వాణిజ్య ఒప్పంద లాభాలు | Four factors behind Sensexs 428 point rally | Sakshi
Sakshi News home page

వాణిజ్య ఒప్పంద లాభాలు

Published Sat, Dec 14 2019 4:28 AM | Last Updated on Sat, Dec 14 2019 4:28 AM

Four factors behind Sensexs 428 point rally - Sakshi

సుదీర్ఘకాలం ప్రతిష్టంభన తరువాత అమెరికా–చైనాల మధ్య వాణిజ్య ఒప్పందం దాదాపు ఖరారు కావడంతో శుక్రవారం స్టాక్‌ మార్కెట్‌ జోరుగా పెరిగింది. బ్రిటన్‌లో ప్రస్తుతం అధికారంలో ఉన్న బోరిస్‌ జాన్సన్‌ పార్టీయే ఎన్నికల్లో గెలవడంతో ప్రపంచ మార్కెట్లు బాగా పెరిగాయి. బీఎస్‌ఈ సెన్సెక్స్‌ 41,000 పాయింట్లపైకి, ఎన్‌ఎస్‌ఈ నిఫ్టీ 12,050 పాయింట్లపైకి ఎగబాకాయి. పారిశ్రామికోత్పత్తి, ద్రవ్యోల్బణ గణాంకాలు బలహీనంగా ఉన్నా,  ముడి చమురు ధరలు 1 శాతం మేర పెరిగినా, అంతర్జాతీయ సంకేతాలు సానుకూలంగా ఉండటంతో సెన్సెక్స్, నిఫ్టీలు దూసుకుపోయాయి.

డాలర్‌తో రూపాయి మారకం బలపడటం కొనసాగడం కలసివచ్చింది. సూచీలు వరుసగా మూడో రోజూ లాభపడ్డాయి.  సెన్సెక్స్‌ 428 పాయింట్ల లాభంతో 41,010 పాయింట్ల వద్ద, నిఫ్టీ 115 పాయింట్లు పెరిగి 12,087 పాయింట్ల వద్ద ముగిశాయి. ఇక వారం పరంగా చూస్తే, సెన్సెక్స్‌ 565 పాయింట్లు, నిఫ్టీ 165 పాయింట్లు చొప్పున లాభపడ్డాయి.  ఈ ఏడాది నవంబర్‌లో రిటైల్‌ ద్రవ్యోల్బణం మూడేళ్ల గరిష్ట స్థాయికి ఎగసింది. ఈ అక్టోబర్‌లో పారిశ్రామికోత్పత్తి వరుసగా మూడో నెలలోనూ క్షీణించింది. ఇలాంటి ప్రతికూలతలు ఉన్నప్పటికీ, మన మార్కెట్‌ లాభాల్లోనే ఆరంభమైంది. రోజంతా ఈ జోరు కొనసాగింది. ఇంట్రాడేలో సెన్సెక్స్‌ 475 పాయింట్ల మేర లాభపడింది.  ఆసియా, యూరప్‌ మార్కెట్లు 0.5 శాతం నుంచి 2.5 శాతం మేర లాభపడ్డాయి.   


లోహ షేర్ల ర్యాలీ  
లోహ షేర్లు దుమ్ము రేపాయి. అమెరికా–చైనాల మధ్య వాణిజ్య ఒప్పందం దాదాపు ఖరారు కావడంతో లోహ షేర్లు లాభపడ్డాయి. ఈ దేశాల మధ్య వాణిజ్య ఉద్రిక్తతల కారణంగా గత కొంత కాలంగా ఈ షేర్లు నష్టపోయాయి. వేదాంత, హిందాల్కో, కోల్‌  ఇండియా, సెయిల్, జేఎస్‌డబ్ల్యూ స్టీల్, నాల్కో, ఎన్‌ఎమ్‌డీసీ, హిందుస్తాన్‌ జింక్‌లు 0.2 శాతం నుంచి 3.6 శాతం రేంజ్‌లో లాభపడ్డాయి.  

► యాక్సిస్‌ బ్యాంక్‌ షేర్‌4.1 శాతం లాభంతో రూ.752 వద్ద ముగిసింది. సెన్సెక్స్‌లో బాగా లాభపడిన షేర్‌ ఇదే.  

► భారతీ ఎయిర్‌టెల్‌ షేర్‌ 2 శాతం నష్టంతో రూ.427 వద్ద ముగిసింది. సెన్సెక్స్‌లో బాగా నష్టపోయిన షేర్‌ ఇదే.  

► 31 సెన్సెక్స్‌ షేర్లలో 25 షేర్లు లాభపడగా, ఆరు షేర్లు నష్టపోయాయి. హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంక్, హిందుస్తాన్‌ యునిలివర్, ఏషియన్‌ పెయింట్స్, బజాజ్‌ ఆటో, కోటక్‌ మహీంద్రా బ్యాంక్, ఎయిర్‌టెల్‌లు నష్టపోయాయి.  
► ఇంగ్లాండ్, ఇతర యూరప్‌ దేశాల్లో కార్యకలాపాలు నిర్వహిస్తున్న కంపెనీల షేర్లు పెరిగాయి. టాటా మోటార్స్, భారత్‌ ఫోర్జ్, మదర్సన్‌ సుమి, టీసీఎస్‌ తదితర షేర్లు లాభపడ్డాయి.


లాభాలు ఎందుకంటే..
1 అమెరికా–చైనాల మధ్య కుదిరిన డీల్‌
అమెరికా–చైనాల మధ్య దాదాపు 17 నెలలుగా సాగుతున్న వాణిజ్య యుద్ధం ఇక ముగిసినట్లే .వాణిజ్య ఉద్రిక్తతల నివారణకు సంబంధించి తొలి దశ ఒప్పందం దాదాపు ఖరారైంది. దీంతో ఈ నెల 15 నుంచి అమల్లోకి రానున్న ప్రతిపాదిత సుంకాలు రద్దవుతాయి.  అంతే కాకుండా ప్రస్తుతం చైనాపై విధిస్తున్న సుంకాలు 50% మేర తగ్గుతాయి. తాజా వాణిజ్య ఒప్పందం ఇరు దేశాలకు ప్రయోజనం చేకూర్చనుందని మార్కెట్‌ వర్గాలు భావిస్తున్నాయి.

2 బోరిస్‌ జాన్సన్‌కు మెజారిటీ
ఇంగ్లాండ్‌లో ఇటీవల జరిగిన ఎన్నికల్లో ప్రస్తుతం అధికారంలో ఉన్న బోరిస్‌ జాన్సన్‌కు చెందిన కన్జర్వేటివ్‌ పార్టీకి భారీ మెజారిటీ దక్కింది. దీంతో మూడున్నరేళ్ల బ్రెగ్జిట్‌(యూరోపియన్‌ యూనియన్‌ నుంచి బ్రిటన్‌ వైదొలగడం) అనిశ్చితికి తెరపడనున్నది. వచ్చే నెల చివరికల్లా బ్రెగ్జిట్‌ పూర్తవుతుందని అంచనా. మరోవైపు అమెరికా ఫెడరల్‌ రిజర్వ్‌ లాగానే యూరోపియన్‌ కేంద్ర బ్యాంక్‌కు రేట్లను పెంచకపోవడం కలిసొచ్చింది.

3. మరిన్ని తాయిలాలు...
ఆర్థిక మందగమనంతో కుదేలైన ఆర్థిక రంగాన్ని ఆదుకోవడానికి మరిన్ని తాయిలాలను కేంద్రం ప్రకటించగలదన్న అంచనాలతో కొనుగోళ్లు జోరుగా సాగాయి.

4. ఇతర కారణాలు...
ఎస్సార్‌ స్టీల్‌ దివాలా కేసుకు సంబంధించిన నిధులు అందే అవకాశాలున్నాయన్న వార్తల కారణంగా ఈ కంపెనీకి రుణాలిచ్చిన ప్రభుత్వ రంగ బ్యాంక్‌ షేర్లు లాభపడ్డాయి. ఎఫ్‌పీఐ బాండ్లలో ఇన్వెస్ట్‌ చేసే పరిమితిని కనీసం 10% మేర పెంచాలని కేంద్రం యోచిస్తోందన్న వార్తలు సానుకూల ప్రభావం చూపించాయి. 

No comments yet. Be the first to comment!
Add a comment

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement