చూసి కొంటే... విమానయానం చౌకే | From the Travel Desk: How to file a complaint about an airline | Sakshi
Sakshi News home page

చూసి కొంటే... విమానయానం చౌకే

Published Sun, Apr 19 2015 2:42 AM | Last Updated on Sun, Sep 3 2017 12:28 AM

చూసి కొంటే... విమానయానం చౌకే

చూసి కొంటే... విమానయానం చౌకే

* కాస్తంత ప్లానింగ్‌తో డబ్బులు ఆదా
* ఆఫర్లు, డిస్కౌంట్ల అసలు రహస్యమిదిగో..

వేసవి సెలవులు మొదలయ్యాయి. టూర్ ప్లాన్లు  షురూ అవుతున్నాయి. అయితే ఎక్కడికెళ్లాలన్నా అన్నిటికన్నా ముఖ్యమైంది రవాణాయే. దూరాన్ని బట్టి రైలో, బస్సో, విమానమో ఎంచుకోవాల్సిందే. కాకపోతే కాస్త చల్లటి ప్రదేశాలంటే మనకు దూరమే కనుక రైలు కన్నా విమాన ప్రయాణానికే ఎక్కువ మంది మొగ్గుతుంటారు. చార్జీలెక్కువే కానీ... కాస్త ముందుగా ప్లాన్ చేసుకుంటే చౌకగానే దొరుకుతాయి.

కొన్ని సందర్భాల్లో అయితే రైల్లో థర్డ్ క్లాస్ ఏసీ టికెట్ ధర కంటే తక్కువ రేటుకే కొన్ని విమానాల్లో విహరించే రోజులు వచ్చేశాయంటే అతిశయోక్తి కాదు. బడ్జెట్ ఎయిర్‌లైన్స్ పుణ్యమా అని సామాన్యునికీ విమానయానం అందుబాటులోకి వచ్చేసింది. కానీ  చౌకగా టికెట్లు కావాలంటే కొంత ప్రణాళిక తప్పనిసరి. అదేంటి? ఏ సమయంలో టికెట్లు చౌకగా దొరుకుతాయి? అసలు విమాన టికెట్ల రహస్యమేంటి? ఆన్‌లైన్లో విమాన కంపెనీల వెబ్‌సైట్లో కొంటే లాభమా... లేక మధ్యవర్తుల (ఆగ్రిగేటర్ల) వద్ద కొంటే లాభమా? వారంలో ఏఏ రోజులైతే టికెట్లు చౌకగా దొరుకుతాయి? ఇవన్నీ వివరించేదే ఈ వారం ప్రాఫిట్ కథనం...

 
హైదరాబాద్‌లో పనిచేసే తిరుమల్ సెలవులకి సొంతూరు వైజాగ్ వెళ్దామనుకున్నాడు. ఈ లోగా ఒక ఎయిర్‌లైన్ సంస్థ ప్రమోషనల్ ఆఫర్ కింద బేస్ ఫెయిర్‌కే టికెట్లు ప్రకటించటంతో ఒకసారి అదృష్టాన్ని పరీక్షించుకుందాం అనుకున్నాడు. ఆన్‌లైన్‌లో ఓపెన్ చేయగానే రూ.300కే ఒకవైపు టికెట్లు దొరకటంతో తన ఆనందానికి అవధులు లేకుండా పోయాయి. రైల్‌లో స్లీపర్ క్లాస్ కంటే చౌకగా టికెట్లు దక్కించుకోవడమే కాకుండా... తొలిసారి కుటుంబమంతా విమాన ప్రయాణ అనుభూతిని సొంతం చేసుకున్నారు. విమాన టికెట్లు కొనుగోలు చేసేముందు నాలుగు విషయాలను దృష్టిలో పెట్టుకుంటే ఇలాంటి ఆఫర్లు మీకూ సొంతమవుతాయి. అవేంటంటే...
 
ఆఫర్లు పరిమితమైన సీట్లకే
ఎయిర్‌లైన్స్ సంస్థలు ప్రకటించే ఆఫర్లు చాలా కొద్ది సీట్లకు మాత్రమే వర్తిస్తాయి. సాధారణంగా నూటికి 2 నుంచి 5 సీట్లకు మాత్రమే ఈ డిస్కౌంట్ రేట్లకు లభిస్తాయి. ఉదాహరణకు 180 సీట్లున్న విమానాన్ని తీసుకుంటే ఆఫర్ పరిధిలో గరిష్టంగా 9 సీట్లకు మించి ఉండవు. అంటే ఈ ఆఫర్లు చాలా తక్కువ మందికి మాత్రమే లభిస్తాయి. అంతేకాదు ఈ టికెట్లను నేరుగా ఆ సంస్థకు చెందిన అధికారిక వెబ్‌సైట్ ద్వారానే బుక్ చేసుకోవాల్సి ఉంటుంది. అందుకని ఎపుడైనా ఆఫర్ గురించి తెలిస్తే వెంటనే సదరు కంపెనీ వెబ్‌సైట్ ఓపెన్ చేసి వెదకటం ఉత్తమం. తరవాత చూద్దాంలే అనుకుంటే... ఆఫర్ దొరకటం కష్టం. అయితే ఈ ఆఫర్ల పరిధిలోకి మీరు రాకపోయినా అంతగా ఆందోళన చెందాల్సిన అవసరం లేదు. చౌక విమానయానానికి ఇంకా అనేక మార్గాలున్నాయి.
 
అగ్రిగేటర్లను సంప్రదించండి
ఈ ఆఫర్ల సమయాల్లో కాకుండా మిగిలిన సందర్భాల్లో చౌక టికెట్లను పొందాలంటే ట్రావెల్ అగ్రిగేటర్లను సంప్రదించటమే మేలు. మేక్ మై ట్రిప్, యాత్రా, ట్రావెల్‌గురు, గోఐబీబో, క్లియర్ ట్రిప్, వయా డాట్ కామ్ పేరుతో అనేక ఆన్‌లైన్ బుకింగ్ సంస్థలున్నాయి. ఈ సంస్థలతో విమానయాన సంస్థలు ముందే ఒప్పందాలు కుదుర్చుకుంటాయి. పెపైచ్చు ఈ ఆన్‌లైన్ ట్రావెల్ సంస్థలు విమానయాన సంస్థల దగ్గర నుంచి టికెట్లను ముందుగానే కొని బ్లాక్ చేసుకుంటాయి. కాబట్టి వీటికి టికెట్లు తక్కువ రేటుకే వస్తాయి. ఆ సంస్థ అమ్మే టికెట్లను బట్టి ఎయిర్‌లైన్ సంస్థలు వాటికి చౌకగా టికె ట్లివ్వటమే కాకుండా లాయల్టీలు, బోనస్‌లు కూడా ఇస్తుంటాయి.

వ్యాపారం పెంచుకోవటానికి సదరు సంస్థలు ఆ ప్రయోజనాల్ని ప్రయాణికులకు బదలాయిస్తాయి. అందుకే నేరుగా విమానయాన కంపెనీ వెబ్‌సైట్ రేట్ల కంటే ఈ అగ్రిగేటర్ల దగ్గర టికెట్ ధరలు తక్కువగా ఉంటాయి. అందుకే టికెట్ తీసుకునేటప్పుడు మీరు ఎంచుకున్న గమ్యానికి ఏ ఆన్‌లైన్ ట్రావెల్ సంస్థ తక్కువ రేటును ఆఫర్ చేస్తోందో పరిశీలించడం మర్చిపోవద్దు. కొన్ని సందర్భాల్లో ఎయిర్‌లైన్స్‌కు సంబంధించిన వెబ్‌సైట్ ద్వారా సీట్లు లభించకపోయినా... ఈ అగ్రిగేటర్ల దగ్గర సీట్లు లభిస్తాయంటే పరిస్థితి అర్థం చేసుకోవచ్చు.

ప్రస్తుతం ఇండియాలో 60 శాతానికిపైగా టికెట్లు ఆన్‌లైన్ టికెటింగ్ సంస్థల ద్వారానే జరుగుతున్నాయి. ఇప్పుడు చాలా అగ్రిగేటర్లు గరిష్టంగా 40% వరకు డిస్కౌంట్లను  ఆఫర్ చేస్తున్నాయి. మరో ముఖ్యమైన అంశమేంటంటే విమాన టికెట్లు, హోటల్ బుకింగ్ కలిపి గనక చేస్తే కొన్ని ఆన్‌లైన్ ట్రావెల్ ఆగ్రిగేట్ సంస్థలు భారీ డిస్కౌంట్లు ఆఫర్ చేస్తున్నాయి. ముందస్తు బుకింగ్ సమయాన్ని బట్టి విడిగా విమానం టిక్కెట్, హోటల్ బుక్ చేస్తే అయ్యే చార్జీల కంటే ఇది 30-50% కూడా తక్కువకు లభిస్తుంటాయి. అందుకే ఈ ప్యాకేజీలు లభించినపుడు అవసరాన్ని బట్టి బుక్ చేసుకుంటేనే ఉత్తమం.
 
ముందుగా బుక్ చేసుకోవాలి...
రైల్వే టికెట్లు 120 రోజులు కంటే ముందుగా బుక్ చేసుకోవడానికి వీలుండదు. కానీ విమాన టికెట్ల అడ్వాన్స్ రిజర్వేషన్‌పై ఎటువంటి పరిమితి లేదు. సంవత్సరం ముందుగా టికెట్లు బుక్ చేసుకోవచ్చు. ముందుగా బుక్ చేసుకునే టికెట్లతో పోలిస్తే చివరి క్షణంలో బుక్ చేసుకునే టికెట్ల ధరలు రెట్టింపు స్థాయిలో ఉంటాయి. అందుకే చౌక విమానయానం కావాలంటే  ముందస్తుగా టికెట్లను బుక్ చేసుకోవాల్సి ఉంటుంది. 90 రోజుల నుంచి ప్రయాణ తేదీ దగ్గర పడే కొద్ది టికెట్ల ధరలు వేగంగా పెరిగిపోతుంటాయనేది ట్రావెల్ వర్గాల మాట.

ఈ ధరల పెరుగుదల కూడా బుకింగ్ అయిన టికెట్లను బట్టి ఆధారపడి ఉం టుంది. ఉదాహరణకు హైదరాబాద్ నుంచి ఢిల్లీకి చివర్లో టికెట్ తీసుకుంటే సగటున రూ.8,000 ఉంటుంది. కానీ 90-120 రోజుల ముందు విమానయాన సంస్థలు రూ. 1,000 నుంచి టికెట్ అమ్మ డం మొదలు పెడుతుంటాయి. అయితే ఈ ధరకు గరిష్టంగా 5% మించి టికెట్లు అమ్మవు. ఆ తర్వాత మరో 10% టికెట్లను రూ.2,000 ధర కు, ఆపైన రూ.3,000 ధరకు కొన్ని సీట్లను  విక్రయించుకుంటూ పోతాయి. ప్రయాణ తేదీ దగ్గర పడే కొద్దీ టికెట్ ధర పెరగడానికి ఇదీ కారణం.
- సాక్షి పర్సనల్ ఫైనాన్స్ విభాగం
 
టైమ్ కూడా ముఖ్యమే

విమాన టికెట్ ధరలను మీరు ప్రయాణించే వారం, సమయం కూడా నిర్దేశిస్తుంటాయి. సాధారణంగా వారం ప్రారంభంలో, వారాంతంలో అంటే ఆది, సోమ, శనివారాల్లో టికెట్ల ధరలు 25 శాతం అధికంగా ఉంటాయి. మిగిలిన రోజుల్లో మంగళవారం, బుధవారం, గురువారం తక్కువగా ఉంటాయి. కొన్ని రూట్లలో శుక్రవారం ధరలు ఎక్కువగా ఉంటాయి. లేకపోతే సాధారణ రేట్లకే లభిస్తాయి. అలాగే ఉదయం 6 గంటల నుంచి 9 గంటల మధ్యలో, సాయంత్రం 5-8 గంటల సమయాల్లో ప్రయాణించే విమానాలకు డిమాండ్ అధికంగా ఉంటుంది. దీంతో ఈ సమయంలో టికెట్ల ధరలు అధికంగా ఉంటాయి.

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement