ఈక్విటీల్లోకి పెట్టుబడుల వరద
♦ ఆరు నెలల్లో రూ.97,000 కోట్లు
♦ ఇన్వెస్ట్ చేసిన ఎఫ్‌పీఐ, మ్యూచువల్ ఫండ్స్ సంస్థలు
♦ మార్కెట్ల రికార్డులకు వెన్నుదన్ను
♦ విదేశీ ఇన్వెస్టర్లకు దీటుగా దేశీయ ఇన్వెస్టర్ల పెట్టుబడులు
♦ ఇది ఆరోగ్యకర సంకేతమంటున్న నిపుణులు
న్యూఢిల్లీ: ఈక్విటీ మార్కెట్ల భారీ ర్యాలీకి విదేశీ పోర్ట్ ఫోలియో ఇన్వెస్టర్లు (ఎఫ్‌పీఐ), మ్యూచువల్ ఫండ్ (ఎంఎఫ్) సంస్థలు వెన్నుదన్నుగా నిలుస్తున్నాయి. ఇందుకు నిదర్శనం ప్రస్తుత ఏడాది తొలి ఆరు నెలల్లో వీరు నికరంగా రూ.97,705 కోట్లను పెట్టుబడులుగా పెట్టడమే. వీటిలో ఫారిన్ పోర్ట్‌ఫోలియో ఇన్వెస్టర్లు (ఎఫ్‌పీఐలు) రూ.55,908 కోట్లు ఇన్వెస్ట్ చేయగా, ఫండ్స్ పెట్టుబడులు రూ.41,797 కోట్లుగా ఉన్నాయి. 2016 సంవత్సరం తొలి ఆరు నెలల కాలంలో పోల్చి చూస్తే ఈ ఏడాదిలో ఎఫ్‌పీఐలు, మ్యూచువల్ ఫండ్స్ మూడు రెట్లు అధికంగా పంప్ చేయడం విశేషం.
బుల్ మార్కెట్ వాతావరణాన్ని ఇది ప్రతిబింబిస్తోందని విశ్లేషకులు పేర్కొంటున్నారు. 2016 తొలి ఆరు నెలల్లో ఈక్విటీల్లో ఎఫ్‌పీఐలు, మ్యూచువల్ ఫండ్స్ నికర పెట్టుబడులు రూ.28,811 కోట్లుగా ఉన్నాయి. సెన్సెక్స్, నిఫ్టీ జీవితకాల గరిష్ట స్థాయిల్లో ట్రేడవుతున్న విషయం తెలిసిందే. ఎఫ్‌పీఐలు, ఫండ్స్ నుంచి వస్తున్న నిధుల వెల్లువలు సూచీలు ఈ స్థాయికి చేర డంలో ప్రధాన పాత్ర పోషించాయని చెప్పుకోవాలి. మార్కెట్లు ఈ ఏడాదిలో ఇప్పటికే 18 శాతానికి పైగా పెరిగి ప్రపంచంలో మంచి పనితీరు చూపించిన మార్కెట్లుగా నిలిచాయి. మిడ్, స్మాల్ క్యాప్‌లలో అయితే ఈ పెరుగుదల మరింత వేగంగా ఉంది. ఈ సూచీలు సమారు 30 శాతం మేర పెరగడం గమనార్హం.
11 నెలలుగా ఫండ్స్ జోరు
మ్యూచువల్ ఫండ్స్ ఈ ఏడాది జనవరి – జూన్ కాలంలో పెట్టిన పెట్టుబడులు రూ.41,797 కోట్లు కాగా, వీటిలో రూ.30,328 కోట్లు (మొత్తంలో 78 శాతం) కేవలం మూడు నెలలు ఏప్రిల్–జూన్ త్రైమాసికంలో వచ్చినవే. అంతేకాదు, 2016 ఆగస్ట్ నుంచి ఇప్పటి వరకూ ఫండ్స్ ఈక్విటీ విభాగంలో నికర కొనుగోలుదారులుగానే కొనసాగుతున్నాయి. మ్యూచువల్ ఫండ్స్ పట్ల ప్రాచుర్యం, అవగాహన పెరగడం వీటిలోకి నిధుల రాక అధికం కావడానికి కారణంగా నిపుణులు పేర్కొంటున్నారు. ఇక ఎఫ్‌పీఐల రూ.55,908 కోట్ల పెట్టుబడుల్లో ఒకటో వంతు రూ.16,097 కోట్లు ఐపీవో మార్గంలో వచ్చినవి కావడం గమనార్హం. కేంద్రంలో నరేంద్ర మోదీ సర్కారు ఏర్పాటైన తర్వాత అంటే 2014 జూన్ క్వార్టర్‌లో ఎఫ్‌పీఐలు భారీగా రూ.59,521 కోట్లను ఈక్విటీల్లోకి పంప్ చేయగా, ఆ తర్వాత అత్యధికంగా ఇన్వెస్ట్ చేసింది ఈ ఏడాది తొలి ఆరు నెలల కాలంలోనే.
ఎఫ్‌పీఐలు, ఫండ్స్ 2008 తొలి ఆరు నెలల్లో నికరంగా రూ.17,114 కోట్ల నిధుల్ని వెనక్కి తీసుకోగా, ఇక ఆ తర్వాత ఇప్పటి వరకూ ఏటా తొలి ఆరు నెలల్లో నికర కొనుగోలుదారులుగానే ఉన్నారు. ఇక ముందూ మన మార్కెట్లు దేశ, విదేశీ ఇన్వెస్టర్ల పెట్టుబడులను ఆకర్షిస్తాయనే పరిశీలకులు భావిస్తున్నారు. సమీప కాలంలో పెట్టుబడుల ఉపసంహరణకు అవకాశం ఉన్నప్పటికీ అది సాధారణ ప్రక్రియలో భాగమేనంటున్నారు. ‘‘దీర్ఘకాలంలో వృద్ధి పరంగా భారత్‌కు ఉన్న అవకాశాలు అంతర్జాతీయ ఇన్వెస్టర్లను ఆకర్షిస్తున్నాయి. ప్రోత్సాహకరమైన అంశమేమిటంటే దేశీయ ఇన్వెస్టర్ల నుంచి కూడా పెట్టుబడులు పెరగడం. ఇది మార్కెట్ల ఆరోగ్యానికి ఎంతో మంచిది. దీనివల్ల అంతర్జాతీయ అంశాల కారణంగా దేశీయ మార్కెట్లలో ఆటుపోట్లు తగ్గుతాయి’’ అని వేద ఇన్వెస్ట్‌మెంట్ మేనేజర్స్ వ్యవస్థాపకుడు జ్యోతివర్ధన్ జైపూరియా పేర్కొన్నారు.
ఇన్వెస్టర్లలో పరిణతి
ఇన్వెస్టర్లలో పరిణతి పెరిగింది. నిపుణుల ఆధ్వర్యంలో సరైన నియంత్రణలతో నడిచే మ్యూచువల్ ఫండ్స్ పెట్టుబడులకు సురక్షితమని వారు అర్థం చేసుకుంటున్నారు. అదే సమయంలో ఇతర పెట్టుబడి సాధనాలైన రియల్టీ, బంగారం ఆకర్షణను కోల్పోయాయి. దీంతో వారు ఫండ్స్‌లో ఇన్వెస్ట్ చేస్తున్నారు – నీలేష్‌షా, ఎండీ,కోటక్ మహింద్రా అస్సెట్ మేనేజ్‌మెంట్