ఇన్ఫోసిస్ షేర్లు బైబ్యాక్ చేయాలి
బెంగళూరు: సాఫ్ట్‌వేర్ సేవల దిగ్గజం ఇన్ఫోసిస్ షేర్ల బైబ్యాక్‌ను చేపట్టాలని కంపెనీ మాజీ సీఎఫ్‌వో వి.బాలకృష్ణన్‌తోపాటు, కొంతమంది బడా ఇన్వెస్టర్ల గ్రూప్ డిమాండ్ చేసింది. తద్వారా కొత్త సీఈవోగా బాధ్యతలు చేపట్టనున్న విశాల్ సిక్కాపై ఇన్వెస్టర్లకు గురి కుదురుతుందని వీరంతా పేర్కొన్నారు. షేరుకి రూ. 3,850 ధరలో షేర్ల బైబ్యాక్ చేసి ఇన్ఫోసిస్ ఇన్వెస్టర్లకు విలువను చేకూర్చాల్సి ఉందని డిమాండ్ చేశారు.
కంపెనీ చరిత్రలో తొలిసారి సొంత షేర్లను కొనుగోలు చేయడం(బైబ్యాక్) ద్వారా కంపెనీ వాటాదారుల్లో విశ్వాసాన్ని నింపాల్సిన అవసరముందని వ్యాఖ్యానించారు. వ్యవస్థాపకుల్లో ఒక్కరు కూడాలేని ప్రస్తుత పరిస్థితుల్లో కంపెనీ వ్యవస్థాపకుడు కాని వ్యక్తి విశాల్ సిక్కా ఇన్ఫోసిస్‌కు నేతృత్వం వహిస్తున్న సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో పరిశ్రమ వృద్ధికంటే కంపెనీ వెనకబడింది.
బైబ్యాక్ విషయమై రిటైల్ ఇన్వెస్టర్ల తరఫున జూలై 29న కంపెనీకి బాల లేఖ రాశారు. లేఖను బోర్డు సభ్యులతోపాటు, నారాయణ మూర్తికి, విశాల్ సిక్కాకుసైతం పంపినట్లు తెలిపారు. నిలకడైన, భారీ బైబ్యాక్‌కు తెరలేపాల్సిందిగా ఇన్ఫోసిస్ బోర్డును లేఖలో బాల కోరారు. సంస్థాగత ఇన్వెస్టర్లతో నిర్వహించిన చర్చల్లోనూ తమ ప్రతిపాదనకు మద్దతు లభించినట్లు తెలిపారు.1993 జూన్‌లో స్టాక్ ఎక్స్ఛేంజీలలో లిస్టయిన ఇన్ఫోసిస్ ఇంతవరకూ బైబ్యాక్ చేపట్టలేదు.