ఇన్ఫోసిస్ పై మాజీ ఉద్యోగులు కేసు!
హిందీ భాష రాదనే కారణంతో పక్షపాత ధోరణి ప్రదర్శించారంటూ భారత ఐటీ దిగ్గజం ఇన్పోసిస్ కంపెనీపై అమెరికాకు చెందిన మాజీ ఉద్యోగులు కేసు నమోదు చేశారు. తమ కంపెనీపై వచ్చిన ఆరోపణలన్ని అవాస్తవాలు, నిరాధారం అంటూ ఇన్ఫోసిస్ ఖండించింది.
గతంలో ఇన్ఫోసిస్ సాఫ్ట్ వేర్ టెస్టర్ గా పనిచేసిన బొల్టెన్, సేల్స్ మేనేజర్ గా సేవలందించిన హ్యాండ్లోసెర్ తోపాటు మరో ఇద్దరు ఇన్ఫోసిస్ పై యూఎస్ కోర్ట్ ఆఫ్ ఈస్టర్న్ డిస్ట్రిక్ట్ ఆఫ్ విస్కాన్సిన్ లో కేసు నమోదు చేశారు. కంపెనీకి సంబంధించిన సమావేశాలకు దూరంగా ఉంచేవారని.. అంతేకాకుండా హిందీ భాషనే సమావేశాల్లో ఉపయోగించేవారని ఫిర్యాదులో మాజీ ఉద్యోగులు పేర్కొన్నారు.
టెస్టింగ్ విభాగంలో తనకంటే తక్కువ నైపుణ్యం కలిగిన వారిని, అనేక మంది దక్షిణాసియా (ఎక్కువగా భారతీయులు) ప్రాంతానికి చెందిన ఉద్యోగులనే నియమించుకునే వారని, తాను పట్ల చూపిస్తున్న వివక్షపై ఫిర్యాదు చేశానని.. అయితే ఫిర్యాదు చేసిన తర్వాత తన వేధింపులు ఎక్కవయ్యాయని బొల్టెన్ ఆరోపించారు. గత అక్టోబర్ లో కేసు నమోదు కాగా, తాజాగా మాజీ ఉద్యోగులు చేస్తున్న ఆరోపణలన్ని అవాస్తవాలని, కావున ఈ కేసును కొట్టివేయాలని కోర్టుకు ఇన్ఫోసిస్ విజ్క్షప్తి చేసింది.