రూ.251కే స్మార్ట్‌ఫోన్? ఇస్తారా? | Freedom 251 Officially Launched; No Government Involvement, Confirms Company | Sakshi
Sakshi News home page

రూ.251కే స్మార్ట్‌ఫోన్? ఇస్తారా?

Published Thu, Feb 18 2016 1:00 AM | Last Updated on Fri, Mar 29 2019 8:33 PM

రూ.251కే స్మార్ట్‌ఫోన్? ఇస్తారా? - Sakshi

రూ.251కే స్మార్ట్‌ఫోన్? ఇస్తారా?

బుధవారం రాత్రి ఆవిష్కరించిన
బీజేపీ ఎంపీ మురళీ మనోహర్ జోషీ
కార్యక్రమానికి హాజరుకాని రక్షణ మంత్రి పారిక్కర్
గురువారం నుంచి బుకింగ్‌లు ప్రారంభమన్న కంపెనీ
ఈ ధరకు ఇవ్వటం అసాధ్యమంటున్న నిపుణులు


 సాక్షి, ప్రత్యేక ప్రతినిధి :నాలుగు అంగుళాల టచ్ స్క్రీన్... 1 జీబీ ర్యామ్... 8 జీబీ ఇంటర్నల్ మెమరీ... 0.3 మెగాపిక్సెల్ ఫ్రంట్ కెమెరా... 3.2 మెగాపిక్సెల్ రియర్ కెమెరా. వీటన్నిటికీ తోడు ఇది క్వాల్‌కామ్ 1.3 గిగాహెర్ట్జ్ క్వాడ్ కోర్ ప్రాసెసర్‌తో నడిచే త్రీజీ ఫోను. ఆండ్రాయిడ్ లాలీపాప్ వెర్షన్‌కు జతగా 1,450 ఎంఏహెచ్ బ్యాటరీ. నిజానికివన్నీ చూస్తే ఈ ఫోను ఏ 3వేలో... అంతకన్నా ఎక్కువో ఉండాలి. కానీ రూ.251కే ఇస్తానంటూ దేశవ్యాప్తంగా దుమారం లేపింది రింగింగ్‌బెల్స్ అనే నాలుగు నెలల అనామక కంపెనీ. ప్రపంచంలో కోట్ల ఫోన్లమ్మే ఏ దిగ్గజ కంపెనీ కూడా... కనీసం రూ.1,500కు కూడా విక్రయించలేని ఈ ఫీచర్లున్న ఫోన్‌ను రింగింగ్‌బెల్స్ మాత్రం రూ.251కే ఇస్తానని, అదికూడా ఆన్‌లైన్లో తన సొంత వెబ్‌సైట్లో ఈ నెల 18 నుంచి 22 మధ్య బుక్ చేసుకోవాలని చెబుతోంది.

 ఇన్ని ఫీచర్లున్న ఈ ఫోన్‌తో పాటు చార్జర్, హెడ్‌ఫోన్, డేటా కార్డ్ కూడా ఆ రూ.251లోనే ఇస్తానని కంపెనీ చెబుతుండటం ఆశ్చర్యపోదగ్గ విషయమే. కాకపోతే దీన్ని బుధవారం సాయంత్రం రక్షణ మంత్రి మనోహర్ పారిక్కర్, బీజేపీ ఎంపీ మురళీ మనోహర్ జోషి ఢిల్లీలో జరిగే ఓ కార్యక్రమంలో ఆవిష్కరిస్తారని కంపెనీ ప్రకటించింది. కానీ ఆ కార్యక్రమానికి రక్షణ మంత్రి హాజరు కాలేదు. బీజేపీ ఎంపీ మురళీ మనోహర్ జోషి చేతుల మీదుగా కంపెనీ డెరైక్టర్ మొహిత్ గోయెల్, సీఈఓ ధారణ గోయెల్ ఆవిష్కరించారు. కంపెనీ తన రెగ్యులర్ వెబ్‌సైట్ రింగింగ్‌బెల్స్.కో.ఇన్‌ను పక్కనబెట్టి... ఫ్రీడమ్251.కామ్ అనే మరో వెబ్‌సైట్‌ను ఈ ఫోన్‌కోసమే ఏర్పాటు చేసింది. నిజానికి రింగింగ్‌బెల్స్ సైట్‌లో తాను ఇప్పటికే స్మార్ట్101 అనే ఫోన్‌తో సహా మూడు ఫోన్లను విక్రయించినట్లుగా చూపెడుతున్నా... అవేవీ మార్కెట్లో లేవు. తక్షణం కొందామని చూసినా... అవన్నీ అమ్ముడుపోయాయని, అందుబాటులో లేవని వెబ్‌సైట్ చెబుతోంది.

 ‘ఆకాశ్’లా సబ్సిడీ కూడా లేదట?
 ఆకాశ్ ట్యాబ్లెట్ గురించి మనలో తెలియని వారెవ్వరూ ఉండరు. ట్యాబ్లెట్ పీసీలు ఒక్కొక్కటి రూ.15వేలకు పైనే పలుకుతున్న సమయంలో దాన్ని రూ.1,500కే ఇస్తామంటూ డేటావిండ్ సంస్థ ముందుకొచ్చింది. మరో రూ.1,500 ప్రభుత్వం సబ్సిడీగా ఇస్తానంది. దీన్ని అప్పట్లో నాటి కేంద్ర మంత్రి కపిల్ సిబాల్ ఆవిష్కరించారు కూడా. కాకపోతే చాలామంది దీనికోసం రిజిస్టరు చేసుకుని రూ.1,500 చొప్పున కట్టినా వేళ్లమీద లెక్కపెట్టగలిగేటంత మందికి తప్ప... మిగతా వారికి ఫోన్లుగానీ, డబ్బులు గానీ రాలేదు. ఇండియాలో తయారు చేస్తామని ప్రభుత్వం ద్వారా లబ్ధి పొందిన ఈ సంస్థ... చైనా నుంచి పూర్తిగా తయారైనవి కొన్ని దిగుమతి చేసుకుని... మొత్తంగా అందరినీ ముంచేసింది.

రింగింగ్‌బెల్స్ ఫోన్‌కు కూడా ప్రభుత్వం సబ్సిడీ ఇవ్వవచ్చని భావించినా... అలాంటి సబ్సిడీ ఏదీ లేదని కంపెనీ డెరైక్టర్ మొహిత్ గోయెల్ స్పష్టంచేశారు. నోయిడా, ఉత్తరాఖండ్‌లో ప్రయోగాత్మకంగా రెండు ప్లాంట్లు పెడుతున్నామని, వీటికి 5 లక్షల ఫోన్లను తయారు చేయగల సామర్థ్యం ఉందని చెప్పారు. నిజానికి ఈ కంపెనీ పెట్టింది 5 నెలల కిందటే. అది కూడా టెలికం పరికరాల డిజైనింగ్, తయారీ తదితరాల పేరిట. కాకపోతే ఈ కామర్స్ కూడా చేస్తామని గతనెలలో కంపెనీ ఆర్‌ఓసీకి చెప్పింది. నెల తిరిగేసరికల్లా తాజా ప్రకటన చేసింది. కంపెనీని మోహిత్, అన్మోల్ గోయెల్ ఏర్పాటు చేయగా... కొద్ది నెలల కిందట అన్మోల్ రాజీనామా చేసి తన షేర్లను కూడా మోహిత్‌కే ఇచ్చేసి బయటపడటం గమనార్హం.

బుక్ చేస్తే ఫోన్లు వస్తాయా?
తయారీకి ప్లాంట్లు పూర్తిస్థాయిలో లేవు. దిగుమతి చేసుకుంటే ఈ ధరకు రావు. కాబట్టి రూ.251 మాత్రమే కదా అని జనం భారీగా రిజిస్ట్రేషన్లు చేయించుకున్నా వారికి ఫోన్లను ఎలా సరఫరా చేస్తుందన్నది ప్రశ్నార్థకమే. కంపెనీ మాత్రం జూన్‌లోగా సరఫరా చేస్తామంటోంది. ‘‘చవగ్గా వస్తోంది కదా అని లక్షల మంది రిజిస్ట్రేషన్లు చేయించుకుంటారు. ఒకవేళ 50 లక్షల మంది రిజిస్ట్రేషన్ చేయించుకుంటే కంపెనీకి రూ.125 కోట్లు వస్తాయి. కంపెనీ ఫోన్లు ఇవ్వకపోయినా... తనది పోయింది రూ.251 మాత్రమే కదా అని ఎవ్వరూ పెద్దగా పట్టించుకోరు’’ అని ఫోన్ల రిటైల్ షాప్ ప్రతినిధి ఒకరు వ్యాఖ్యానించారు.
 
ఆ ధరకు అసాధ్యం: ఇన్‌ఫోకస్
ఈ ధరకు ఫోన్ ఇవ్వటం సాధ్యమా? అని అమెరికాకు చెందిన హ్యాండ్‌సెట్ తయారీ సంస్థ ఇన్‌ఫోకస్ అభిప్రాయపడింది. ‘‘వాళ్లు చెప్పిన ఫీచర్లతో రూ.251కి ఫోన్ తయారు చేయటం అసాధ్యం. నాకైతే వాళ్లెలా చేస్తున్నారన్నది అర్థం కావటం లేదు. ఇలాంటివి ప్రచారం చేసేటపుడు ఎవరైనా నిజ నిర్ధారణ చేసుకోవాలి. వింటుంటేనే నవ్వొస్తోంది’’ అని ఇన్‌ఫోకస్ ఇండియా హెడ్ సచిన్ థాపర్ తనను సంప్రదించిన ‘సాక్షి’ బిజినెస్ బ్యూరో ప్రతినిధితో చెప్పారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement