై అనిశ్చితి
► అమెరికా సెంట్రల్ బ్యాంక్– రేటు (ప్రస్తుత శ్రేణి 2.25–2.50) పెంపు విషయంలో అనిశ్చితి
► మూడేళ్ల ఫారిన్ ఎక్సే్ఛంజ్ స్వాప్ ఆక్షన్ ద్వారా రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ఐదు బిలియన్ డాలర్ల లిక్విడిటీని (ద్రవ్య లభ్యత) వ్యవస్థలోకి పంప్ చేస్తోందన్న వార్త.
74.39 కనిష్టం నుంచి...
అక్టోబర్ 9వ తేదీన రూపాయి చరిత్రాత్మక కనిష్ట స్థాయి 74.39 వద్ద ముగిసింది. క్రూడ్ ధరలు అంతర్జాతీయంగా ఇటీవలి గరిష్ట స్థాయిల నుంచి అనూహ్యంగా 30 డాలర్ల వరకూ పడిపోతూ వచ్చిన నేపథ్యంలో...రూపాయి క్రమంగా కోలుకుని రెండున్నర నెలల క్రితం 69.43 స్థాయిని చూసింది. . గత రెండు నెలలుగా 72–70 మధ్య కదలాడింది. అయితే ఎన్నికల ముందస్తు ఈక్విటీల ర్యాలీ తాజాగా రూపాయికి సానుకూలమవుతోంది.
Comments
Please login to add a commentAdd a comment